iDreamPost
android-app
ios-app

ఐదు రాష్ట్రాల ఎన్నికలు : బీజేపీ జాబితాల్లో ట్విస్టులు

ఐదు రాష్ట్రాల ఎన్నికలు :  బీజేపీ జాబితాల్లో ట్విస్టులు

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో ఎలాగైనా విజయం కైవసం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. గతేడాదిలో ఎదురైన చేదు అనుభవం పునరావృతం కాకుండా ఉండేందుకు ఆచితూచి వ్యవహరిస్తోంది. గెలుపు అనేది అభ్యర్థులపైనే ఆధారపడి ఉండడంతో వారి ఎంపికలో చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. వారి వ్యక్తిగత ఛరిష్మాను తప్పా.. తండ్రుల చరిత్ర, సిట్టింగ్‌లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇప్పటి వరకూ విడుదలైన పలు రాష్ట్రాల జాబితాలో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. దివంగత సీఎం కొడుకైనంత మాత్రాన టికెట్‌ ఇవ్వలేమని గోవాలో ఉత్పల్‌ పారికర్‌కు షాక్‌ ఇచ్చింది.

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు 59 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను బీజేపీ విడుదల చేసింది. పది మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ ఇవ్వలేదు. వారిలో మాజీ సీఎం బీసీ ఖండూరీ కుమార్తె రీతూ ఖండూరీ భూషణ్‌ కూడా ఉన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి.. ఖటీమా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మొదటి జాబితాలో ఐదుగురు మహిళలకు సీటు కేటాయించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఉత్తరాఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు మదన్‌ కౌశిక్‌ మళ్లీ హరిద్వార్‌ నుంచే పోటీ చేస్తారని, మంత్రులు సత్పాల్‌ మహరాజ్‌, ధన్‌ సింగ్‌ రావత్‌లకూ సీట్లు కేటాయించామని ఆయన చెప్పారు. ఈ జాబితాలో 15 మంది అభ్యర్థులు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారు కాగా, ముగ్గురు వైశ్య వర్గానికి చెందినవారని వెల్లడించారు.

అలాగే.. నలభై స్థానాలు ఉండే గోవా అసెంబ్లీకి 34 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి జాబితాను విడుదల చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌.. సాంక్వెలిమ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గోవా ఎన్నికల ఇన్‌చార్జి దేవేంద్ర ఫడ్నవీస్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి అర్జున్‌ సింగ్‌ గురువారం ఈ జాబితాను విడుదల చేశారు. గోవా మాజీ సీఎం, దివంగత మనోహర్‌ పారికర్‌ కుమారుడు ఉత్పల్‌ పారికర్‌కు నిరాశ ఎదురైంది. పనాజి నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న ఉత్పల్‌కు బీజేపీ టికెట్‌ కేటాయించలేదు. ఆ టికెట్‌ను అటానాసియో మోన్సెరేట్‌కు పార్టీ కేటాయించింది. ప్రస్తుతం ఆయన పనాజిలో సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటి జాబితాలో ఇద్దరు మహిళలకు టికెట్‌ దక్కింది.ఇక మంత్రులు దీపక్‌ పౌస్కర్‌, ఫిలిప్‌ నేరి రోడ్రిగస్‌, ఎమ్మెల్యే ఇసిడోర్‌ ఫెర్నాండెజ్ లకు టికెట్‌ దక్కలేదు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించలేదు. ఇదిలాఉంటే.. ఉత్పల్‌కు తాము టికెట్‌ ఇస్తామని ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించడం గమనార్హం. 

ఇదిలాఉండగా.. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలో కొందరు నేర చరితులు ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పంజాబ్‌లో ఆప్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సర్వేలు వెల్లడవుతున్న వేళ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ గట్టి కసరత్తు చేస్తోంది. 

Also Read : కమలంతో ఆ తల్లీకొడుకుల బంధం ముగిసినట్లే!