Idream media
Idream media
ఉత్తరప్రదేశ్ తోపాటు, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు పరీక్షగా మారాయి. ఆ పరీక్షలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం అయ్యేందుకు ప్రధాని మోదీ చేయాల్సిందంతా చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలు, నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ తరహాలో భారీ స్థాయిలో వలసలను ప్రోత్సహించకుండా, పార్టీని నమ్ముకున్న వారికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి మరింత ఉత్సాహంగా ఎన్నికలను ఎదుర్కొనేలా చేయాలని సంకల్పించారు. దీనిలో భాగంగా ఆయా రాష్ట్రాల నేతలతో అవకాశం ఉన్నప్పుడల్లా చర్చించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది.
అయితే.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వ్యాక్సినేషన్ విషయంలో జరిగిన ఆలస్యం.. సంక్షేమ పథకాల అమలుతో పాటు.. పెరిగిన నిత్యవసరాల ధరలు, ఎంతకూ తగ్గని నిరుద్యోగ సమస్యలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేలా భారీ పథకాలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. తాజాగా ఎర్రకోట వేదికగా యువతను ఆకట్టుకునేందుకు కోటి కోట్ల రూపాయలతో భారీ పథకాన్ని ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడగానే యువత ఆసక్తిగా దానికోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే కొద్ది రోజుల క్రితం రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. దీంతో పాటు ఆత్మ నిర్బల్ భారత్ 2 ద్వారా ప్రజలకు త్వరితగతిన లబ్ది చేకూర్చాలని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా ప్రజలను ఆకర్షించేలా మోదీ వ్యూహ రచన చేస్తున్నారు.
ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. ఉత్తరాఖండ్, పంజాబ్, యూపీలలో ప్రభుత్వంపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కలహాలు తమకు లాభం చేకూరుస్తాయని బీజేపీ భావిస్తోంది. అయితే.. వ్యవసాయ చట్టం నేపథ్యంలో బీజేపీకి అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు యూపీలో యోగి సర్కారు మీద అసంతృప్తి ఉంది. దీనిని దానిని అధిగమించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బ్రాహ్మణ వ్యతిరేక ఓటు ద్వారా పార్టీకి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా ఐదు రాష్ట్రాల్లోనూ తమకు జరిగే నష్టాన్ని ముందుగా గుర్తించి అందుకు తగ్గట్లు పరిష్కారాలు వెతకాలన్న యోచనలో బీజేపీ ఉంది. ఈ మేరకు మోదీ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో మోదీ ఇమేజ్ భారీగా దెబ్బ తిందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ ఆ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 2024 ఎన్నికలకు రెండేళ్లు ముందుగా జరిగే ఈ ఎన్నికల ఫలితాలు కేంద్రం మీద ప్రభావాన్ని చూపించటం ఖాయం. ఈ కారణంగానే బీజేపీ కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యూపీలో అధికారాన్ని నిలుపుకుంటేనే 2024 సార్వత్రిక ఎన్నికల వేళకు మనోబలం పెరుగుతుందన్న అంచనాతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల మనోభావాలు తెలుసుకోవటం కోసం నమో యాప్ ను సిద్ధం చేసింది. ఐదు రాష్ట్రాల్లోని వారికి ఈ యాప్ ను పరిచయం చేయటం.. వారి ద్వారా ఫీడ్ బ్యాక్ ను తీసుకునే పనిని ఇప్పటికే ప్రారంభించింది. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటముల్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటన్న విషయాల్ని ప్రజల నుంచి తెలుసుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఈ క్రమంలో మోదీ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
Also Read : సోము నోట.. చాన్నాళ్లకు ఆ మాట..!