iDreamPost
android-app
ios-app

సూపర్,ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం, క్రెడిట్ ఆ ఇద్దరికే…!

సూపర్,ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం, క్రెడిట్ ఆ ఇద్దరికే…!

మొదటి ఇన్నింగ్స్ లో 191 ఆల్ అవుట్… పిచ్ స్వింగ్ కు అనుకూలిస్తుంది… ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని పరిస్థితి. ఇంగ్లాండ్ బౌలర్లు బుల్లెట్లు మాదిరి విసురుతున్న బంతులు, ఊహించని రీతిలో అవుతున్న బౌన్స్, దానికి తోడు మోయీన్ అలీ తిప్పుతున్న స్పిన్… దానికి తోడు ఇంగ్లాండ్ 99 పరుగులు లీడ్ లో ఉండటం… ఎలా ఎలా అనుకుని ప్రతీ ఫ్యాన్ మ్యాచ్ గురించి ఆలోచనలో పడిన వేళ రెండో ఇన్నింగ్స్ లో టీం ఇండియా చెలరేగింది. ఓపెనర్ల నుంచి లోయర్ ఆర్డర్ వరకు… ఒక్క రహానే మినహా ప్రతీ ఆటగాడు బ్యాటింగ్ లో ఎంతో కొంత తమ సహకారం అందించారు.

ఒకరకంగా సీరీస్ డిసైడ్ చేసే మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకున్నారు. ఇంగ్లాండ్ పేస్ విభాగాన్ని తట్టుకుని నిలబడుతూ… పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఇద్దరూ శుభారంభం ఇచ్చారు. 83 పరుగుల వద్ద రాహుల్ (46) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సీనియర్ ఆటగాడు పుజారాతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ని జాగ్రత్తగా ముందుకు నడిపించాడు. తన దూకుడుని పక్కన పెట్టి అసలు సిసలు టెస్ట్ బ్యాట్స్మెన్ గా ఇన్నింగ్స్ ని గాడిలో పెట్టాడు.

ఈ క్రమంలో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత కూడా ఏ మాత్రం దూకుడు ప్రదర్శించకుండా ఇన్నింగ్స్ ని నడిపించగా… కొత్త బాల్ రావడం ఇండియాకు షాక్ తగిలింది. పిచ్ నుంచి అందుతున్న సహకారాన్ని ఇంగ్లాండ్ బౌలర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. ఒకే ఓవర్లో రాబిన్సన్ రోహిత్ శర్మ (256 బంతుల్లో 127), పుజారా (127 బంతుల్లో 61) అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఇండియా ఆట తీరుపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కెప్టెన్ కోహ్లీ, రవీంద్ర జడేజా జాగ్రత్తగా ఇన్నింగ్స్ ని నడిపించారు.

ఆచితూచి ఆడుతూ… బంతి పాతబడే వరకు ఎక్కడా త్వరపడలేదు. మూడో రోజు ముగిసే సమయానికి ఇద్దరూ క్రీజ్ లో ఉన్నారు. నాలుగో రోజు కాసేపు జాగ్రత్తగానే ఆడినా… క్రిస్ వోక్స్ వేసిన అద్భుత బంతికి జడేజా కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రహానే డకౌట్ కాగా… అనంతరం వచ్చిన పంత్ కూడా రోహిత్ మాదిరిగా… తన సహజ శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేసాడు. 44 పరుగుల వద్ద కోహ్లీ… అలీ బౌలింగ్ లో అవుట్ కాగా… క్రీజ్ లోకి వచ్చిన శార్దుల్ ఠాకూర్ తన విశ్వ రూపం చూపించాడు.

చక్కటి డిఫెన్స్ ఆడుతూనే చెత్త బంతులను ఫోర్లుగా మలిచాడు. పంత్ కూడా చాలా జాగ్రత్తగా ఆడుతూ అడపాదడపా ఫోర్లు బాదాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో ఠాకూర్ 60 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఏడు ఫోర్లు ఒక సిక్స్ తో ఇన్నింగ్స్ ముగించాడు. పార్ట్ టైం బౌలర్ కెప్టెన్… జో రూట్ ఠాకూర్ ని అవుట్ చేయగా ఆ తర్వాతి ఓవర్లో అలీ… పంత్ ని అవుట్ చేసాడు. భారీ షాట్ కి ప్రయత్నించి కాట్ అండ్ బౌల్డ్ గా వెనుతిరిగాడు. సరిగా ఇద్దరూ వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడి ఆడకపోయి ఉంటే… ఇండియా స్కోర్ 300కు పరిమితం అయి ఉండేది.

కీలక వికెట్ లు పడినా ఎక్కడా కూడా కంగారు పడలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ఉమేష్ యాదవ్, బూమ్రాలు ఇంగ్లాండ్ కు పట్టపగలే చుక్కలు చూపించారు. పంత్, ఠాకూర్ అవుటైన ఆనందం వాళ్లకు కాసేపు కూడా నిలవలేదు. టీ సమయానికి ఉమేష్ ఒక సిక్స్, బూమ్రా మూడు ఫోర్లతో నాట్ అవుట్ గా నిలిచారు. టీ తర్వాత బూమ్రా (38 బంతుల్లో 24 పరుగులు) ఒక ఫోర్ కొట్టి… దూకుడుగా ఆడే క్రమంలో అలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బూమ్రా అవుట్ అయిన తర్వాత ఉమేష్ యాదవ్ భారీ షాట్ లు ఆడేందుకు ప్రయత్నం చేసాడు.

భారీ షాట్ లు ఆడే క్రమంలో ఓవర్టన్ బౌలింగ్ లో అలీ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక ఫోర్ రెండు సిక్సులతో 23 బంతుల్లో 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీనితో ఇండియా 367 పరుగుల లీడ్ సాధించింది. ఇంగ్లాండ్ 368 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉంది. ఇంకా 38 ఓవర్లు నాలుగో రోజు ఉన్న నేపధ్యంలో ఇండియా కనీసం రెండు వికెట్ లు అయినా పడగొడితే మ్యాచ్ లో ఆధిక్యం దక్కినట్టే. లక్ష్యం భారీగా ఉండటంతో ఇంగ్లాండ్ దూకుడుగా ఆడే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి. కాబట్టి నేడు ఎంత వరకు ఇండియా కట్టడి చేస్తుంది అనే దాని మీదనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.