కర్ణాటకలో 2019లో జరిగిన ఐఎంఏ స్కామ్ అప్పట్లో సంచలనం రేకెత్తించింది. తాజాగా ఆ స్కామ్ లో చిక్కుకున్న ఐఏఎస్ అధికారి విజయ్ శంకర్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారింది.
2019లో భారీ వడ్డీలు చెల్లిస్తామని ఆశ చూపి కర్ణాటకలో రూ.4 వేల కోట్లకు పైగా డిపాజిట్ల రూపంలో సేకరించి ఐఎంఏ జ్యువెలర్స్ సంస్థ బోర్డు తిప్పేసింది.ఈ స్కాంలో ప్రధాన నిందితుడైన మన్సూర్ ఖాన్ నుంచి కోటిన్నర లంచం తీసుకొని క్లీన్ చీట్ ఇచ్చినట్లు విజయ్ శంకర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 2019 జులై 8న విజయ్ శంకర్‌ను అరెస్టు చేశారు. పరప్పానలోని అగ్రహార జైలులో విచారణ ఖైదీగా ఉన్న విజయ్ శంకర్‌కు జులై 27న సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో విజయ్ శంకర్ తో పాటు మరో ఇద్దరిని విచారించేందుకు రెండు వారాల క్రితం కర్ణాటక ప్రభుత్వం సీబీఐకు అనుమతినిచ్చింది. ఇంతలోనే విజయ్ శంకర్ ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా విజయ్ శంకర్ ఆత్మహత్య నేపథ్యంలో లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.