Idream media
Idream media
కరోనా పార్లమెంట్ ను మళ్లీ కుదిపేసింది.. విపక్ష సభ్యుల ప్రసంగాలతో కాదు.. పరీక్షల్లో తేలిన పాజిటివ్ రిపోర్టులతో. యాభై, వంద కాదు.. ఏకంగా నాలుగొందల మంది మహమ్మారి బారిన పడ్డారు. త్వరలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించగా 402 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఈ నెల నాలుగో తేదీ నుంచి 8వ తేదీల మధ్య 1,409 మందికి ఈ మేరకు టెస్టులు చేశారు. వైరస్ నిర్ధారణ అయినవారిలో 200 మంది లోక్‌సభ సచివాలయ సిబ్బంది కాగా, 65 మంది రాజ్యసభ సచివాలయ ఉద్యోగులు. అనుబంధ కార్యాలయాలకు చెందిన మరో 133 మందికీ కొవిడ్ సోకినట్లు తేలింది. అందరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపారు. దీంతో అధికారులు, ఉద్యోగుల హాజరుపై పరిమితులు విధించారు. రాజ్యసభ సచివాలయంలోని కార్యదర్శి దిగువ స్థాయి ఉద్యోగులు, సిబ్బంది ఈ నెలాఖరు వరకు ఇంటి నుంచి పనిచేయాలని సూచించారు.
వర్చువల్ గా సమావేశాలు
పార్లమెంట్ సిబ్బంది భారీ సంఖ్యలో కరోనా బారిన పడడంతో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పరిస్థితిని సమీక్షించారు. వైరస్ కట్టడికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సిబ్బంది అందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్ వచ్చినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైనవారికి ఆస్పత్రి వైద్యసాయం అందిస్తామన్నారు. అధికారిక సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించాలని నిర్దేశించారు. మరోవైపు కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పార్లమెంటు సిబ్బందికి అంతర్గత ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది.
నలుగురు న్యాయమూర్తులు, సుప్రీం సిబ్బందికి కూడా..
పార్లమెంటు వెలుపల చేయించుకున్న పరీక్షల్లో మరికొందరు ఉద్యోగులకూ పాజిటివ్ వచ్చింది. సహచరులకు కరోనా సోకడంతో చాలామంది అధికారులు, సిబ్బంది ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. కాగా, వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇటీవల లోక్‌సభ సచివాలయం.. కార్యదర్శి దిగువ స్థాయి అధికారుల్లో 50 శాతం మందికి రొటేషన్ పద్ధతిలో కార్యాలయాలకు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది.
ఇదిలా ఉండగా.. నలుగురు న్యాయమూర్తులకు, 150 మంది సిబ్బందికీ వైరస్ సోకిందని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. కోర్టు ప్రాంగంణంలో సోమవారం నుంచి శనివారం వరకు పనిచేసేలా పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. లక్షణాలు కనిపించిన సిబ్బంది అందరూ తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలని ఆదేశాలిచ్చారు.
Also Read : కరోనా కలకలం.. మోడీ కీలక నిర్ణయం..