iDreamPost
android-app
ios-app

ఒకరిది అవమాన భారం… మరొకరిది అరెస్ట్ భయం

ఒకరిది అవమాన భారం… మరొకరిది అరెస్ట్ భయం

వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి లండన్ వీధుల్లో దర్జాగా తిరుగుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో వందల కోట్ల రుణాలు తీసుకొని చెల్లించకుండా అధికారం అనుభవ విస్తున్నారు. ఇలాంటి వారిని చూసైనా స్ఫూర్తి పొందింటే ఆ కుటుంబం బతికేదే.

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కపల్లి గ్రామానికి చెందిన రైతు జంజీరాల రమేష్ కుమార్తె పెళ్లికి, పత్తి పంట సాగుకోసం అప్పు చేశాడు. పంటలు బాగా పండితే అప్పంతా తీరిపోతుందని… మనశ్శాంతిగా బతకొచ్చని ఆశ పడ్డాడు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు.. పంట పండకపోగా పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. కళ్లెదుట రూ.16 లక్షల అప్పు.. మరోవైపు దాన్ని తీర్చే దారి కనిపించక పోవడంతో భార్య పద్మ(4౦), కుమార్తె సౌమ్య(20), కుమారుడు అక్షయ్(17)తో కలిసి సామూహికంగా ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయారు.

గతేడాదే సౌమ్యకి పెళ్లి చేశారు. సొంతంగా ఎకరం భూమి లేకపోవడంతో 30 ఎకరాలను కౌలుకు తీసుకొని చేస్తున్నాడు. ఊర్లో ఉన్న ఇంటిని అమ్మినా రూ.8 లక్షలు మాత్రమే వస్తాయి. మరో రూ.8 లక్షల అప్పు తీర్చే మార్గం లేక… పరువు పోతుందనే భయంతో ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సమాజాన్ని కలిచి వేస్తోంది.

ఇదిలా ఉండగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడింగ్ కు వస్తున్నారని, ఎక్కడ దొరికిపోతే అరెస్ట్ చేస్తారో అన్న భయంతో ఓ తహశీల్దార్ రూ.20 లక్షల డబ్బుని కాల్చి, బూడిద చేసేశాడు.

రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పర్వత్‌ సింగ్‌ను ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం పట్టుకున్నారు. పర్వత్‌ను ప్రశ్నించగా.. ఇందులో తన ప్రమేయమేమీ లేదని, తహసీల్దార్‌ కల్పేశ్‌ కుమార్‌ జైన్‌ ఆదేశాలకు అనుగుణంగానే తాను ఈ డబ్బు తీసుకున్నానని చెప్పారు. వెంటనే ఏసీబీ అధికారులు.. పర్వత్‌ను వెంటబెట్టుకొని కల్పేశ్‌ ఇంటికి వెళ్లారు. అధికారులు వస్తున్నారన్న సమాచారం ముందుగానే అందిందో ఏమో.. కల్పేశ్‌ తన ఇంటి ద్వారాలు, కిటికీలు మూసేశాడు. వంటగదిలోకి వెళ్లి గ్యాస్‌ స్టవ్‌ వెలిగించి వరుసగా నోట్ల కట్టలు కాల్చడం ప్రారంభించాడు. భార్య కూడా ఆయనకు సాయం చేసింది. ఇంతలో ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు.. నోట్ల కట్టలను కాల్చడాన్ని కిటికీలోంచి గమనించారు. అలా చేయొద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినిపించుకోకుండా ఆయన తన పని తాను చేసుకుంటూ పోయాడు. చివరకు అధికారులు.. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి కల్పేశ్‌ను అరెస్టు చేశారు. అప్పటికే రూ.20 లక్షల విలువైన నోట్ల కట్టలు కాలి బూడిదయ్యాయి. చివరికి మిగిలిన రూ 1.5 లక్షలను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు.

చేసిన అప్పులు తీర్చలేక అవమాన భారంతో ఒక కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకి పాల్పడగా … తీసుకున్న లంచం తనను ఎక్కడ ఇరికిస్తుందో అన్న భయం రూ.20 లక్షలను అగ్నికి ఆహుతి అయ్యేలా చేసింది. లేని వాడు తిండికి ఏడుస్తుంటే… ఉన్న వాడు తిన్నది అరిగించుకోలేక ఏడుస్తున్నట్లుగా ఉన్నాయి ప్రస్తుత సమాజంలోని పరిస్థితులు.