iDreamPost
android-app
ios-app

144 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో మూడవ పర్ఫెక్ట్ టెన్

144 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో మూడవ పర్ఫెక్ట్ టెన్

భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్ లో భాగంగా ,రెండవ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు (డిసెంబర్ 3)నాలుగు భారత వికెట్లు పడగొట్టిన న్యూజిలాండ్ స్పిన్ బౌలర్ అజాజ్ యూనస్ పటేల్ రెండవ రోజు మిగిలిన ఆరు వికెట్లు పడగొట్టి, 1877న అధికారికంగా మొదలైన 144 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ లో అన్ని వికెట్లు పడగొట్టిన మూడవ బౌలర్ గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.

జిమ్ లేకర్ మొదటిసారి

ఇంగ్లాండు, ఆస్ట్రేలియా జట్ల మధ్య 1956 యాషెస్ సిరీస్ లో భాగంగా జులై 26-31 మధ్య జరిగిన మూడవ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండు జట్టు 459 పరుగులు చేసి ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టుని ఇంగ్లాండు బౌలర్ జిమ్ లేకర్ దారుణంగా దెబ్బతీసి 37 పరుగులు ఇచ్చి తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో కేవలం 84 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండుకే చెందిన లోహ్మన్ అనే బౌలర్ ఎప్పుడో 1896లో నెలకొల్పిన రికార్డును సమం చేసిన లేకర్, ఫాలో ఆన్ ఆడిన ఆస్ట్రేలియా మీద తన బౌలింగ్ మాయాజాలం ప్రదర్శించి, ఈసారి 53 పరుగులు ఇచ్చి మొత్తం పది వికెట్లూ పడగొట్టాడు . ఈసారి 205 పరుగులు చేసిన ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్ ని ఇన్నింగ్స్ 170 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఒక ఇన్నింగ్స్ లో పది వికెట్లు, ఒక మ్యాచ్ లో పంతొమ్మిది వికెట్లు తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు జిమ్ లేకర్. టెస్టు క్రికెట్ మొదలయ్యాక 428వ టెస్టు మ్యాచ్ లో లేకర్ ఈ ఘనత సాధించాడు.

రెండోసారి మన కుంబ్లే

లేకర్ తరువాత ఒక టెస్టు ఇన్నింగ్స్ లో పది వికెట్లూ పడగొట్టిన సందర్భం నలభై మూడు సంవత్సరాల  తర్వాత జరిగింది. 1999 లో భారత పాకిస్థాన్ సిరీస్ లో జరిగిన రెండో టెస్టులో అయిదవ రోజైన ఫిబ్రవరి నాలుగున, 419 పరుగులు వెనుకబడి తన రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ బ్యాటింగ్ ని తన ఆఫ్ స్పిన్ బౌలింగ్ తో భారత బౌలర్ అనిల్ కుంబ్లే దెబ్బ తీశాడు. ఆ ఇన్నింగ్స్ లో 74 పరుగులు ఇచ్చి మొత్తం పది వికెట్లూ పడగొట్టి, పాకిస్తాన్ జట్టుని 207 పరుగులకు ఆలౌట్ చేసి 206 పరుగుల తేడాతో భారత జట్టు మ్యాచ్ గెలవడానికి కారణమయ్యాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది 1443 వ మ్యాచ్.

ఇప్పుడు ఆజాజ్ పటేల్

కుంబ్లే తర్వాత టెస్టు క్రికెట్ లో మరో పర్ఫెక్ట్ టెన్ నమోదు కావడానికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది. ముంబయి లోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్ లోని రెండవ మ్యాచ్ లో మొదటి రోజు 73 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన అజాజ్ పటేల్ రెండవ రోజు తన బౌలింగ్ కి మరింత పదును పెట్టి మరో నలభై అయిదు పరుగులు ఇచ్చి మిగిలిన ఆరు వికెట్లు పడగొట్టాడు. మయాంక్ అగర్వాల్ సెంచరీ తర్వాత భారత జట్టు భారీ స్కోరు సాధిస్తుందని అనుకుంటే తన బౌలింగ్ ప్రదర్శనతో అజాజ్ పటేల్ భారత బ్యాటింగ్ జోరుకు కళ్ళెం వేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది 2438వ మ్యాచ్.

అయితే 1988లో బొంబాయిగా పిలవబడే నేటి ముంబయిలో జన్మించిన అజాజ్ పటేల్ అద్భుతమైన బౌలింగ్ ని న్యూజిలాండ్ బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేక 62 పరుగులకే అందరూ చేతులెత్తేయడంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఓటమి తప్పని పరిస్థితిలో ఉంది న్యూజిలాండ్ జట్టు.

Also Read : Nz Vs Ind Second Test -రెండవసంవత్సరాలసంవత్ మోత