iDreamPost
iDreamPost
కోనసీమ రైల్వేలైన్‌కు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. నిర్మాలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దీనికి రూ.358 కోట్ల నిధులు కేటాయించారు. దీనితో ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.2 వేల 16 కోట్లు కేటాయించినట్టయ్యింది.
నిర్మలమ్మ బడ్జెట్ కేటాయింపులు పూర్తయిన తరువాత రైల్వేశాఖ ప్రాజెక్టుల వారీగా నిధులు కేటాయించింది. కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్‌కు కేంద్రం రూ. 358 కోట్లు కేటాయించినట్టు దక్షణ మధ్య రైల్వే నుంచి స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందింది. దీనితో ఈ ప్రాజెక్టు తన వాటాగా ఇవ్వాల్సిన నిధులన్నీ కేంద్రం ఇచ్చినట్టయ్యింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న 25 శాతం నిధులు విడుదల కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు అంచనా రూ.2,200 కోట్లు. తరువాత ఇది కాస్తా రూ.2,400 కోట్లుకు పెరిగిందని అంచనా. కేంద్రం ఇప్పటి వరకు రూ. 2 వేల 16 కోట్లు కేటాయించినట్టయ్యింది.
దశాబ్ధాల కాలంగా కోనసీమ రైల్వేలైన్ ప్రతిపాదనలకే పరిమితమైంది. కాకినాడ నుంచి కోటిపల్లి, అమలాపురం మీదుగా నర్సాపురం వరకు రైల్వే లైన్ నిర్మాణం చేయాల్సి ఉంది. దివంగత లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి హయాంలో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు (బ్రిటీష్ కాలంలో నిర్మించిన) రైల్వేలైన్ పునఃనిర్మాణం జరిగింది. అక్కడ నుంచి అమలాపురం మీదుగా నర్సాపురం వరకు రైల్వేలైన్ నిర్మాణ పనులకు కేంద్రం నిధులు కేటాయించడంలో తాత్సర్యం చేస్తూ వచ్చింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏటా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో కేవలం ఒకటి, రెండు కోట్లు విదిలిస్తూ వచ్చింది. 2001-02లో ఈ ప్రాజెక్టుకు రూ.20 కోట్లు కేటాయించగా, 2002-03లో కేవలం రూ.8 కోట్లు, 2003-04లో రూ.ఐదు కోట్లు, 2004-05లో రూ.2 కోట్లు, 2005-06లో రూ.ఒక కోటి, 2006-07లో రూ.2 కోట్లు, 2007-08లో రూ.2 కోట్లు చొప్పున కేటాయించారు. ఇక 2008-09లో కేవలం రూ.లక్ష, 2009-10లో మరోసారి రూ.లక్ష, 2010-11లో 15 కోట్లు, 2011-12లో రూ.17 కోట్లు, 2012-13లో రూ.2 కోట్లు, 2013-14లో రూ.కోటి, 2014-15లో రూ.పది కోట్లు, 2015-16లో రూ.ఐదు కోట్ల చొప్పున కేటాయించారు.
తరువాత నుంచి ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు భారీగా పెరిగింది. 2016-17లో రూ.200 కోట్లు, 2017-18లో రూ.430 కోట్లు, 2018-19లో రూ.200 కోట్లు, 2020-21లో 550 కోట్లు, 2021-22లో రూ.188 కోట్లు, 2022-23 తాజా బడ్జెట్‌లో రూ.358 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు 2016-17 నుంచి బడ్జెట్‌లో కేటాయింపులు భారీగా పెరిగాయి. అప్పట్లో బీజేపీలో కీలకంగా వ్యవహరించిన అమలాపురం వాసి వారణాశి రామ్‌మాధవ్ కలుగజేసుకోవడంతో ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు దక్కాయి. దీనికితోడు స్థానిక ప్రజాప్రతినిధులు, కోనసీమ వాసులు చేసిన కృషి కూడా అధికంగా ఉంది.