Idream media
Idream media
మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు స్వస్థలమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారి పల్లెలో రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా భారీ జనంతో ఈరోజు మధ్యాహ్నం బహిరంగ సభ ఏర్పాటు చేశారు,దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తియ్యాయి.
చంద్రబాబు అమరావతి పరిరక్షణ పేరుతొ రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే చెవిరెడ్డి చంద్రబాబు సొంత గ్రామంలో రాజధాని వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతుగా సభ జరపనుండటంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
దాదాపు 25 వేల మంది హాజరవుతారని భావిస్తున్న ఈ సభకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రంగంపేట- నారావారిపల్లె మార్గంలో మెయిన్‌రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సభ జరుగుతుంది. ఈ సభను చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రబాబు సొంత గ్రామంలోనే చేపడుతున్నాడు.
ఈ సభకు మంత్రులు కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, సీఎం ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు కానున్నారు.
పేరుకు చంద్రబాబు సొంత ఊరే అయినా నారావారిపల్లె పంచాయితీలో టీడీపీ బలం తక్కవే. గతంలో పలుసార్లు పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది.
అయితే చంద్రబాబు స్వగ్రామంలో రెచ్చగొట్టటానికే వైసీపీ సభ నిర్వహిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార వైసీపీ వైఖరికి నిరసనగా అదే రోజు తిరుపతిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నిరసన తెలపాలనుకున్నా పోలీసులు అనుమతి నిరాకరించారు. గ్రామంలో ఇప్పటికే పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.