iDreamPost
android-app
ios-app

పేర్ని నాని అనుచరుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

పేర్ని నాని అనుచరుడి  హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

రాష్ట్ర మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కర రావు హత్య కేసులో పోలీసులు వేగంగా పురోగతి సాధించారు. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. రాజకీయపరమైన గొడవల కారణంగా భాస్కర్‌ రావును ఆయన ప్రత్యర్థులు హత్య చేశారనే కోణంలో దర్యాప్తు సాగించిన పోలీసులు మచిలీపట్నంకు చెందిన కిషోర్, పులి, చిన్నా అనే ముగ్గురును అరెస్ట్‌ చేశారు.

నిన్న మోకా భాస్కర రావుపై మచిలీపట్నం పట్టణ నడిబొడ్డున ఉన్న చేపల మార్కెట్‌లో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భాస్కర రావును స్థానికులు ఆటోలో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలిచారు. అయితే ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. హత్య కేసు ఛేదన పోలీస్‌కు సవాల్‌గా మారింది. దీంతో ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. హత్య ఎవరు చేశారో తెలియడంతో మోకా భాస్కర రావు బంధువలు, అనుచరులు నిందితుల ఇళ్లపై దాడికి దిగారు. వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు మోకా భాస్కరరావు అనుచరులను శాంతిపజేసి పంపిచేస్తున్నారు.

మరికొద్దిసేపట్లో మోకా భాస్కర రావు అంత్యక్రియలు మచిలీపట్నంలో జరగనున్నాయి. మంత్రి పేర్ని నాని అంత్యక్రియల ఏర్పాటును దగ్గరండు పర్యవేక్షిస్తున్నారు. తన అనుచరుడి హత్యతో ఖిన్నుడైనా నాని.. దుఖించిన విషయం తెలిసిందే. నానితో భాస్కర రావుకు ఏళ్ల తరబడి సన్నిహిత్యం ఉంది. తన అనుచరుడుని చంపినా ప్రతీకార దాడులు చేయబోమని మంత్రి నాని ఇప్పటికే ప్రకటించారు. ఈ తరహా రాజకీయాలు తమ నైజం కాదని స్పష్టం చేశారు. నిన్న మోకా భాస్కర రావు సన్నిహితులు, అనుచరులు మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఇంటిపైకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు. ప్రస్తుతం పట్టణంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో పికెట్లు కొనసాగుతున్నాయి.