Idream media
Idream media
వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఆ పార్టీ నేతల వరకు చేస్తున్న విమర్శలు ఎప్పటికప్పడు నీటిమీద రాతల్లా తేలిపోతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన పరిణామం.. మరోసారి టీడీపీ నేతల విమర్శలకు చెక్ పెట్టింది. ధర్మవరం నియోజకవర్గంలో 267 మంది వాలంటీర్లను అధికారులు డిస్మిస్ చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట నిత్యం ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కేతిరెడ్డి పర్యటనకు చిన్నపాటి బ్రేక్ పడింది. వైరస్ వ్యాప్తి తగ్గిన తర్వాత మళ్లీ యథావిధిగా ప్రజల్లోకి వెళుతున్నారు. అన్ని విభాగాల అధికారులతో వెళుతుండడంతో ప్రజలు చెప్పిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.
ప్రజలు తమ సమస్యలను చెప్పడంతోపాటు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తమను లంచాల కోసం పీడిస్తున్న విషయాలను ఎమ్మెల్యే కేతిరెడ్డి దృష్టికి తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు వాలంటీర్ల అవినీతి వ్యవహారాలను ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. వాలంటీర్లపై ప్రజలు, పార్టీ నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఎమ్మెల్యే.. ఆ ఫిర్యాదుల్లో నిజమెంత అనే విషయాలను క్రాస్ చెక్ చేయించారు. ఆ పై నియోజకవర్గం వ్యాప్తంగా 267 మంది వాలంటీర్లు ప్రజల నుంచి లంచాలు తీసుకున్నట్లు తేల్చారు. కరోనా సమయంలో వాలంటీర్లు ఈ తతంగానికి పాల్పడినట్లు ఎమ్మెల్యే గుర్తించారు. వెంటనే 267 మందిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో.. వారిని విధుల నుంచి తొలగించారు.
వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీడీపీ నేతలు అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు. వాలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలనే నియమించారని, అర్హత ఉన్నా టీడీపీ సానుభూతిపరులకు పథకాలు అందించడం లేదంటూ టీడీపీ నేతలు విమర్శలు చేశారు. ధర్మవరంలో జరిగిన సంఘటన టీడీపీ నేతల విమర్శలకు సమాధానం చెప్పింది. నిజంగా వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలే అయితే.. లంచాలు తీసుకున్నందుకు 267 మందిని ఎందుకు తొలగిస్తారు..? పైగా వారిని తొలగించాలని ఎమ్మెల్యేనే చెప్పారు. పక్షపాతం చూపకుండా, లంచాలకు తావులేకుండా ప్రభుత్వ పథకాలు అర్హులకు అందాలనే లక్ష్యంతో వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా పని చేస్తే.. వేటు తప్పదని మరోసారి ధర్మవరంలో నిరూపితమైంది. ప్రజల నుంచి లంచాలు తీసుకున్నారనే అభియోగాలపై 267 మంది వాలంటీర్లను ఒకే నియోజకవర్గంలో తొలగించడంపై టీడీపీ నేతలు ఏమంటారో..?
Also Read : మంత్రిని కలవర పెడుతున్న కేటుగాళ్లు!