iDreamPost
iDreamPost
” అబ్బే, నాగార్జున గారికి ఏమైందండి. నిన్నే పెళ్లాడతా లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక ఇప్పుడు భక్తి చిత్రాలు అవసరమంటారా”
” ఇదేమైనా ఎన్టీఆర్ కాలమా లేక అక్కినేని వారసుడికి నాన్న భక్త తుకారాం ఏమైనా గుర్తొచ్చిందా “
” అంత అందగాడైన నాగ్ తో కమర్షియల్ సినిమా చేయకుండా రాఘవేంద్రరావు గారు ఈ రిస్క్ ఎందుకు చేస్తున్నట్టో. పెళ్లిసందడితో వచ్చిన పేరుని రిస్క్ లో పెడుతున్నారు”
” దొరస్వామిరాజు గారికి ఎంత వెంకన్న మీద భక్తి ఉంటే మాత్రం ఇలాంటి సాహసానికి పూనుకుంటారా “
అన్నమయ్య సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచి షూటింగ్ జరిగి ఫస్ట్ కాపీ సిద్ధమయ్యేదాకా ఇండస్ట్రీ నుంచి ఇలాంటి కామెంట్స్ చాలానే వినిపించాయి. అందులో నిజం లేకపోలేదు. ప్రేమ దేశం లాంటి ట్రెండీ లవ్ స్టోరీస్ ఒకవైపు, ప్రేమాలయం లాంటి కుటుంబ కథా చిత్రాల ప్రభంజనం మరోవైపు ఉధృతంగా సాగుతున్న టైంలో ఇలాంటి ప్రయత్నమంటే ఎవరికైనా సవాలక్ష సందేశాలు రావడం సహజం. దీనికీ అదే జరిగింది. పైగా అన్నమయ్య రూపం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇందులో ఆయనకు మీసాలు పెడుతున్నారు. జనం ఒప్పుకుంటారా. అప్పటిదాకా ఇలాంటి వేషబాషలకు ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు. బ్లాక్ అండ్ వైట్ జమానా ముగిశాక నాగేశ్వర్ రావు గారు సైతం ఒకటి రెండు తప్ప ఈ టైపు కథల జోలికి వెళ్ళలేదు.
అలాంటి సమయంలో అన్నమయ్య అనే మహాయజ్ఞానికి పూనుకున్నారు దర్శకేంద్రులు. రచయిత జేకే భారవి ఎన్నో ఏళ్ళు ఒక తపస్సులాగా స్వీకరించి తాళ్ళపాక అన్నమయ్య గురించి సేకరించిన గాధలు, పుస్తకాలు, వివరాలు తదితరాలు ఎన్నింటినో ఆధారంగా చేసుకుని ఈ స్క్రిప్ట్ ని రాసుకున్నారు. తొలుత కొన్ని ప్రయత్నాలు చేశారు. కాని విన్నంత సేపు తలూపిన కొందరు నిర్మాతలు తీరా హీరో, బడ్జెట్ లాంటి లెక్కల దగ్గరికొచ్చేసరికి భయపడి వెనుకడుగు వేశారు. ఈ బృహత్కార్యం చేపట్టే బాధ్యత దొరస్వామిరాజు, రాఘవేంద్రరావు లకు రాసిపెట్టినప్పుడు ఎవరైనా ఎందుకు ముందుకు వస్తారు. అదే జరిగింది. నాగార్జున కథ విన్నారు. అప్పటికే ప్రయోగార్జునుడుగా పేరున్న ఆయనకు అన్నమయ్య బ్రహ్మాండంగా కనెక్ట్ అయిపోయారు. ఎటొచ్చి రాఘవేంద్రరావు గారికే కొంచెం టెన్షన్ ఉంది. గొప్ప పేరు తీసుకొస్తుంది కాని డబ్బులు వస్తాయాని డౌట్. నాగ్ అభయం ఇచ్చారు. ఇది కనకం కూడా తీసుకొస్తుందని ఏ భయం లేకుండా ముందుకు వెళ్దామని హామీ ఇచ్చేశారు. నాన్న ఎఎన్ఆర్ తో కూడా చర్చించి ఆయనా సానుకూలంగా స్పందించాక నిర్ణయం తీసుకున్నారు.
గ్లామర్ హీరొయిన్ గా అంతెత్తునున్న రమ్యకృష్ణ, పెద్దగా స్టార్ డం లేని కస్తూరిని నాగార్జున సరసన తీసుకున్నారు. తన ఆస్థాన విద్వాంసుడు ఎంఎం కీరవాణి మీద తప్ప రాఘవేంద్రరావుకి ఇంకెవరి మీదా గురి లేదు. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు. కొన్ని వందల కీర్తనలలో ఏది తీసుకోవాలో తెలియని సందిగ్ధం. జనంలో అప్పటికే బాగా గుర్తింపున్న అన్నమాచార్య కీర్తనలనే ట్యూన్లుగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కీలకమైన సాళ్వ నరసింహరాజు పాత్రకు మోహన్ బాబు సరే అన్నారు. అల్లుడుగారుతో తనకు హీరోగా బ్రేక్ ఇచ్చిన గురువు అడిగితే కాదంటారా. అందులోనూ ఏడుకొండలవాడి సినిమా. మిత్రుడు నాగార్జున హీరో. ఇంతకన్నా కారణం ఏం కావాలి. క్యాస్టింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అందరూ సీనియర్లను తీసుకున్నారు. చిన్నా పెద్ద కీర్తనలు, పాటలు అన్ని కలిపి 20 ట్రాక్స్ అయ్యాయి. ఏదీ తీసేయకూడదని ముందే నిర్ణయం తీసుకున్నారు. ఆడియో హక్కులు కొన్న టి సిరీస్ కంపెనీ క్యాసెట్లను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
ఇలా దేవదేవుడికి మహాభక్తుడికి ఉన్న అనుబంధం వెండితెరపై ఆవిష్కృతం చేయడానికి షూటింగ్ మొదలయ్యింది. నాగార్జున ఇమేజ్ కి తగట్టు కొన్ని కల్పనలు జోడించక తప్పలేదు. అందులో భాగంగానే ఇద్దరు మరదళ్లతో డ్యూయెట్ లాంటి పాట, ఓ పోరాట సన్నివేశం ఫస్ట్ హాఫ్ లో పెట్టేశారు. మోహన్ బాబు అభిమానుల కోసం ఆయనకు జోడిగా నటించిన రోజాతో ఒక యుగళగీతం రెండో సగంలో వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. నిర్విరామంగా షూటింగ్ సాగిపోయింది. అలా అని కామెంట్లు ఆగిపోలేదు. కమర్షియల్ సినిమాకు సెట్ చేసుకున్నట్టు ఏంటీ కాంబినేషన్ అన్న వాళ్ళు లేకపోలేదు. వర్కింగ్ స్టిల్స్ లో నాగార్జున గెటప్ మీదా విమర్శలు వచ్చాయి. చరిత్రను వక్రీకరిస్తున్నారని కొందరు గగ్గోలు పెట్టారు. ఇవన్ని పట్టించుకోకుండా తమ యజ్ఞగుండం మీదే దృష్టి పెట్టారు యూనిట్ సభ్యులు. ఇది చేస్తోంది తామైనా చేయించేది మాత్రం ఆ కలియుగ దైవమేనన్న నమ్మకం సంకల్పంగా మారి ముందుకు పురిగొల్పుతోంది. నిర్మాత దొరస్వామిరాజు లెక్కకు మించి ఖర్చుపెడుతున్నారు. ఆయనా భయపడటం లేదు. నమ్మిన వెంకన్న, నమ్మించిన రాఘవెంద్రులు తనను వంచితుడిని చేయరన్న సంకల్పం బలంగా ఉంది.
టి సిరీస్ ద్వారా ఆడియో మార్కెట్ లోకి వెళ్ళింది. సహజంగా అభిమానంతో సంబంధం లేకుండా వెంకటేశ్వరస్వామి భక్తులతో పాటు ఫ్యాన్స్ కొనుగోలుతో అమ్మకాలు బాగున్నాయి. రెండు క్యాసెట్లు కావడంతో ధర ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. సహజంగా దాని ప్రభావం మార్కెట్ మీద పడి సేల్స్ మరీ భారీగా అయితే లేవు. అయితే ఆ సంస్థ అధినేత గుల్షన్ కుమార్ బృందానికి తెలియనిది వాళ్ళు ఊహించనిది విడుదలయ్యాక జరిగింది. కమర్షియల్ సినిమా కాదు కాబట్టి ఎంత హిట్ కాంబినేషన్ అయినా బయ్యర్లు భారీ పెట్టుబడులకు సిద్ధపడలేదు. నిర్మాతా అతిగా ఆశపడలేదు. స్వతహాగా పెద్డ డిస్ట్రిబ్యూటర్ కావడంతో పంపిణిపరంగా ఇబ్బందులు లేకుండా అన్నమయ్య థియేటర్లలో అడుగు పెట్టింది. బెనిఫిట్ షో టాక్ ఎవరికీ అర్థం కాలేదు. బాగుందని కొందరు, గోవిందా అని మరికొందరు, కన్నీళ్ళు తుడుచుకుంటూ మరికొందరు, తన్మయత్వంతో ఇంకొందరు ఇలా ఇన్ని రియాక్షన్లలో ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కాలేదు. అలా రెండు మూడు రోజులు అయ్యాక
సాధారణ ప్రేక్షకులు అన్నమయ్యకు రావడం మొదలుపెట్టారు. చాలా కాలం తర్వాత సినిమా హాల్ లో భక్తి పారవశ్యాన్ని అనుభవించడం చవిచూశారు. తెలుగువారికి అమిత ప్రీతిపాత్రుడైన వెంకటేశ్వరస్వామి మీద ఓ భక్తుడు చేసిన కావ్య కవితాసంతకాన్ని చూసి తనివితీరా పునీతులవడం వాళ్ళకు స్వానుభవంలోకి వచ్చింది. అన్నమయ్యే దగ్గరుండి కీరవాణితో తన సంకీర్తనలను కంపోజ్ చేయించుకున్నారా అనేంత గొప్పగా పాటలు వచ్చాయి. అంతేకాదు అవి తెరమీద వీనులవిందుగా కనిపించేసారికి తిరుమల క్షేత్రంలో కూర్చున్నట్టు వాళ్ళు భావించడం అతిశయోక్తి కాదు. ఇదే అబద్దమైతే అన్నమయ్యకు ఇంత ఘన విజయం సొంతమయ్యేది కాదు. అలా ఒకరి నుంచి మరొకరికి టాక్ వెళ్లిపోయింది. కుటుంబాలు తరలివస్తున్నాయి. ముసలివాళ్ళు ఓపిక చేసుకుని మరీ టికెట్ల కోసం బారులు తీరుతున్నారు. హౌస్ ఫుల్ బోర్డులకు నిరంతరం పని. తండోపతండాలు అనే మాటకు నిర్వచనంలా చాలా చోట్ల వసూళ్లు ఉదృతంగా ఉన్నాయి. ఏడుకొండల మీద కాదు వెంకన్న స్వామి ఎక్కడున్నా కాసుల వర్షం కురుస్తుందని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని భక్తులు పదే పదే మురిసిపోయారు.
అన్నమయ్యకు మీసాలు ఏంటని ఎగతాళి చేసిన నోళ్ళు సినిమా చూశాక పూర్తిగా మూతబడ్డాయి. యాభై రోజులు ఆడితే హిట్ అనుకుంటే పరుగు సిల్వర్ జూబ్లీ దాకా సాగింది. నాలుగైదు వారాలు విపరీతమైన రద్దీ వల్ల బ్లాక్ టికెట్లు నడిచాయి. ఏడుకొండల మీద లడ్లు, దర్శనం టికెట్లకు ఎగబడినట్టు థియేటర్ల దగ్గర చాలా రోజులు అదే వాతావరణం కనిపించింది. తమ పిల్లలకు ఆధ్యాత్మిక భావనలు పెంపొందించే ఉద్దేశంతో తల్లితండ్రులు పిల్లలను తీసుకొచ్చి మరీ అన్నమయ్య చూపించారు. అప్పటిదాకా స్లోగా ఉన్న ఆడియో క్యాసెట్ల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఏ షాపుకెళ్ళినా నో స్టాక్ అనేస్తున్నారు. ఎన్ని బంచులు తెప్పిస్తున్నా ఒక్క రోజులో అయిపోతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఆర్డర్లు చూసి టి సిరీస్ కంపెనీ నివ్వెరబోయింది . ఐదు లక్షల క్యాసెట్లు అమ్ముడుపోతాయనే అంచనా మారి అది కాస్త డబుల్ డిజిట్ కు చేరుకుంది. ఎక్కడ చూసినా అవే పాటలు. ఇళ్ళలో, గుళ్ళలో,ఆఖరికి టీ కొట్లలో కూడా ఇవే పాటలు.తెల్లవారగానే ఎంఎస్ సుబ్బలక్ష్మి సుప్రభాతం పెట్టుకునే గృహాలు అలవాటు మార్చుకుని ఆ స్థానంలో అన్నమయ్య పాటలను క్రమం తప్పకుండా వినడం సాధారణమయ్యింది.
అక్కినేని నాగార్జునకు అప్పటికి యాక్టర్ గా కొత్తగా ప్రూవ్ చేసుకునేందుకు ఏమి లేనప్పటికీ ఎవరూ ఊహించని రీతిలో అన్నమయ్య పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైన వాళ్ళే ఎక్కువ. రెగ్యులర్ హీరో పాత్రలో ఉండే కమర్షియల్ ఎమోషన్స్ ఇందులో లేకపోవడాన్ని నాగ్ సవాలుగా తీసుకున్నారు. ఏ మాత్రం పట్టుతప్పినా ఇది తనను జీవితాంతం వెంటాడే శాపంగా మారుతుంది. అందుకే చాలా నిష్ఠగా అందులో ఒదిగిపోయారు.
అన్నమయ్య తిరుమల కొండపైకి నడుచుకుంటూ స్వామి నామస్మరణ చేస్తూ అలిసిపోతే పద్మావతిదేవీ మారురూపంలో వచ్చి లడ్డు ఇచ్చే సన్నివేశం నుంచి మొదలుకుని క్లైమాక్స్ లో సాక్ష్యాత్తు వెంకటేశ్వరస్వామి ప్రత్యక్షమైనప్పుడు అంతర్యామి పాటలో చూపించే భావోద్వేగాలకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తమ నటుడి నంది పురస్కారం చిన్నదే అనిపించింది. ఇక స్వామివారి దివ్యమంగళ రూపంలో సుమన్ కు దక్కిన పాత్ర ఎప్పుడో చేసుకున్న పూర్వ జన్మ సుకృతం. భానుప్రియ, రోజా, బాలయ్య, భరణి, బ్రహ్మనందం, గుండు హనుమంతరావు, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ తదితరులు ఇందులో భాగం పంచుకుని చరితార్థులయ్యారు. సాళ్వ నరసింహరాజుగా మోహన్ బాబు పాత్ర చిత్రణ కొంత అభ్యంతరకంగా అనిపించినప్పటికీ ఆయనకు అన్నమయ్య విద్వత్తు తెలిశాక వచ్చే మార్పును కలెక్షన్ కింగ్ తనదైన శైలిలో జీవం పోశారు. విన్ సెంట్ ద్వయం ఛాయాగ్రాణం స్వామి లీలావినోదాన్ని ఎంతటి నయనానందాన్ని కలిగించిందో వర్ణించడం కష్టం.
మాస్ మసాలా సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో అన్నమయ్య లాంటి చిత్రం 42 కేంద్రాల్లో 100 రోజులు, 2 సెంటర్లలో సిల్వర్ జూబిలీ ఆడటం దైవలీలే. జాతీయ, నంది, ఫిలిం ఫేర్ ఇలా అన్ని పురస్కారాల్లోనూ అన్నమయ్య సింహభాగం తీసుకున్నాడు. కీరవాణికి నేషనల్ అవార్డు దక్కడం చంద్రుడికో నూలుపోగు లాంటిది. ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఇప్పటికి 23 ఏళ్ళు గడిచిపోయాయి. అన్నమయ్య స్ఫూర్తితో తర్వాత తెలుగులో ఎన్ని భక్తి రస చిత్రాలు రూపొందాయో లెక్క చెప్పడం కష్టం. చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్రహీరోలు సైతం దర్శకేంద్రుడితో ఇలాంటి సినిమా చేయించుకుని మరీ మురిసిపోయారు. కానీ అవి అన్నమయ్యలు కాలేకపోయాయి. అందుకే ఎప్పటికీ అన్నమయ్యకున్న స్థానం చెక్కుచెదరనిది. ఆ భాగ్యం నాగార్జునదో, రాఘవేంద్రరావుదో లేక దొరస్వామిరాజుదో కాదు. ఏడుకొండలు కొలువైన నేల మీద జీవిస్తున్న ప్రతి తెలుగు వారిది. అందుకే అదిగో అల్లదిగో శ్రీహరివాసము అంటూ గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించే గీతం చిరస్ధాయిగా ఈ భూమిపై ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి ఇంట వినిపిస్తూనే ఉంటుంది. అన్నమయ్య అనే వెండితెర ఆణిముత్యం తన భక్తి సుధలను వెదజల్లుతూనే ఉంటుంది
సర్వేజనా సుఖినోభవంతు….