iDreamPost
android-app
ios-app

2020 – టాలీవుడ్ కంప్లీట్ రివ్యూ

  • Published Dec 28, 2020 | 6:45 AM Updated Updated Dec 28, 2020 | 6:45 AM
2020 – టాలీవుడ్ కంప్లీట్ రివ్యూ

చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేని దారుణ దుర్మార్గమైన సంవత్సరంగా మిగిలిన 2020 ఇంకో మూడు రోజుల్లో సెలవు తీసుకోబోతోంది. కరోనా తాలూకు గాయాలు ఇంకా సమజాన్ని పీడిస్తూనే ఉన్నాయి. ఇప్పుడంతా సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ లాక్ డౌన్ వల్ల నష్టపోయిన బాధితులు కోట్లలో ఉన్నారు. దీనికి సినిమా పరిశ్రమా కూడా మినహాయింపు కాదు. పైపెచ్చు దేశం ఆన్ లాక్ అయ్యాక కూడా ఇండస్ట్రీ కొంత కాలం గడ్డు పరిస్థితి ఎదురుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ థియేటర్లు నార్మల్ గా నడవడం లేదు. యాభై శాతం సీట్లతో రోజులను భారంగా వెళ్లదీస్తున్నారు. ఇక ఈ ఏడాది టాలీవుడ్ రౌండ్ అప్ ఏంటో ఓసారి చూద్దాం

జనవరి

సరికొత్త ఆశలు మోసుకొచ్చిన కొత్త నెల అంచనాలను మించి టాలీవుడ్ కు అద్భుతాలు చేసింది. సంక్రాంతి కానుకలుగా విడుదలైన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ ఒకదానితో మరొకటి పోటీ పడుతూ వందల కోట్ల వసూళ్లను వర్షంలా గుమ్మరించాయి. లాభాల పంటను పండించాయి. రజినీకాంత్ ‘దర్బార్’ ఫలితం నిరాశపరిచినప్పటికీ తీవ్ర నష్టాలైతే తేలేదు. ‘ఎంత మంచివాడవురా’ బోల్తా కొట్టగా ‘డిస్కో రాజా’ రవితేజకు మరో డిజాస్టర్ గా నిలిచింది. నాగ శౌర్య ‘అశ్వద్ధామ’ యావరేజ్ గా మిగిలగా ‘చూసి చూడంగానే’ సినిమాను ఎవరూ చూడలేదు.

ఫిబ్రవరి

కోలీవుడ్ కల్ట్ క్లాసిక్ గా నిలిచిన 96 రీమేక్ ‘జాను’ 7వ తేదిన రిలీజై ఊహించని పరాజయం అందుకుంది. శర్వానంద్, సమంతాల క్యాస్టింగ్ ఓవర్ స్లో లవ్ డ్రామాను కాపాడలేకపోయింది. అదే రోజు విడుదలైన సవారి, 3 మంకీస్, డిగ్రీ కాలేజీ, స్టాలిన్ అందరివాడు ఘోరంగా వెనక్కు వెళ్లాయి. 14న వచ్చిన విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వారం కూడా నిలవలేకపోయింది. చిన్న సినిమాలు ఒక చిన్న విరామం, శివ 143లను ఎవరూ పట్టించుకోలేదు. 21న వచ్చిన ‘భీష్మ’ మాత్రం నితిన్ కెరీర్ లోనే బెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. వసూళ్లు కూడా భారీగా వచ్చాయి. వలయం, ప్రెజర్ కుక్కర్ లు ఊసులో లేకుండా పోయాయి. 28న విడుదలైన విశ్వక్ సేన్ ‘హిట్’ టైటిల్ కు తగ్గ ఫలితాన్ని అందుకుంది. రాహు ఫ్లాప్ కాగా ‘కనులు కనులు దోచాయంటే’ స్లో పాయిజన్ గా సక్సెస్ అయ్యింది.

మార్చ్

ఈ నెలతోనే ప్రమాద ఘంటికలు మ్రోగాయి. 6న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ బోల్డ్ క్రైమ్ డ్రామా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ‘ఓ పిట్ట కథ’ తుస్సుమనగా ‘పలాస’ పర్వాలేదు అనిపించుకుంది. కాలేజీ కుమార్ కనీసం ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పాస్ కాలేదు. 13న వచ్చిన ‘మధ’ థియేటర్లలో ఆఖరిగా విడుదలైన సినిమా. రెస్పాన్స్ సోసోగానే ఉన్నప్పటికీ పెట్టిన బడ్జెట్ కు తగ్గట్టు బిజినెస్ ప్లస్ హక్కుల రూపంలో ఆదాయం సమకూర్చుకుంది. ఆ తరువాత కరోనా మహమ్మారి రావడం 15 నుంచి నిరవధికంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు మూతబడే విషాద పరిణామం జరిగిపోయింది

ఏప్రిల్

జనం బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే గడుపుతున్న పరిస్థితుల్లో ఏ సినిమా కూడా కనీసం ఓటిటి లో వచ్చేందుకు కూడా సాహసం చేయలేకపోయింది. అదిగో ఇదిగో తగ్గిపోతుందని ఎదురు చూడటంతో నాలుగు వారాలు వృధాగా గడిచిపోయాయి. 29న ‘అమృతరామమ్’ జీ5లో డైరెక్ట్ రిలీజ్ అయ్యింది. ఇదేం సినిమారా బాబోయ్ అనుకున్నారు ఆడియన్స్. ఇలా ఏప్రిల్ చాలా నిస్సారంగా గడిచిపోయింది

మే

నవదీప్ ‘రన్’ ఆహా ద్వారా వచ్చింది కానీ అది కూడా చేదు ఫలితాన్ని దక్కించుకుంది. టాలీవుడ్ నిర్మాతలు వేచి చూసే ధోరణిని ఫాలో కావడంతో ఎలాంటి సినిమాలు డిజిటల్ రిలీజ్ కోసం ముందుకు రాలేదు. తమిళంలో జ్యోతిక లాంటి వాళ్ళు సాహసం చేసినా కూడా ఇక్కడ మాత్రం వెయిట్ అండ్ సి పాలసీని ఫాలో అయ్యారు. దీంతో మన ప్రేక్షకులు వెబ్ సిరీస్ కంటెంట్ మీద ఆధారపడక తప్పలేదు

జూన్

మొదటిసారి పేరున్న హీరోయిన్ నటించిన సినిమా ఒకటి అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ రిలీజ్ అందుకుంది. 19న విడుదలైన కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ రివ్యూస్ అంత ఆశాజనకంగా లేకపోయినా కూడా క్రేజ్ మీద భారీ వ్యూస్ తెచ్చుకుంది. మూడు నెలల తర్వాత వచ్చిన కొత్త సినిమా కావడంతో అందరూ ఎగబడి చూశారు. 25న వచ్చిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ యూత్ తో ఓకే అనిపించుకుంది. 30న విడుదలైన సత్యదేవ్ ’47 డేస్’ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది

జులై

ఈ నెలలో చెప్పుకోదగ్గ సినిమాలు ఓటిటి లో రెండే వచ్చాయి. మొదటిది భానుమతి అండ్ రామకృష్ణ. డీసెంట్ టాక్ తో సక్సెస్ అందుకుంది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హోమ్ ఎంటర్ టైన్మెంట్ కోణంలో పాజిటివ్ రెస్పాన్స్ తో మంచి వ్యూస్ సంపాదించుకుంది. ఈ రెండు థియేటర్లలో అయ్యుంటే ఫలితం వేరుగా ఉండేదన్న విశ్లేషణ లేకపోలేదు. ఇవి మినహాయించి జులైలో ఎలాంటి మెరుపులు లేవు

ఆగస్ట్

14న ఆహాలో వచ్చిన ‘జోహార్’లో కాన్సెప్ట్ విభిన్నంగా ఉన్నప్పటికీ ప్రెజెంటేషన్ లో జరిగిన తడబాటు వల్ల ఆశించిన స్థాయికి చేరుకోలేదు. కాకపోతే నిజాయితీగా చేసిన ప్రయత్నంగా మెప్పు పొందింది. 21న అదే యాప్ ద్వారా విడుదలైన ‘బుచ్చినాయుడు కండ్రిగ’ ఎవరి మెచ్చుకోలు దక్కించుకోలేదు. రొటీన్ ఫార్ములా లవ్ స్టోరీకి నేటివిటీ టచ్ ఇచ్చారు కానీ వర్క్ అవుట్ కాలేదు

సెప్టెంబర్

మన ప్రేక్షకులే కాదు దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన నాని సుధీర్ బాబుల ‘వి’ 5న ప్రైమ్ ద్వారా భారీ అంచనాలు మోసుకుంటూ బుల్లితెరలపై ప్రత్యక్షమయింది. అయితే అంచనాలు మరీ ఎక్కువ కావడంతో పాటు ఇంద్రగంటి కథ చెప్పిన విధానం ఎవరికీ నచ్చలేదు. ఫలితంగా సోషల్ మీడియాలోనూ నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వచ్చింది. ఒకరకంగా ఓటిటి వి నష్టాలను కాపాడిందని చెప్పాలి. 18న ఆహాలో వచ్చిన ‘అమరం అఖిలం ప్రేమ’ సోసోగానే వెళ్ళింది.

అక్టోబర్

వి తర్వాత ఆ స్థాయిలో హైప్ తెచ్చుకున్న అనుష్క ‘నిశ్శబ్దం’ ప్రైమ్ ద్వారా వచ్చి రిజల్ట్ విషయంలోనూ దానితో పోటీ పడింది. స్వీటీ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా క్రిటిక్స్ గట్టిగానే కామెంట్ చేశారు. ఫ్యాన్స్ కి సైతం నచ్చలేదు. రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ రొటీన్ కామెడీ ఫార్మట్ లో తెరకెక్కినప్పటికీ జనం బాగానే చూశారని చెప్పొచ్చు. 23న వచ్చిన ‘కలర్ ఫోటో’ సోషల్ మీడియా వేదికగా ఎక్కువ చర్చకు గురయ్యింది. క్లాసిక్ అనేంత గొప్ప కంటెంట్ లేనప్పటికీ ఆహా మార్కెటింగ్ ప్లస్ సినిమా టీమ్ చేసిన ప్రమోషన్ వల్ల ఎక్కువ రీచ్ అయ్యింది

నవంబర్

కీర్తి సురేష్ మరో ఓటిటి రిలీజ్ మిస్ ఇండియా టార్గెట్ మిస్ చేసుకుంది. సిల్లీ కథలో మహానటి తేలిపోయిందని గట్టి కామెంట్స్ వచ్చాయి. ఈ నెల మొదట్లో వచ్చిన ‘గతం’ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళను పర్వాలేదు అనిపించింది. ‘మా వింత గాథ వినుమా’ వింతగానే ఉంది. అనగనగా ఓ అతిధి ఒరిజినల్ స్థాయిలో తెరకెక్కలేదు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’కి ఫ్యామిలీ ప్రేక్షకుల అండ దొరికింది. మేక సూరి 2ని ఎవరైనా అడిగితే ఒట్టు. సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ మాత్రం ఓటిటి ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకుంది. నయనతార ‘అమ్మోరు తల్లి’ ఓ మోస్తరుగానే వెళ్ళింది.

డిసెంబర్

కరోనా మహమ్మారి దాదాపుగా తగ్గిన వేళ సినిమాల విడుదలతో పాటు షూటింగుల సందడి ఎక్కువగా జరిగిన నెల ఇది. బొంబాట్, ఐఐటి కృష్ణమూర్తి, గువ్వ గోరింక మూడూ ఏవీ కనీసం యావరేజ్ కూడా అనిపించుకోలేదు. ‘డర్టీ హరి’ ఒక వర్గాన్ని మెప్పించినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. ఇక అసలైన పండగ మాత్రం 25న తొమ్మిది నెలల గ్యాప్ తో వచ్చిన థియేటర్లలో వచ్చిన ‘సోలో బ్రతుకే సో బెటరూ’తోనే మొదలయ్యింది. ఓపెనింగ్స్ బాగా రావడంతో వచ్చే మంచి రోజుల గురించి పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ఇలా మొత్తానికి 2020 టాలీవుడ్ కు చేదు ఎక్కువ తీపి తక్కువ సంవత్సరంగా మిగిలిపోయింది. ఎన్నో వేల కోట్లు సినిమా పరిశ్రమ కోల్పోయింది. ఇప్పుడిప్పుడే కోలుకునే దిశగా అడుగులు వేస్తోంది. మళ్ళీ ఇలాంటి ఏడాది భూమి ఉన్నంత వరకు రాకూడదనే స్థాయిలో భయపెట్టిసింది 2020. చివరిలోనైనా కనీసం థియేటర్లు తెరుచుకునే శుభపరిణామం జరిగింది కాబట్టి ఇకపై ముందున్నవన్నీ ,మంచి రోజులే అని కోరుకుందాం.