iDreamPost
android-app
ios-app

చంద్రయాన్‌-3 సక్సెస్.. రైస్‌ పుల్లింగ్‌ పాత్ర పేరుతో రూ. 20కోట్లు దోచేశారు

చంద్రయాన్‌-3 సక్సెస్.. రైస్‌ పుల్లింగ్‌ పాత్ర పేరుతో రూ. 20కోట్లు దోచేశారు

మోసాలకు పాల్పడే కేటుగాళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రోజుకో ఎత్తుగడతో అమాయకపు ప్రజలను మోసం చేస్తూ వారి నుంచి లక్షలు, కోట్ల రూపాయాలను దోచేస్తున్నారు. మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికి కేటుగాళ్ల వలలోపడి మోసాలకు గురవుతున్నారు కొందరు వ్యక్తులు. ఈక్రమంలో హైదరాబాద్ లో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యాపారి నుంచి ఏకంగా రూ. 20 కోట్లు కాజేశారు. ఈ మోసానికి ఏకంగా చంద్రయాన్ -3 విజయాన్ని వాడుకున్నారు. చంద్రయాన్ సక్సెస్ కు ఓ పాత్ర కారణమని నమ్మబలికి దానిని ఆ వ్యాపారికి అమ్ముతామని చెప్పి రూ. 20 కోట్లు కొట్టేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చంద్రయాన్‌-3 పేరును వాడుకుని మోసాలకు పాల్పడ్డారు కేటుగాళ్లు. చంద్రయాన్‌ 3 సక్సెస్‌కు రైస్‌ పుల్లింగ్‌ కారణమని భారీ మోసానికి పథకం వేశారు. చంద్రయాన్‌-3 విజయానికి కారణమైన పాత్ర తమ వద్ద ఉందని, దానిని అమ్ము​తామని కొందరు కేటుగాళ్లు ఓ వ్యాపారికి మాయమాటలు చెప్పారు. ఈ పాత్రకు అతీతమైన శక్తులు ఉన్నాయని చెప్పి ఆ వ్యాపారిని బోల్తా కొట్టించారు. ఇది నమ్మిన ఆ వ్యక్తి ఏకంగా రూ.20కోట్లు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి మోసపోయానని భావించిన బాధితుడు.. నగరంలోని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి విజయ్‌ కుమార్‌ అనే వ్యక్తితో సహా మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

రైస్ పుల్లర్

రైస్ పుల్లర్ అనగా బియ్యపు గింజల్ని ఆకర్షించే లక్షణాలుండే లోహం. అత్యంత అరుదైన, విలువైన ఇరీడియం అనే లోహాన్ని కలిగివుండే రైస్ పుల్లర్లు ఎందుకు ఎలా ఉపయోగపడతాయో సామాన్యులకు తెలియకపోయినా భారత దేశంలో మాత్రము అత్యంత ఖరీదైనవిగా చెప్పబడుతున్నాయి. భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్స్ 415, 420 ప్రకారం రైస్ పుల్లర్లను ఎవరికైనా అమ్మడం చట్టరిత్యా నేరం. రాగి లోహంతో చేసిన గ్లాసులు, గిన్నెలు, బిందెలు, మూతలు వంటి వస్తువులను రైస్ పుల్లర్లుగా చెప్తారు. రైస్ పుల్లర్లకు మహిమలు ఉంటాయని, వాటిలో అతీతమైన శక్తులు దాగి ఉన్నాయని గతంలో మోసాలకు పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి