iDreamPost
android-app
ios-app

OTT డేట్ లాక్ చేసుకున్న 2 సినిమాలు

  • Published Jun 17, 2020 | 9:05 AM Updated Updated Jun 17, 2020 | 9:05 AM
OTT  డేట్ లాక్ చేసుకున్న 2 సినిమాలు

కొంచెం నెమ్మదిగానే అయినా టాలీవుడ్ లోనూ ఓటిటి సినిమాల సంఖ్య మెల్లగా పెరుగుతోంది. ఈ నెల 19న కీర్తి సురేష్ పెంగ్విన్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది డబ్బింగ్ మూవీ. కాని స్ట్రెయిట్ సినిమాల పరంగా చూసుకుంటే పేరున్న ఆర్టిస్టులు నటించినవి ఇప్పటిదాకా పెద్దగా రాలేదు. ఒక్కొక్కటిగా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. సత్యదేవ్ నటించిన 47 డేస్ జూన్ 30 నుంచి జీ 5 యాప్ లో ప్రీమియర్ కాబోతోంది. చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎట్టకేలకు ఈ దారిని ఎంచుకుంది. పూజా ఝవేరి హీరొయిన్ గా నటించిన 47 డేస్ లో సత్యప్రకాష్, హరితేజ, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగర్, ముక్తార్ ఖాన్, కిరీటి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

దీని ట్రైలర్ ఎప్పుడో ఏడాది క్రితం రిలీజైంది. అప్పటి నుంచి థియేటర్లలోకి రావడానికి విశ్వప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఇప్పుడీ లాక్ డౌన్ వల్ల ఈ రకంగా డిజిటల్ దారి దొరికింది. సస్పెన్స్ కం థ్రిల్లర్ మోడ్ లో రూపొందిన 47 డేస్ కి రఘు కుంచె సంగీత దర్శకులు. ఇక మరో సినిమా భానుమతి రామకృష్ణ వచ్చే నెల 3న ఆహా యాప్ ద్వారా స్ట్రీమింగ్ కాబోతోంది. నవీన్ చంద్ర, సలోనీ లుత్రా జంటగా నటించిన ఈ మూవీ నేరుగా నెట్టింటిలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. సుప్రసిద్ధ నటి భానుమతి గారి కుటుంబీకులు టైటిల్ పట్ల కంటెంట్ పట్ల అనుమానాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కానీ అవేవి రిలీజ్ కు అడ్డంకిగా నిలవకపోవచ్చు. ఈ రెండు చిన్న సినిమాలే అయినప్పటికీ బయటికి వెళ్లకుండా అదనపు ఖర్చు లేకుండా ఇంట్లోనే చూసే వీలుండటంతో ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని మేకర్స్ నమ్మకం.

సత్యదేవ్ నటించిన మరో సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య డేట్ ఇంకా ఫిక్స్ కావాల్సి ఉంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ హక్కులు కొనుగోలు చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతానికి ఓటిటిలో చిన్న సినిమాలే పెద్ద వినోదాన్ని అందిస్తున్నా స్టార్లవి కూడా రావొచ్చనే నమ్మకంతో ఉన్నారు ఇప్పటికీ నాని వి, నిశబ్దం లాంటి వాటి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి కాని ఆయా నిర్మాతలు మాత్రం సైలెంట్ గా ఉన్నారు . ప్రేక్షకులకు మాత్రం ఒక్కో సినిమా ఒక్కో యాప్ లో వస్తుండటంతో అన్నింటికి చందా కట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. కాకపోతే ఆ మొత్తం ఏడాదికి సరిపడా కాబట్టి గిట్టుబాటు అనే లెక్కలో కట్టేసి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలో ఇంకో రెండు అగ్ర నిర్మాణ సంస్థలు కూడా ఓటిటి బాటలో వస్తాయనే టాక్ ఇప్పటికే జోరుగా ఉంది.