Idream media
Idream media
బ్రిటీష్ నాటి చట్టాలే నేటికీ కొన్ని శాఖల్లో అమలవుతున్నాయి. అందులో పోలీసు శాఖ కూడా ఒకటి. ఫలితంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అనేది లేకుండా పోయింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న సిబ్బంది మాదిరిగా తమకు కూడా వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని పోలీసు అధికారులు, సిబ్బంది దశాబ్దాల తరబడి ప్రభుత్వాలకు విన్నవిస్తూనే ఉన్నారు. కానీ వారి కోరికను ఏ ప్రభుత్వం కూడా నెరవేర్చలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి సమస్యలతో పాటు పోలీసులపైన కూడా దృష్టి సారించింది. ప్రజలందరూ రోజూ హాయిగా నిద్రపోయేలా రక్షణగా నిలుస్తున్న పోలీసులు కూడా వారానికి ఒకరోజైనా కుటుంబసభ్యులతో హాయిగా గడిపేలా వీక్లీ ఆఫ్ ఇవ్వాలని నిర్ణయించింది. సుదీర్ఘకాలంగా చర్చలకే పరిమితమవుతూ వస్తున్న ఈ అంశాన్ని అమలుకు శ్రీకారం చుట్టింది.
వాస్తవానికి వైఎస్ జగన్ నేతృత్వంలో కొలువు దీరిన కేబినెట్ తొలి సమావేశంలోనే పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేసేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలంటూ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో ఒక కమిటీ నియమించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో సుమారు 70వేల మంది సిబ్బంది ఉన్నారు. వారిలో కానిస్టేబుల్ నుంచి ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకూ ఉన్న వారికి వీక్లీ ఆఫ్ అమలు చేయాలని కమిటీ సూచనలు చేసింది. దానికి అనుగుణంగా తొలుత విశాఖ, కడప, ప్రకాశం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. సిబ్బంది కేటాయింపులు, సెలవుల మంజూరులో వచ్చిన సమస్యలను పరిశీలించారు. వాటిని పరిగణలోకి తీసుకుంటూ 19 మార్గదర్శకాలు విడుదల చేశారు. వాటి ప్రకారం ఒక విధానం ఎంపిక చేసుకుని ఆయా జిల్లా, కమిషనరేట్ పరిధిలో వీక్లీ ఆఫ్‌లు అమలు చేయాలని నిర్ణయించారు.
స్థానిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఆయా జిల్లాల సూపరింటెండెంట్, కమిషనర్లకు అప్పగించారు. ఇంతలో కరోనా కలకలం సృష్టించడంతో ఆ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాల్సి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా పోలీసులకి వీక్లీ ఆఫ్ ప్రకటించిన ప్రభుత్వం వైసీపీదేనని చెప్పిన సీఎం జగన్ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా కోవిడ్ కారణంగా అమలు చేయలేకపోయిన ఆ విధానాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. పోలీసు శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడతామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. కోవిడ్ వల్ల చనిపోయిన పోలీసులకు పది లక్షల రూపాయలు మంజూరు చేశామని పేర్కొన్నారు.
తమిళనాడులో స్టాలిన్ అధికారంలోకి వచ్చాక ఏపీ మాదిరిగా అక్కడ కూడా పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలని నిర్ణయించారు.ఏదైనా కారణాలతో ఆ రోజున పనిచేయాల్సి వస్తే అదనపు వేతనం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో అయితే పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వీక్లీ ఆఫ్ కు శ్రీకారం చూడుతున్నట్లు జగన్ ప్రకటించడంపై పోలీసు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Covid Vaccination – వందకోట్ల వ్యాక్సి”నేషన్” ..!