Idream media
Idream media
హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద మూడు రోజుల క్రితం జరిగిన ప్రతిపక్షాల మహాధర్నా ఓ చర్చగా మారింది. చాలా సంవత్సరాల తర్వాత అరుదైన రాజకీయ దృశ్యం అక్కడ ఆవిష్కృతం కావడమే అందుకు నిదర్శనం. అదేమిటంటే.. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ, టీజేఎస్ సహా ఇతర పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కలుపుకుని 19 రాజకీయ సంస్థలు ఐక్య కార్యాచరణలో పాల్గొన్నాయి. ఈ స్థాయిలో ఒకే సారి అన్ని పార్టీలు, సంఘాల నాయకులు కలిసి నిరసనల్లో పాల్గొని చాలా రోజులైంది.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ను విజయ బాటలో నడిపించి ముఖ్యమంత్రిగా కొనసాగుతోన్న కేసీఆర్ దెబ్బకు ఇతర పార్టీలు నిశ్శబ్దం అయిపోయాయి. ప్రత్యర్థి పార్టీలోని కీలక నేతలను గులాబీ పార్టీలోకి ఆకర్షించి తిరుగులేని నాయకుడిగా కేసీఆర్ మారారు. సరైన నాయకులు లేని ఆయన ప్రత్యర్థి పార్టీలు కూడా తలో దిక్కు అన్నట్లుగా అయిపోయాయి. తాజాగా అంత మంది ఒకేచోట కలవడం తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారుతోందన్న సంకేతాలను ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి గులాబీ చీడ పట్టిందని ముక్తకంఠంతో నినదించడం చర్చనీయాంశంగా మారుతోంది.
Also Read : రాజకీయాలకు కేశినేని గుడ్ బై .. వారసురాలి రంగ ప్రవేశం?
మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. దేశంతో పాటు తెలంగాణలో కూడా బీజేపీ-టీఆర్‌ఎస్ వ్యతిరేక కూటమిగా ఏర్పడి పోరాడాలని ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని ప్రధాన నాలుగు స్తంభాలను అధికార బీజేపీ ధ్వంసం చేయడంతో భారత రాజ్యాంగ ఉనికే ప్రశ్నార్థకమైందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ప్రశ్నించిన, వ్యతిరేకించిన ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ దాడులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అలాగే.. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 27న జరిగే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రంపై నిరసన సంగతి అటుంచితే.. ఇన్ని రోజులు ఎవరికి వారే అన్నట్లు ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు కేసీఆర్పై పోరాటానికి జత కలిశాయి. తెలంగాణలోని బీజేపీ మినహా మిగతా పార్టీలు ప్రజా సంఘాలు ఒక్క తాటిపైకి కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని బలంగా వినిపించేందుకు సిద్ధమయ్యాయి. ఆ ప్రయాణంలో మొదటి అడుగుగా.. హైదరాబాద్లోని ఇందిరా పార్కు దగ్గర ప్రతిపక్షాలు కలిసి మహా ధర్నా నిర్వహించాయి.
అందులో కాంగ్రెస్ సీపీఎం సీపీఐ టీడీపీ టీజేఎస్ సహా ఇతర పార్టీలతో పాటు ప్రజా సంఘాల నాయకులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పోడు భూములు సమస్య పెరుగుతోన్న ఇంధన ధరలు విచ్చలవిడిగా మాదక ద్రవ్యాల వినియోగం నేతల ఇళ్లపై దాడులు.. ఇలా మరెన్నో విషయాలపై ఇటు రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాన్ని.. అటు కేంద్రంలోని బీజేపీ సర్కారును నిలదీసేలా ఈ మహా ధర్నాలో నాయకులు ప్రసంగించారు. వాళ్ల మాటలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి.
Also Read : రేవంత్, కేటీఆర్ “వైట్ ఛాలెంజ్” మధ్యలో దూరిన సీపీఐ నారాయణ
ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ ఇలా ఏకం కావడం రాష్ట్ర రాజకీయాలకు మంచిదేననే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రశ్నిస్తేనే ప్రభుత్వాలు సక్రమంగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తాయని ఇన్ని రోజులు రాష్ట్రంలో అలాంటిది లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. దీంతో రాజకీయ సంగ్రామం కొత్త మలుపు తిరిగిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇలా రాష్ట్రంలోని ప్రతి పక్షాలు ఒక్కటవడానికి తెలంగాణ ప్రదేశ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడయ్యాక జోరు పెంచిన రేవంత్ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల వరకు వారిని అంటిపెట్టుకుని రేవంత్ ఉండగలరా? ఎన్నికలు సమీపించే కొలదీ కేసీఆర్ చూపించే చాణక్యంతో ఎందరు మిగులుతారు అనేది వేచి చూడాలి.
Also Read : పోచారం వారసత్వం కోసం కుమారుల మధ్య పోరు