iDreamPost
android-app
ios-app

నెత్తురోడిన దండకారణ్యం…. పదిహేడు మంది భద్రతా సిబ్బంది రక్తతర్పణం

నెత్తురోడిన దండకారణ్యం…. పదిహేడు మంది భద్రతా సిబ్బంది రక్తతర్పణం

కరోనా వైరస్ ప్రభావముతో ప్రపంచం చిగురుటాకులాగా వణుకుతున్న విపత్కర పరిస్థితిలోనూ వర్గ పోరు ఆపడం లేదు మావోయిస్టులు.ఛత్తీస్‌గఢ్ అడవులలో మళ్లీ రక్తపు టేరులు పారించారు.శనివారం మధ్యాహ్నం సుక్మా అడవులలో ఎదురు కాల్పుల సంఘటన తర్వాత అదృశ్యమైన 17 కోబ్రా దళ సిబ్బంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అధునాతన డ్రోన్ల సహాయంతో సుక్మా అడవినీ జల్లెడ పట్టడంతో ఈరోజు మధ్యాహ్నం వీరి మృతదేహాలు కనిపించాయి.మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరు చనిపోయారని ఛత్తీస్‌గఢ్ పోలీస్ అధికారులు వెల్లడించారు. మృతులలో ముగ్గురు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF),14 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (GRG) సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిన్నటి ఎదురు కాల్పుల్లో గాయపడ్డ 17 మందిని ఎయిర్ లిఫ్ట్ చేసి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని సుక్మా అడవులలో మావోయిస్టు అగ్రనేతల సమావేశం జరుగుతోందని ఇంటెలిజన్స్ వర్గాలు భద్రతా దళాలకు సమాాచారం చేరవేశాయి. అందిన పక్కా సమాచారంతో DRG, STF, CRPFకి చెందిన సుమారు 600 మందితో కూడిన కోబ్రా దళాలు అడవిలో కూంబింగ్ చేపట్టాయి.చింతగుహలోని మన్నప్ప అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం కోబ్రా దళాలకు మావోయిస్టులు తారసపడడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. మావోయిస్టుల దాడిని జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టడంతో ఆ ప్రాంతం నుంచి మావోయిస్టులు పారిపోయారు.

దీంతో కూంబింగ్ నిలిపివేసి మధ్యాహ్నం వేళ తిరిగి వెనుకకు వెళ్తున్న సమయంలో భద్రతా దళాలపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు.చింతగుహ సమీపంలోని కోర్జాగూడ సమీపంలో 150 సభ్యులు గల DRG, STF బృందంపై విచక్షణారహితంగా కాల్పులకు మావోయిస్టులు తెగబడ్డారు. కాల్పుల శబ్దం విని మిగతా భద్రతా సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని ఎదురు కాల్పులు జరిపారు.పెద్ద సంఖ్యలో భద్రతాదళాలు ఉండటంతో మావోయిస్టులు అడవిలోకి వెళ్లిపోయారు కానీ ఈ సంఘటనలో 17 మంది భద్రతా సిబ్బంది అదృశ్యమయ్యారు. దీంతో రంగంలోకి దిగిన సాయుధ దళాలు డ్రోన్‌ల సహాయంతో అడవిని జల్లెడ పట్టాయి.ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం 17 మంది కోబ్రా సిబ్బంది మృతదేహాలు పోలీసులకు కనిపించాయి.