చెరగని ముద్ర వేసిన ఆ సంతకానికి 16 ఏళ్ళు .

రాజు రాజ్యాధికారాన్ని చేపట్టి ప్రజలను పాలించినప్పుడే రాజు గుణగణాలు బయటపడతాయి అంటారు. సరిగ్గా ఈ నానుడి నిజం చేస్తు 2004 లో ముఖ్యమంత్రి పీఠం అదిరోహించిన డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి గారు తన పాలనతో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో మనసున్న మహారాజుగా చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రజలను అత్యంత ప్రభావితం చేయగలిగిన ముఖ్యమంత్రిగా శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అప్పటి వరకు నియoతృత్వ పోకడలతో అహంకార పూరిత పాలన సాగించిన చంద్రబాబు నాయకుడిని పాదయాత్ర తో ప్రజా ఉద్యమం లేవదీసి గద్దె దింపి, ప్రజా ఉద్యమం ముందు ఎంతటి నియంతైనా మట్టి కరవాల్సిందే అన్న చరిత్రని మళ్ళీ నిరూపించారు. ఆ మహోన్నత ఘట్టానికి నేటికి 16ఏళ్ళు.

ప్రజలకు ఇచ్చిన ఎన్నో హమీలతో ముఖ్యమంత్రి అయిన వై.యస్.ఆర్ కు ఆ పదవి వ్యక్తిగతంగా రాజమకుటమే అయినా, వ్యవస్థా పరంగా ఆనాటికి అది ముళ్ళ కిరీటం. అప్పటికే 9ఏళ్ళు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని చిన్నా భిన్నం చేసి , ఖజానాని పూర్తిగా ఖాళీ చేసి వెళ్లాడు. కానీ వైఎస్ ఏనాడు వెనకడుగు వేయలేదు . 2014 లో చంద్రబాబు మాదిరి తొలిసంతకం పేరున కమిటీలు వేసి ప్రజలను మోసగించకుండా ప్రజలకు తాను వాగ్ధానం చేసినట్టుగానే తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైలు పై పెట్టి, 1500 కోట్ల భారం మోస్తూ రాష్ట్రంలో 30 లక్షల పంపు సెట్లకి, ఉచిత కరెంటు ఇచ్చి అందరిని ఆశ్చర్య పరిచారు. బహుశా చెప్పిన తేదీకి చెప్పినట్టుగా మాటకు కట్టుబడి ప్రజల పక్షాన నిలిచిన ముఖ్యమంత్రిని చూడటం రాష్ట్ర ప్రజలకు అదే మొదటిసారి కావచ్చు.

ఏనాడు చంద్రబాబు మాదిరి బీద అరుపులు అరవకుండా చిన్నాబిన్నమైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతూనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించారు. ఫీజు రీయంబర్స్ మెంటు, ఆరోగ్యశ్రీ, 108, పావలా వడ్డి లాంటి వై.యస్ అందించిన సంక్షేమ ఫలాలు తీసివేసే సాహసం ఎవరు చేయాలని చూసిన ప్రతి గడప నుండి విప్లవం పుట్టుకొచ్చే విధంగా సంక్షేమ పధకాలు రూపొందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. నేటికీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నీటి ప్రాజక్టులలో అనేకం జలయజ్ఞం పేరిట ఆయన చేతుల్లో రూపు దాల్చినవే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన పాలించిన 5ఏళ్లలో 12 ప్రాజెక్టులు పూర్తి చేసి కొత్తగా తెలుగు రాష్ట్రాలో 19 లక్షల ఎకరాలకు నీరు అందించారు కాబట్టే ఆయన పాలనని ఇప్పటికీ రైతు రాజ్యం గా చెబుతారు. ఇక నేడు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆయుపట్టులా మారిన పోలవరం ప్రాజెక్టుకు ఆయన చెసిన కృషి చిరస్మరణీయం.

చీ, చీ నా రాజశబ్దంబు జన్మాంతరమందు నొల్లనుజుమీ శ్రీకాళహస్తీశ్వరా! అన్నాడు దూర్జటి – తాను అనుకున్నదల్లా నిజం అయిపోతే అది శాపం, అధికారం చేతిలో ఉన్నవారికి ఆ శాపం ఉంటుంది. ఏది పడితే అది అజ్ఞాపించి ధర్మానికి విరుద్దంగా వెళ్ళి వ్యవస్థలను నాశనం చెస్తే చివరికి జరిగేది ఏమిటి దాని ఫలితాలు ఎలా ఉంటాయో , వై.యస్.ఆర్ పాలన , చంద్రబాబు పాలన మధ్య ఉన్న వ్యత్యాసమే ఒక నిదర్శనం గా చూడవచ్చు . వై.యస్ గెలుపు తనలోని భాద్యతను రెట్టింపు చెస్తే చంద్రబాబు గెలుపు తనలోని అహంకారాన్ని రెట్టింపు చేసింది. ఒక్క సంతకం కోటి జీవితాలని నిలబెడుతుంది , ఇంకో సంతకం కోటి జీవితాలని కుదిపేస్తుంది. వై.యస్ అధికారంలో పెట్టిన ఒక సంతకం కోటి జీవితాల్లో వెలుగు నింపితే , చంద్రబాబు ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరిస్తూ చేపట్టిన తొలి సంతకం కోటి జీవితాలను కుదిపేసింది. అందుకే వై.యస్ విజయం ఆ తరువాత ఆయన పాలన రాష్ట్ర చరిత్రలో ఒక మధుర జ్ఞాపకంగా ఇప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అని చెప్పవచ్చు.

Show comments