iDreamPost
android-app
ios-app

జ‌గ‌న్ చేసి చూపుతున్నారు..!

జ‌గ‌న్ చేసి చూపుతున్నారు..!

క‌రోనా కాలంలో ప్ర‌జ‌ల‌కు కావాల్సింది నాణ్య‌మైన‌, ఉచిత లేదా అతి త‌క్కువ ధ‌ర‌లో వైద్యం. ప్ర‌భుత్వాలు కూడా ఆ దిశ‌గానే చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. కానీ ఆదేశాలిచ్చి ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కొన్ని రాష్ట్రాల‌లో ఉచిత వైద్యం ప్ర‌జ‌ల‌కు పూర్తిగా అంద‌డం లేదు. మ‌రోవైపు ప్రైవేటు ఆస్ప‌త్రులు ఇష్టానుసారం ప్ర‌జ‌ల‌ను దోచుకుంటున్నాయి. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వాలు ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నా ఆచ‌ర‌ణ‌లో వెనుకంజ వేస్తున్నాయి. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం ప్ర‌జ‌ల‌కు ఉచిత వైద్యంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. అలాగే ప్రైవేటు హాస్పిటళ్ళ దందా పై సీరియస్ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 52 ఆసుపత్రులకు రూ.3.61 కోట్ల ఫైన్ విధించి షాకిచ్చారు. గడిచిన రెండు రోజుల్లో 35 ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరించే ఏ ఆసుపత్రి పైనైనా చర్యలు తప్పవని తేల్చారు.

నిజానికి ప్రభుత్వ మార్గదర్శకాలకు భిన్నంగా ప్రైవేటు ఆసుపత్రులు వ్యవహరించటం..వారికి వార్నింగ్ లు ఇచ్చి ఊరుకోవటమే తప్పించి.. వారిపై చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సైతం పెద్దగా సాహసించలేని పరిస్థితి. అలాంటిది.. అందుకు భిన్నంగా జగన్ సర్కారు మాత్రం కఠినంగా ఉండటం గమనార్హం. ఆరోగ్య శ్రీ కింద అందుతున్న ఉచిత చికిత్సలపై నిరంత‌రం అధికారుల‌తో స‌మీక్షిస్తున్నారు. ఆస్పత్రుల్లో కచ్చితంగా 50శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ అందేలా చేశారు. ప్ర‌జ‌ల‌కు వైద్యం ఎలా అందుతుంద‌నేది సీఎం ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రీశీలిస్తున్నారు. ఇందుకోసం ఆరోగ్య మిత్రలు స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేసేలా చేశారు. ఆస్ప‌త్రుల్లోని సీసీ కెమెరాలు సమర్థవంతగా పని చేసేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అంత‌టితో ఆగ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు ప్రైవేటు ఆస్ప‌త్రుల‌పై అధికారులు దాడులు చేస్తున్నారు. అధికంగా ఛార్జీలు వసూలు చేసినందుకు తీసుకునే చర్యలు ముఖ్యమైనవి. అవకతవకలకు పాల్పడే ప్రైవేటు హాస్పిటళ్ళ పై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే నేరుగా త‌న‌కే నివేదిక అందించాల‌ని జ‌గ‌న్ తెలిపారు. కలెక్టర్లు ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి అని సీఎం పేర్కొన్నారు.

క‌రోనా నేప‌థ్యంలో ఎదురైన స‌వాళ్ల‌ను దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రంలో హెల్త్ హ‌బ్‌లు ఏర్పాటు చేసే దిశ‌గా అడుగులు వేస్తోంది.. దీని కోసం త్వ‌ర‌లోనే కొత్త పాల‌సీని కూడా తీసుకువ‌స్తోంది ఏపీ స‌ర్కార్. ప్రజలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ వైద్యానికి ఎందుకు వెళ్లాల్సి వస్తోందన్నది ఆలోచించాల‌ని అధికారుల‌కు సూచించారు.. జిల్లా ప్రధాన కేంద్రాలు, ఆ జిల్లాల్లోని నగరాల్లో హెల్త్‌హబ్‌లను ఏర్పాటు చేయాల‌న్న ఆయ‌న‌.. రాష్ట్రంలో కనీసం 16 చోట్ల ఈ హెల్త్‌ హబ్‌లను ఏర్పాటు చేయాల‌ని.. జిల్లా కేంద్రాలతోపాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి కలుపుకుని మొత్తం 16 చోట్ల హెల్త్‌ హబ్‌లు ఉండాల‌ని.. ఒక్కో చోట కనీసంగా 30 నుంచి 50 ఎకరాలు సేకరించాల‌ని.. ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాలు చొప్పున కేటాయించాల‌ని ఆదేశించారు.

మూడేళ్లలో కనీసంగా రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు ఈ భూములు ఇవ్వాల‌ని సూచించారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. దీనివల్ల కనీసంగా 80 మల్టీ, సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు వ‌స్తాయ‌న్న ఆయ‌న‌.. వీటితోపాటు ప్రభుత్వం తరఫున కొత్తగా మరో 16 వైద్యకళాశాలలు, నర్సింగ్‌కాలేజీలు వస్తున్నాయ‌ని తెలిపారు.. ప్రభుత్వ పరంగా ఆరోగ్య రంగం బలోపేతం కావడంతోపాటు, మనం ఇచ్చే ప్రోత్సాహం కారణంగా ప్రైవేటు రంగంలో కూడా మంచి ఆస్పత్రులు వ‌స్తాయ‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేసిన సీఎం.. ఈ పాలసీ వల్ల ప్రతి జిల్లాకేంద్రంలో, కార్పొరేషన్లలో మల్టీస్పెషాల్టీ, స్పెషాల్టీ ఆస్పత్రులు వ‌స్తాయ‌న్నారు. దీనివల్ల టెరిషరీ కేర్‌ విస్తృతంగా మెరుగుపడుతుంద‌ని.. ఇతర ప్రాంతాలకు వైద్యానికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండ‌ద‌న్నారు. ఒకనెలరోజుల్లో కొత్త‌ పాలసీని తీసుకురావాలని అధికారుల‌ను ఆదేశించారు ఏపీ సీఎం… అలాగే వ్యాక్సిన్‌ తయారీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో తయారయ్యేలా కూడా తగిన చర్యలు తీసుకోవాలన్న ఆయ‌న‌.. దీనిపైకూడా ఒక విధానాన్ని తీసుకురావాల‌న్నారు. ఇక‌, కొత్త పాల‌సీ వ‌చ్చి.. అదు అమ‌లు జ‌రిగి హెల్త్ హ‌బ్‌లు ఏర్పాటు జ‌రిగితే.. ఏపీలో వైద్య రంగంలో కీల‌క మార్పులు చోటుచేసుకోవ‌డం ఖాయంగా చెప్ప‌వ‌చ్చు.