iDreamPost
android-app
ios-app

ప్రజలే నేను అంటూ సాగిన ప్రజా నాయకుడు ప్రకాశం పంతులు

ప్రజలే నేను అంటూ సాగిన ప్రజా నాయకుడు ప్రకాశం పంతులు

ఆంధ్ర రాష్ట్ర రాజకీయ రంగంలో దాదాపు అర్ధ శతాబ్దం పాటు ప్రకాశించి తెలుగువారిలో రాజకీయ చైతన్యాన్ని రగిల్చిన ధీరోదాత్తుడు. దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వాళ్లని తన దైర్య సాహసాలతో గడగడలాడించి ఉక్కుపిడుగుగా ఖ్యాతి గడించిన మహా నాయకుడు. పేదరికంతో జీవితం మొదలుపెట్టి ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన సమర యోధుడు ఆంద్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు.

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం, వినోదరాయునిపాలెము గ్రామంలో సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు 1872 ఆగష్టు 23 న జన్మించిన ప్రకాశం ప్రాధమిక విద్య వల్లూరు వీధి బడిలో మొదలై లండన్ లో బారిష్టర్ చదువుతో పూర్తి చేశారు. మొదట రాజమండ్రిలో న్యాయశాస్త్రం అభ్యసించిన ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లీడరుగానే ఉండిపోవడం ఇష్టం లేక పై స్థాయి కోర్టులలో వాదించడానికి వీలుగా 1904లో ఇంగ్లాండు వెళ్ళి బారిష్టర్ చదివి తిరిగి భారతదేశంవచ్చి మద్రాసు హైకోర్టులో క్రిమినల్ లాయరుగా ప్రాక్టీసు ప్రారంభించారు.

రాజమండ్రిలో సెకండ్ గ్రేడ్ ప్లీడరుగా ఉన్న ప్రకాశం తన తొలి రాజకీయ అడుగులు రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడు అవ్వడంతో మొదలయ్యాయి. ఆ తరువాత బరిష్టర్ చదువుకోసం ఇంగ్లాండ్ వెళ్ళిన ప్రకాశాన్ని భారత దేశంలో జరుగుతున్న బెంగాల్ విప్లవం, బాలగంగాదర్ తిలక్, లాలాలజపతిరాయి పోరాటాలు బాగా ఆకర్షించాయి. దీంతో కాంగ్రెస్ స్థాపనలో ఒకడైన దాదాబాయ్ నౌరోజీ ఆద్వర్యంలో నడుస్తున్న లండన్ ఇండియన్ అసోషియన్ లో సభ్యుడిగా చేరారు. అక్కడే ఆయనకు హోం రూల్ సొసైటి స్థాపకుల్లో ఒకరైన శ్యాంజీ కృష్ణవర్మ లాంటి విప్లవకారులతో కూడా పరిచయాలు ఏర్పడ్దాయి.

మద్రాసులో లాయరుగా ఉన సమయంలో పట్టాభిసీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు సలహామేరకు స్వరాజ్య అనే పత్రికని 1921 అక్టోబర్ 29న స్థాపించి ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషలలో విడుదల చేశారు. అదే సమయంలో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా నల్లజండాలతో ఊరేగింపు చేసి. అడ్డుకున్న పోలీసుల తుపాకీకి గుండెను చూపి దమ్ముంటే కాల్చండిరా అని గర్జించారు. గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ప్రజల్లో స్వతంత్ర కాంక్షని తీవ్రతరం చేసే విధంగా అనేక ఉపన్యాసాలు ఇచ్చారు.

Also Read : అల్లూరి పోరాటానికి వందేళ్లు

1936 ఎన్నికల్లో మద్రాసు అసెంబ్లీ స్థానాలు అన్నీ కాంగ్రెస్ కైవసం చేసుకోగా రాజాజీ కెబినేట్ లో రెవిన్యూ మంత్రిగా భాద్యతలు చేపట్టిన ప్రకాశం జమీందారి రద్దు నివేదిక తయారు చేశారు. జమీందార్లకు రక్షణగా ఉన్న జీవోలు కనపడలేదని అధికారులు చెబితే ఏకంగా కనపడని జీఓలు అన్ని రద్దు అయినట్టు జీవో ఇవ్వమని సంచలన ప్రకటన చేశారు. ఇంతలో ప్రపంచ యుద్దం మొదలు అవ్వడంతో తమని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకున్నందుకు నిరసనగా కాంగ్రెస్ మంత్రి వర్గంలో కొందరు రాజీనామా చేశారు .

1946లో రెండవ ప్రపంచ యుద్దం ముగియడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు 1935 యాక్టును సవరించి తిరిగి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో గాంధీ గారిని ఎదిరించి ఎన్నికల్లో పోటీ చేసి ముత్తురంగ ముదలియార్ పై గెలిచిన ప్రకాశం మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు. ఆ సమయంలో ప్రకాశం ప్రజల భాషలోనే పరిపాలన జరగాలని ప్రతి జిల్లా స్థాయిలో మాతృ భాషను ప్రవేశపెట్టారు. దీంతో తూర్పు గోదావరి నుండి తెలుగు, తంజావూరు నుండి తమిళం, మలబారు నుండి మళయాళం భాషల్లో పాలన జరగాలని ఆదేశించారు. రాష్ట్రమంతట మద్యాన్ని నిషేధించారు. సహకార సంఘాలను ఏర్పరిచారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టు అయిన రాజకీయ ఖైదీల విడుదలకు ఆర్డరు పాస్ చేశారు. స్పీకర్ ఎన్నికల్లో ప్రకాశం గారి అభ్యర్ధి అయిన తెన్నేటి విశ్వనాధాన్ని ఓడించడంతో మొదలైన కుమ్ములాటలు కామ్రాజ్ నాడర్ , రాజగోపాలచారి కలిసి ఏడాది తిరగకముందే ప్రకాశం మంత్రి వర్గం పై అవిశ్వాసం పెట్టి ప్రకాశాన్ని 1947 మార్చ్ లో దింపి రామస్వామి రెడ్డియార్ ని ముఖ్యమంత్రిని చేశారు.

1951 ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షపదవికి జరిగిన ఎన్నికల్లో పట్టాభిసీతారామయ్య బలపరిచిన నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు బలపరిచిన ఎన్.జీ రంగాను ఓడించి అధ్యక్షుడు అవ్వడంతో, విజయవాడలోని కాలేశ్వరరావు ఇంట్లో సమావేశం అయి రాష్ట్ర కాంగ్రెస్ నుండి ప్రకాశం, రంగాలు తప్పుకుని ప్రజా పార్టీని స్థాపించారు. ఇదే సమయంలో కేంద్రంలో కృపాలని, అజిత్ ప్రసాద్ జైన్, రఫి అహ్మద్ వంటి నాయకులు కాంగ్రెస్ పార్టీనుండి విడిపోయి కిసాన్ మజ్దూర్ అనే కొత్త పార్టీ స్థాపించి , ఆ పార్టీలోకి ప్రకాశాన్ని , రంగాను ఆహ్వానించారు. అయితే ఆ పార్టీలో రంగా తనకు ప్రముఖ స్థానం లభించలేదని బయటికి వచ్చి కృషికార్ లోక్ పార్టీని స్థాపించారు. 1952లో ఈ పార్టీలన్ని ఎన్నికల రంగంలోకి దిగాయి.

Also Read : ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మృతి

1952 ఎన్నికలలో టంగుటూరి ప్రకాశం గారు మద్రాస్ నగరం లోని హార్బర్ శాసనసభ నియోజకవర్గం నుండి కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ (KMPP) పక్షాన పోటీచేశారు. ప్రకాశం కు ప్రత్యర్ధులుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీ ఉడుపి కృష్ణా రావు తో పాటుగా మరో ఏడుగురు తలపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మద్రాస్ నగర మేయర్ గా పనిచేసిన, మెడిసిన్ చదివిన డా . కృష్ణా రావు 46.68% ఓట్లు పొంది ఘనవిజయం సాధించగా ఇబ్రహీం సాహెబ్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థి 24.% తో రెండవ స్థానంలో నిలిచారు. ఇక ప్రకాశం పంతులు గారు కేవలం 15.96% ఓట్లతో మూడవ స్థానంలో నిలిచి డిపాజిట్ సైతం కోల్పోయారు.

ఆంధ్రకేసరిని ఓడించి జెయింట్ కిల్లర్ గా డా. కృష్ణా రావు శ్రీ. రాజాజీ కాబినెట్ లో పరిశ్రమల మరియు కార్మిక శాఖ మంత్రిగా, తరువాత 1957 నుండి 1961 వరకు శ్రీ. కామరాజ్ నాడార్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. ప్రకాశం తాను స్వయంగా ఓడిపోయినప్పటికీ, తన నాయకత్వంలోని KMPP పోటీచేసిన 148 స్థానాలలో 35 చోట్ల గెలుపొందింది. శృంగవరపుకోట శాసనసభ నుండి ఎన్నికైన చాగంటి వెంకట సోమయాజులు ప్రకాశం కోసం తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయగా, ఉపఎన్నికలలో ప్రజా సోషలిస్ట్ పార్టీ పక్షాన శ్రీ ప్రకాశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1953 అక్టోబర్ లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత శ్రీ టంగుటూరి ప్రకాశం కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరి మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయి 1953 అక్టోబర్ నుండి 1954 నవంబర్ వరకు పనిచేశారు.

ప్రకాశం పంతులు అప్పటికి 80 సంవత్సరాల వయోభారంతో ఉండటంతో కేబినేట్ లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి పెత్తనం చేయడంతో సహించలేని కొందరు నాయకులు ప్రభుత్వాన్ని పడగొట్టే ఎత్తుగడలకు పదును పెట్టారు అందులో భాగంగా అప్పటి ప్రభుత్వం తీసుకున్న మద్యపాన నిషేధ నిర్ణయాన్ని కృషి కార్ లోక్ పార్టీ నేత గౌతు లచ్చన్న వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున దీక్షలు చేశారు. ఈ వివాదం చిలికి చిలికి చివరికి ప్రకాశం పంతులు అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి ప్రభుత్వం కూలిపోయింది. 1955 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఒంగోలు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన టంగుటూరి ప్రకాశం ఒంగోలు బెజవాడ ప్రాంతాల్లో రాజకీయ పర్యటన సాగిస్తూ ఉండగా వడదెబ్బ తగలడంతో 1957, మే 20న హైదరాబాద్ లో ఉస్మానియా ఆసుపత్రిలో చనిపోయారు . ప్రజలే నేను , నేనే ప్రజలు అంటు సాగిన ఆయన జీవితం సాహసానికి , త్యాగానికి , పోరాట స్ఫూర్తికి దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. తెలుగునేల పై ఆయన ఎప్పటికి సజీవుడే.

నేడు వారి 150వ జయంతి సందర్భంగా..