iDreamPost
android-app
ios-app

ఉప ఎన్నికల్లో ఊహించని పరిణామం.. బద్వేలు బరిలో 14 పార్టీలు

ఉప ఎన్నికల్లో ఊహించని పరిణామం.. బద్వేలు బరిలో 14 పార్టీలు

తెలుగు రాష్ట్రాలలో జరుగుతున రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు, తెలంగాణలోని హుజురాబాద్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. చివరి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బద్వేలు, హుజురాబాద్‌లలో బీజేపీ అభ్యర్థులు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేశారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరు వెంకట్‌ కూడా ఈ రోజే తన నామినేషన్‌ వేశారు.

బద్వేలులో ఊహించని స్థాయిలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 35 నామినేషన్లు దాఖలవ్వగా.. అందులో 14 పార్టీల తరఫున మొత్తం 15 మంది నామినేషన్లు వేశారు. అధికార పార్టీ తరఫున దివంగత ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య సతీమణి సుధ నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు పోటీ చేయడం లేదని ప్రకటించాయి. బీజేపీ తరఫున ఆ పార్టీ యువజన విభాగం నేత పనతల సురేష్, కాంగ్రెస్‌ పార్టీ తరఫున పి.ఎం. కమలమ్మ నామినేషన్‌ దాఖలు చేశారు.

Also Read : ప్రధానికి జగన్‌ లేఖ .. సమస్య రాకుండా చూస్తారా..?

ఇక, అర్థం మానవతావాదీ రాష్ట్రీయదల్‌ పార్టీ తరఫున విజయ్‌కుమార్, డేగల సాంబశివరావు, అంబేద్కర్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ముత్యాల ప్రసాదరావు, నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున సింగమల వెంకటేశ్వర్లు, జనసహాయశక్తి పార్టీ తరఫున సగిలి సుదర్శన్, లోక్‌తంత్రిక జనతాదల్‌ పార్టీ తరఫున జి.రత్నం, మన పార్టీ తరఫున చెన్నయ్య, తెలుగు జనతా పార్టీ తరఫున ఓబుళాపురం ఓబుళేషు, మహజన పార్టీ అభ్యర్థిగా సంగటి మనోహర్, ఇండియా ప్రజా బంధు పార్టీ తరఫున పల్లె నాగరాజు, నవతరం పార్టీ అభ్యర్థిగా గోదా రమేష్‌కుమార్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు మరో 20 మంది నామినేషన్లు వేశారు.

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో మొత్తం 15 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్‌ తరఫున గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, బీజేపీ తరఫున ఈటల రాజేందర్, బీజేపీ డమ్మీ అభ్యర్థిగా ఈటల సతీమణ జమున, కాంగ్రెస్‌ తరఫున బల్మూరు వెంకట్, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ తరఫున మహ్మద్‌ మన్సూర్‌ అలీ, ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థిగా సిలివేరి శ్రీకాంత్లు నామినేషన్లు వేశారు. మరో 9 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.

Also Read : టీడీపీ ఆ పని మానేసిందట.. ఆ విషయం మరచిపోయిందట..