ఆవేశం ఆలోచన కలిసిన కుర్రాడి ‘జల్సా’

గతానికి పునాది

2007 సంవత్సరం. పవర్ స్టార్ గా అశేష అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యణ్ ఒకరకంగా బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దాని స్థాయిని కొనసాగించే సినిమా రాలేదు. దర్శకులు, కథల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నప్పటికీ ఎదురుదెబ్బలు తప్పడం లేదు. జానీతో మొదలుపెట్టి గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం అన్నీ ఒకదాన్ని మించి మరొకటి తిరుగుటపా కట్టినవి. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుని తాను చేస్తున్న తప్పేంటో పవన్ కు మెల్లగా తెలుస్తోంది. తన ఎనర్జీని సరిగ్గా వాడుకుంటూ దాన్ని యధాతధంగా తెరమీద చూపించే సమర్ధుడైన డైరెక్టర్ కావాలి.

త్రివిక్రమే ఎందుకు

అతను ఎవరు, ఎప్పుడు వస్తాడు ఇదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అప్పుడు తగిలాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నువ్వే నువ్వేతో అతనిలో ఎమోషనల్ మేకర్ బయట పడ్డాడు. అతడులో తనలో ఎలాంటి స్టైలిష్ ఎంటర్ టైనర్ ఉన్నాడో చూపించాడు. ఇప్పుడు ఈ రెండింటిని కలగలిసి పవన్ లాంటి అల్టిమేట్ పవర్ హౌస్ ని బ్రహ్మాండంగా పేల్చే డైనమైట్ లాంటి సబ్జెక్టు కావాలి. దానికి జల్సా కంటే వేరే బెస్ట్ ఆప్షన్ కనిపించలేదు త్రివిక్రమ్ కు. అదే చెప్పాడు హీరోకు. తన ఆలోచనలకు చాలా దగ్గరగా ఉండే ఇంత గొప్ప కథను ఒప్పుకోకపోతే ఎంత పెద్ద పొరపాటు అవుతుందో పవన్ గుర్తించాడు. ఆలస్యం చేయలేదు. కట్ చేస్తే షూటింగ్ మొదలైపోయింది.

అంత గొప్ప కథా

సంజు ఉరఫ్ సంజయ్ సాహు(పవన్ కళ్యాణ్)జీవితాన్ని చాలా సరదాగా గడుపుతూ పిజి చేస్తూ యోగా టీచర్ గా స్నేహితులతో కలిసి ఓ ఇంట్లో ఉంటాడు. ఓ అమ్మాయిని(కమిలిని ముఖర్జీ)ప్రేమించి అది కొన్ని విచిత్రమైన కారణాల వల్ల ఫెయిల్ అయితే తెలియకుండానే ఆమె చెల్లి భాగమతి(ఇలియానా)ని లవ్ లో పడేస్తాడు. కానీ సంజు కోసం నగరానికి వచ్చి అతన్ని వెతుకుతూ ఉంటుంది దామోదర్ రెడ్డి(ముఖేష్ ఋషి) గ్యాంగ్. ఓ సందర్భంలో సంజు వల్ల ఫ్రెండ్స్ ప్రమాదంలో పడతారు. అప్పుడు సంజుకు సంబంధించిన నక్సలైట్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. అసలు సంజుకి దామోదర్ రెడ్డికి ఉన్న శత్రుత్వం ఏంటి, పూర్వాశ్రమంలో నక్సలైట్ గా ఉన్నవాడు సాధారణ జీవితంలో కాలేజీ స్టూడెంట్ గా ఎలా మారాడు అనేదే జల్సా కథ

మేజిక్ చేసిన అంశాలు .

నిజానికి జల్సాలో పైకి వినోదం ఉన్నట్టు కనిపించినా అంతర్గతంగా చాలా ఫిలాసఫీ ఉంటుంది. త్రివిక్రమ్ కలం ఇందులో చాలా బలంగా పనిచేసింది. ఒకవైపు హాస్యాన్ని ఒలికిస్తూనే మరోవైపు ఉత్కంఠని, ఆలోచింపజేసే సందేశాన్ని చెబుతూనే ఉంటుంది. అందుకే జల్సా కమర్షియల్ లెక్కల్లో కన్నా ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేసింది. సంజు క్యారెక్టర్ లోని ఫైర్ ని ఇంటర్వెల్ బ్లాక్ దాకా దాచి పెట్టిన త్రివిక్రమ్ అక్కడి నుంచి కథను ఇంకో లెవల్ కు తీసుకెళ్తాడు. దామోదర్ రెడ్డి సంజును ఎందుకు వెతుకుతున్నాడన్న కారణాన్ని రివీల్ చేయకుండా అతని విలనిజాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రేక్షకులను ఓ రకమైన భావావేశపు యుద్ధానికి సిద్ధపడేలా చేస్తాడు. అదే జల్సాలోని ప్రత్యేకత.

పవన్ ఎలా వాడుకోవాలో పూర్తిస్థాయిలో హోమ్ వర్క్ చేసిన త్రివిక్రమ్ దానికి తగ్గట్టే సంజయ్ సాహు పాత్రను తీర్చిదిద్దాడు. ఈ క్రమంలో కొంత తడబాటు కూడా జరిగింది. నక్సలైట్ గా ఉన్నప్పుడు, తీరు మార్చుకుని జనజీవితంలోకి వచ్చినప్పుడు ఒకే తరహా మనస్తత్వాన్ని చూపించి అన్నింటిని టేకిట్ ఈజీ పాలసీ తరహాలో చూపించడం మరీ కన్విన్సింగ్ గా అనిపించదు. కాకపోతే ముందే చెప్పినట్టు త్రివిక్రమ్ లోని రైటర్, టెక్నీషియన్ జల్సాను ఇంకో లెవెల్ కు తీసుకెళ్లాయి. దానికి దన్నుగా నిలిచిన దేవిశ్రీప్రసాద్ హుషారైన పాటలు, సీన్స్ ని ఎలివేట్ చేసిన అద్భుతమైన నేపధ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే

తూగినవి – తగ్గినవి

నిజానికి సమాజంలో అసమానతలను గుర్తించకుండా మనకేదో అష్టకష్టాలు ఉన్నాయని తెగబాధపడిపోయే సగటు నగర జీవి చెంప చెల్లుమనిపించేలా ఇంటర్వల్ బ్యాంగ్ లో సంజయ్ సాహు చెప్పే డైలాగ్స్ లో చాలా లోతు ఉంటుంది. ఒక్క రోజు పాలు దొరక్కపోయినా, ఓ వారం జీతం ఆలస్యమైనా కొంపలు మునిగిపోయినట్టు శోకాలు తీసే వాళ్లకు కనువిప్పు కలిగేలా త్రివిక్రమ్ ఆ సన్నివేశంలో చాలా గొప్ప సంభాషణలు రాశాడు. కానీ ఎంటర్ టైన్మెంట్ మెయిన్ లేయర్ గా ఉండటంతో ఈ కాన్సెప్ట్ అందరికి కనెక్ట్ కాలేకపోయింది.

జల్సాలో మరొక ముఖ్యమైన అంశం క్యాస్టింగ్. ఏ పాత్రకు ఇంకో ఆప్షన్ ఉంటే బాగుండేది కదా అనే ఆలోచనే రానివ్వనంత గొప్పగా త్రివిక్రమ్ ఇందులో నటీనటులను సెట్ చేసుకున్నాడు. ఉదాహరణకు సెకండ్ హాఫ్ లో అటు ఇటు ఊగిసలాగుతున్న గ్రాఫ్ ని అమాంతం నిలబెట్టింది ప్రణవ్ పాత్ర పోషించిన బ్రహ్మానందం. అందులో పుట్టుకొచ్చిన కామెడీ చాలా లోపాలను కప్పిపుచ్చింది. దామోదర్ రెడ్డి వెనకే ఉంటూ సలహాలిచ్చే బుల్లి రెడ్డిగా తనికెళ్ళ భరణిది కూడా సెటిల్డ్ పెర్ఫార్మన్స్. తన శైలికి భిన్నంగా కామెడీ టచ్ ఉన్న హీరోయిన్ తండ్రిగా ప్రకాష్ రాజ్, ఇలియానా ఫ్రెండ్ గా సునీల్, డాక్టర్ గా ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇలా ఎవరికి వారు తమతమ పాత్రలను చక్కగా పండించారు.

ఫినిషింగ్ టచ్

జల్సా బాక్స్ ఆఫీస్ లెక్కల్లో ఖుషి లాంటి ట్రెండ్ సెట్టర్ కాకపోవచ్చు అత్తారింటికి దారేది తరహాలో ఇండస్ట్రీ రికార్డులు సృష్టించకపోయి ఉండవచ్చు. కానీ వినోదాన్ని జొప్పిస్తూనే ఒక సీరియస్ అంశాన్ని డీల్ చేసిన తీరుకు మాత్రం జల్సా చాలా ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయింది. అందుకే నెవర్ బిఫోర్ తరహాలో ఓపెనింగ్స్ రాబట్టుకున్న జల్సా దానికి అనుగుణంగానే చాలా కేంద్రాల్లో భారీ వసూళ్లు కూడా రాబట్టుకుంది. కాకపోతే అది చేరుకోవాల్సిన స్థాయిని మాత్రం అందుకోలేకపోయింది. అయినప్పటికీ జల్సా లాంటి నిజాయితీ కలిగిన ప్రయత్నం ఆలస్యంగా అయినా తర్వాతి టైంలో బెస్ట్ ఎంటర్ టైనర్ గా అభిమానులకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా మిగిలిపోయింది. సరిగ్గా 12 ఏళ్ళ క్రితం ఇదే రోజున విడుదలైన జల్సా ఎన్ని సంవత్సరాలు గడిచినా పవన్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా తన స్థానాన్ని కాపాడుకోవడం మాత్రం తథ్యం.

Show comments