ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు సంబంధించిన 11 మంది వైసీపీ ఎమ్మెల్సీలు బుధవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ కార్యాలయంలో కొత్త ఎమ్మెల్సీలతో నూతన చైర్మన్ మోషేన్‌రాజు ప్రమాణం చేయించారు. ఏపీలో స్థానిక సంస్థల కోటాలో 8 జిల్లాలోని 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 11 ఎమ్మెల్సీ స్థానాలలోనూ వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. అనంతపురం నుంచి వై.శివరామిరెడ్డి, విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖపట్నం నుంచి వరుదు కల్యాణి, వంశీ కృష్ణ యాదవ్, తూర్పుగోదావరి నుంచి అనంత ఉదయభాస్కర్, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్, చిత్తూరు నుంచి భరత్ గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంత రావు, ప్రకాశం నుంచి తూమాటి మాధవరావు శాసనమండలి సభ్యులుగా నూతన ప్రమాణస్వీకారం చేశారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల శాఖ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ లు హాజరయ్యారు. ఇక ప్రజలు వైఎస్ జగన్ కు పట్టం కట్టాక ఏపీలో జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇలా అన్నింటిలోనూ వైసీపీ హవా కొనసాగిస్తోంది. ఇక అలానే ఈ 11 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండటంతో.. వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు చిన్న గోవిందరెడ్డి, ఇసాక్ భాషా, పాలవలస విక్రాంత్ వర్మలు ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
శాసన మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటే ఇప్పుడు వైసీపీ సభ్యుల సంఖ్య 32కు చేరింది. టీడీపీ సంఖ్యా బలం 15కు తగ్గింది. పిడిఎఫ్ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఇద్దరు, స్వతంత్రులు మరో ముగ్గురు సభ్యులు మండలిలో ఉన్నారు. వైసీపీ నుంచి సభ్యులుగా ఉన్న వారిలో 14 మంది ఎస్సీ – బీసీ వర్గాలకు చెందిన వారు కాగా నలుగురు మైనార్టీలు. అయితే వారిలో ఒక మైనారిటీ సభ్యురాలు కరి మున్నీసా ఈ మధ్యనే మరణించారు. అసెంబ్లీలో ఆమోదించిన మూడు రాజధానుల బిల్లులు సహా అనేక ప్రజా సంక్షేమ బిల్లులను అప్పట్లో టీడీపీ తమకున్న సంఖ్యా బలంతో అడ్డుకుంది. ఇక ఈ క్రమంలో అప్పట్లో మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. తాజాగా మండలి రద్దు తీర్మానం ను జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటూ మరో తీర్మానం చేసింది.
Also Read : CM YS Jagan, OTS Scheme – ఓటీఎస్ పై సమీక్ష.. క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్