iDreamPost
android-app
ios-app

దేశంలో కరోనా మరణాలపై మళ్లీ చర్చ..!

దేశంలో కరోనా మరణాలపై మళ్లీ చర్చ..!

దేశంలో కరోనా మరణాలు ఎన్ని..? అసలు కరోనా వల్ల ఎంతమంది చనిపోయారు..? అనే ప్రశ్నలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలను లెక్కించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రయత్నాలు ప్రారంభించగా.. సదరు సంస్థ అనుసరిస్తున్న ప్రమాణాలు తమకు సరిపోవని భారతదేశం చెబుతుండడంతో వివాదం నెలకొంది. భారత్‌ అనుసరిస్తున్న విధానంపై అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాయడంతో.. భారత్‌లో కరోనా మరణాల సంఖ్యపై మరోసారి రాజకీయ రగడ ప్రారంభమైంది.

దేశంలో కరోనా మరణాలు 40 లక్షలకుపైగా ఉంటాయని కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ చెబుతున్నారు. కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా 40 లక్షల మంది మృతి చెందారని ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం అసత్య నివేదికలు ప్రకటిస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన రాహుల్ గాంధీ.. బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. కరోనా సమయంలో దేశంలో సంభవించిన మరణాల సంఖ్య వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయంటూ రాహుల్ అన్నారు. కేంద్రం చెబుతున్నట్టుగా కరోనా కారణంగా దేశంలో 5 లక్షల మంది మృతి చెందలేదని..40 లక్షల మంది మృతి చెందారని రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ మరణాలు సంభవించాయని రాహుల్ ఆరోపించారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించకపోవడంతోనే అనేకమంది మృతి చెందారని ఆయన పేర్కొన్నారు.

“మోడీ నిజాలు చెప్పరు, చెప్పనివ్వరు. ఆక్సిజన్ కొరత వల్ల ఎవరూ చనిపోలేదని కేంద్రం చెబుతుంది. నేను ముందే చెప్పాను..కరోనా సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 5 కాదు 40 లక్షల మంది భారతీయులు మృతి చెందారు. ఆయా మరణాలకు ప్రభుత్వం భాద్యత వహిస్తూ కేంద్రం..ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి” అని రాహుల్ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. ప్రపంచ కోవిడ్ మరణాలపై నివేదిక రూపొందిస్తున్న డబ్ల్యూహెచ్‌ఓ ప్రయత్నాలకు భారత్ సహకరించడం లేదంటూ ఇటీవల న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది

ఈసందర్భంగా ఆ కథనానికి సంబందించిన స్క్రీన్ షాట్‌ను రాహుల్ గాంధీ ట్విట్టర్లో పంచుకున్నారు. భారతదేశంలో కరోనా మరణాలను అంచనా వేయడానికి.. డబ్ల్యూహెచ్‌ఓ అనుసరిస్తున్న పద్దతిపై భారత ప్రభుత్వం సందేహాలు లేవనెత్తింది. ఏ ప్రామాణిక ప్రాతిపదికను అనుసరించి గణనలను చేపడుతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ ను ప్రశ్నించిన భారత ప్రభుత్వం..భౌగోళిక పరిమాణం మరియు అత్యధిక జనాభా ఉన్న ఇంత విస్తారమైన దేశంలో ఆ ప్రామాణికాలు ద్వారా కరోనా మరణాలను అంచనా వేయడానికి వర్తించదని పేర్కొంది. దీనితో రాజకీయంగా వివాదం నెలకొంది.