అరుదైన సర్జరీ.. మనిషిని కాసేపు ‘చంపేసి’.. మళ్లీ బతికించారు

సాధారణంగా చావు పుట్టుకలు మన చేతుల్లో ఉండవు అంటారు. పుట్టడం, గిట్టడం ఏది మనకు తెలిసి జరగదు. అయితే వైద్యులు మాత్రం.. మనిషికి సంభవించే చావును కొన్ని రోజులు, నెలలు, ఏళ్ల పాటు వాయిదా వేయగలరు. అందుకే డాక్టర్లను నారాయణుడితో పోల్చుతారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వైద్యం చేసి.. మరికొంత కాలం వారి జీవితాన్ని పెంచుతారు. ఇక వైద్య రంగంలో ఇప్పటికే ఎన్నో అరుదైన సర్జరీలు నిర్వహించారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సర్జరీ మాత్రం చాలా భిన్నమైంది. ఎందుకంటే.. ఇక్కడ వైద్యులు బతికున్న మహిళను కాసేపు చంపేసి.. ఆ తర్వాత తిరిగి ప్రాణం పోశారు. పైగా ఈ అరుదైన సర్జరీ చేసింది ప్రభుత్వ వైద్యులు కావడం గమనార్హం. ఇంతకు ఈ సర్జరీ ఎక్కడ జరిగింది అంటే..

ఈ అరుదైన సర్జరీ లక్నోలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ కాలేజీలో జరిగింది. ఓ మహిళ ప్రాణాలు కాపాడటం కోసం వైద్యులు అరుదైన ప్రక్రియ చేపట్టారు. ఇంతకు ఏం జరిగింది అంటే.. అయోధ్యకు చెందిన 28 ఏళ్ల మహిళ గుండె సంబంధిత సమస్యతో బాధపడేది. ఆమె గుండె నుంచి మిగతా శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే రక్త నాళాల్లో సమస్య ఉంది. దాంతో ఆమె సమస్యను పరిష్కరించడం కోసం వైద్యులు బాధితురాలికి ‘డీప్ హైపోథెర్మిక్ సర్క్యులేటరీ అరెస్ట్‌’ (డీహెచ్‌సీఏ) ప్రక్రియ నిర్వహించారు. దీని ద్వారా ఆమె బతికుండగానే.. ఆరు నిమిషాలపాటు ‘మరణించేలా’ చేశారు. అనంతరం ఆమెకు విజయవంతంగా సర్జరీ చేయగలిగారు.

చనిపోయేలా చేయడం కోసం డీహెచ్‌సీఏ..

బాధితురాలిని తాత్కలికంగా చనిపోయేలా చేయడం కోసం డాక్టర్లు ఆమెపై డీహెచ్‌సీఏ టెక్నిక్‌ను ఉపయోగించారు. ఈ పద్ధతిలో ఆమె శరీరాన్ని చల్లబర్చారు. తద్వారా ఆమె శరీరంలోని అవయవాలకు రక్త ప్రసరణ నిలిచిపోయేలా చేశారు. ఇలా చేయడం వల్ల మనిషి మరణించే స్థితిలోకి వెళ్తాడు. ఈ టెక్నిక్ ద్వారా నరాల బలహీనత రాకుండా 30 నిమిషాలపాటు పేషెంట్‌ను 18 డిగ్రీల సెల్సియస్ వద్ద అచేతనంగా ఉంచొచ్చు. మస్తిష్క రక్షణలో హైపోథెర్మియా అనేది ప్రధాన పద్ధతి.

ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ప్రక్రియను చేపట్టడం ఇదే తొలిసారని లక్నో డాక్టర్లు తెలిపారు. బాధిత మహిళ బృహద్దమనిలో తీవ్రమైన సమస్య ఉందని.. దీని వల్ల రక్తనాళం గోడ ఉబ్బిపోయింది.. దీన్ని అవోర్టిక్ సూడోఅనేరిజం అంటారని డాక్టర్లు చెప్పారు. డీహెచ్‌‌సీఏ చేపట్టిన డాక్టర్లు.. ఆ తర్వాత నాలుగు గంటలపాటు ఆమె కోలుకుంటున్న తీరును జాగ్రత్తగా గమనించారు. అనంతరం వెంటిలేటర్ తీసేసిన వైద్యులు.. ఓ వారం తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని తెలిపారు వైద్యులు.

Show comments