iDreamPost
android-app
ios-app

ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. మంత్రివైయుండి ఇవేం మాటలు

  • Published Mar 05, 2024 | 8:09 AM Updated Updated Mar 05, 2024 | 8:09 AM

గతంలో సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు స్టాలిన్ పై ఫైర్ అయ్యింది.

గతంలో సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు స్టాలిన్ పై ఫైర్ అయ్యింది.

ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. మంత్రివైయుండి ఇవేం మాటలు

ఈ మధ్య కాలంలో సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ మధ్య అయోధ్య రామ మందిరం బాల రాముడి ప్రతిష్ట రోజున కూడా ట్విట్టర్ లో పెద్ద ఎత్తున బ్లాక్ డే అంటూ ట్రెండ్ చేశారు. ముఖ్యంగా తమిళనాడు వాసులు అయితే జై రావణ అంటూ హ్యాష్ ట్యాగ్ తో హోరెత్తించారు. కానీ ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ ఎంతోసేపు నిలవలేదనుకోండి అది వేరే విషయం. దేశంలో తమిళనాడులోనే ఎక్కువ హిందూ దేవాలయాలు ఉన్నాయి. అలాంటి రాష్ట్రంలో హిందూ వ్యతిరేకత మాత్రం దారుణంగా ఉంటుంది. దీనికి కారణం ద్రవిడ సిద్ధాంతాలే అని మనకి తెలిసిందే. అలాంటి ద్రవిడ సిద్ధాంతాలతో ఏర్పాటైన పార్టీ డీఎంకే పార్టీ.

డీఎంకే పార్టీ నాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ గురించి అందరికీ తెలిసిందే. తమిళనాడు మంత్రిగా, సినీ నటుడిగా గుర్తింపు ఉంది. సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడు. అంతేకాదు హిందూ వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తిగా కూడా ఒక ముద్ర వేసుకున్నాడు. ఆ మధ్య ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలని.. ఈ దేశంలోనే లేకుండా చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సనాతన ధర్మం చికెన్ గున్యా, డెంగ్యూ లాంటిదని స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో హిందూ పెద్దలు, హిందూ సంఘాల ఆగ్రహానికి గురయ్యాడు స్టాలిన్.

అతని మీద పలువురు కేసులు కూడా పెట్టారు. ఒకరిద్దరు స్వాములు స్టాలిన్ తలకు రేటు కూడా కట్టారు. స్టాలిన్ తల నరికి తెచ్చిన వారికి 10 కోట్లు ఇస్తామంటూ సోషల్ మీడియా వేదికగా వీడియోలు పోస్ట్ చేశారు. వీరిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అతనిపై వివిధ రాష్ట్రాల్లో పలువురు కేసులు పెట్టారు. పలు ఎఫ్ఐఆర్ లు కూడా నమోదయ్యాయి. దీంతో స్టాలిన్ కూడా తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ల నుంచి రక్షణ కోరుతూ పిటిషన్ వేశాడు. తాజాగా ఇరువురి పిటిషన్స్ వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. స్టాలిన్ వ్యాఖ్యలపై నమోదైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనపై సీరియస్ అయ్యింది.

సనాతన ధర్మంపై మంత్రి హోదాలో ఉండి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక రాష్ట్రానికి మంత్రి అయి ఉండి ఇవేం వ్యాఖ్యలు అంటూ ఫైర్ అయ్యింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న స్టాలిన్ చేసే వ్యాఖ్యలు ఎంత మేర ప్రభావం చూపిస్తాయో తెలియదనా అంటూ ఆయన తరపు పిటిషనర్ ను ప్రశ్నించింది. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ కింద ఉన్న హక్కులను స్టాలిన్ దుర్వినియోగం చేశారని సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్ అయ్యింది. అయితే ఇంత జరుగుతున్నా కూడా స్టాలిన్ తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నాడు. ఇప్పటికీ తాను ఇదే స్టాండ్ మీద ఉన్నానని అంటున్నాడు.

పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ద్రౌపది ముర్మును ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఆమె గిరిజన మహిళ కావడం, వితంతు మహిళ కావడం వల్లే పార్లమెంట్ ఆహ్వానానికి ప్రధాని మోదీ ఆహ్వానించలేదని.. ఇది వివక్ష కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి వివక్షను ప్రోత్సహించే సనాతన ధర్మాన్ని ఎందుకు గౌరవించాలని స్టాలిన్ ప్రశ్నించాడు. మరి మంత్రి స్థానంలో ఉండి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.