మహిళల విషయంలో ఇకపై ఆ పదాలు వాడొద్దు: సుప్రీంకోర్టు

  • Author singhj Published - 09:03 AM, Thu - 17 August 23
  • Author singhj Published - 09:03 AM, Thu - 17 August 23
మహిళల విషయంలో ఇకపై ఆ పదాలు వాడొద్దు: సుప్రీంకోర్టు

కోర్టుల్లో చేసే విచారణలు, వాదనలు, తీర్పుల్లో లింగ వివక్షతకు ఎలాంటి తావు లేకుండా పదాలను ఉపయోగించడంపై సుప్రీంకోర్టు ఒక హ్యాండ్​బుక్​ను విడుదల చేసింది. స్త్రీలను మూసధోరణిలో కించపరిచే, చులకన భావనతో చూసే పదాల స్థానంలో వినియోగించాల్సిన ప్రత్యామ్నాయ పదాలతో దీనిని తయారు చేసింది. మగవారితో సమానంగా ఆడవాళ్లను గౌరవించాలని సుప్రీం స్పష్టం చేసింది. వివక్షాపూరిత పదాలను లా డిక్షనరీ నుంచి తొలగించడం కూడా ఈ పుస్తక లక్ష్యాల్లో ఒకటి. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఈ హ్యాండ్​బుక్​ను రిలీజ్ చేసింది.

న్యాయసంవాదాలతో పాటు ఉత్తర్వులు, లిఖితపూర్వక వాదనల టైమ్​లో జడ్జీలు, న్యాయవాదులకు ఈ హ్యాండ్​బుక్ సాయపడుతుందని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. లైంగిక హింసకు గురైన బాధితులను న్యాయపరిభాషలో వివరించే సమయంలో మూసధోరణిని వీడేందుకు 30 పేజీల ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయాలు, ఆసక్తులు, ఆహారపు అలవాట్లు, వేషధారణ ఆధారంగా స్త్రీల మీద దురభిప్రాయాలను ఏర్పర్చుకోవడం గానీ.. ఆ కారణం వల్ల వారిపై దురుసుగా ప్రవర్తించడం గానీ ఏమాత్రం సమర్థనీయం కాదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు.

పురుషులు అధికులు, స్త్రీలు అల్పులనే సాధారణీకరణ భావజాలం నుంచి జడ్జీలు, న్యాయవాదులూ బయటపడాల్సిన అవసరాన్ని కొత్త హ్యాండ్​బుక్​లో నొక్కి చెప్పారు. కోర్టులు గతంలో ఇచ్చిన తీర్పుల్లో మహిళల్ని ప్రస్తావిస్తూ చేసిన అనేక అనుచిత పదాలను ఇందులో పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసిన ‘హ్యాండ్​బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్’ సుప్రీంకోర్టు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఇక.. వేశ్య, వ్యభిచారిణి అనే అర్థంలో ఇంగ్లీషులో వాడుతున్న ప్రా*స్టిట్యూట్, వో*ర్, హు*కర్ లాంటి పదాలను సుప్రీం నిషేధించింది. వీటికి బదులుగా సె*క్స్​వర్కర్ అనే పదాన్ని సూచించింది.

ఇప్పటిదాకా ఉంపుడుగత్తె అనే అర్థంలో వాడే ఇంగ్లీషు పదాలను కీ*ప్, కాంక్యు*బైన్ అనడానికి బదులుగా వివాహేతర సంబంధాలున్న స్త్రీ (విమెన్ విత్ సె*క్సువల్ రిలేషన్స్ అవుట్​సైడ్ ఆఫ్ మ్యారేజ్)గా పేర్కొనాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఉంపుడుగత్తె సంతానమని చెప్పేందుకు వాడుతున్న బా*స్టర్డ్ అనే పదానికి బదులుగా అవివాహ దంపతుల సంతాన (నాన్ మ్యారిటల్ చైల్డ్)మని తెలపాలి. హౌస్​వైఫ్​ను హోమ్​మేకర్ అని పిలవాలి. మిస్ట్రెస్​ను విమెన్ అని సంబోధించాల్సి ఉంటుంది. కెరీర్​ విమెన్​ను.. విమెన్ (మహిళ) అని పిలిస్తే సరిపోతుంది. ఈవ్​టీజింగ్​ను ఇక మీదట స్ట్రీట్ సె*క్సువల్ హరాజ్​మెంట్​గా పేర్కొనాల్సి ఉంటుంది. స్పి*న్​స్టర్ (కన్య) అనడం కంటే అవివాహిత స్త్రీ (అన్​మ్యారీడ్ విమెన్) అనడం సముచితం అని సుప్రీంకోర్టు హ్యాండ్​బుక్ పేర్కొంది.

Show comments