iDreamPost
android-app
ios-app

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్​కు సుప్రీం నోటీసులు!

  • Author singhj Published - 03:10 PM, Fri - 22 September 23
  • Author singhj Published - 03:10 PM, Fri - 22 September 23
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్​కు సుప్రీం నోటీసులు!

సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు మంత్రి, ప్రముఖ నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ, కరోనా వంటి వ్యాధులతో పోల్చిన స్టాలిన్.. ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదని, పూర్తిగా నిర్మూలించాల్సిందేనని పేర్కొన్నారు. దీంతో ఆయన కామెంట్స్​పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అయినా ఉదయనిధి స్టాలిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆయన విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. రీసెంట్​గా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా దేశంలోని ప్రముఖ హీరోయిన్లను లోక్​సభకు ఆహ్వానించారని ఆయన గుర్తుచేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా హీరోయిన్లను పార్లమెంటుకు పిలిచారని.. కానీ ఒక మహిళ అయిన రాష్ట్రపతిని మాత్రం పిలవలేదని విరుచుకుపడ్డారు ఉదయనిధి స్టాలిన్. వితంతువు, ఆదివాసీ మహిళ కాబట్టే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గానీ.. మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా ఆహ్వానించడం గానీ చేయలేదని ఆరోపించారు. ఆదివాసీ కావడం, భర్త చనిపోయి వితంతువుగా ఉండటమే ఆమెను ఆహ్వానించకపోవడం వెనుక ఉన్న కారణమని స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాంటి నమ్మకాలనే సనాతన ధర్మం అంటున్నామని తెలిపారు.

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దుమారం ఇంకా ముగియలేదు. ఈ వ్యవహారం కాస్తా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు చేరింది. స్టాలిన్​ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలైంది. ఉదయనిధి​పై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ 262 మంది ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. లెటర్ రాసిన వారిలో మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు ఉన్నారు. ఎట్టకేలకు ఈ పిటిషన్​ను విచారణకు స్వీకరించిన కోర్టు.. తమిళనాడు సర్కారుతో పాటు ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది. కాగా, ఉదయనిధి మీద పలు రాష్ట్రాల్లో పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి.

ఇదీ చదవండి: బాబు క్వాష్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టేయడానికి కారణం?