iDreamPost
android-app
ios-app

దేశం పేరు మార్చడంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

  • Author singhj Published - 06:41 PM, Mon - 11 September 23
  • Author singhj Published - 06:41 PM, Mon - 11 September 23
దేశం పేరు మార్చడంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశంగా మారిన అంశం ‘ఇండియా’ పేరు మార్పు. దేశం పేరును మారుస్తున్నారంటూ స్థానిక మీడియాతో పాటు నేషనల్ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా దీనిపై చర్చోపచర్చలు జరిగాయి. దీనికి ప్రతిష్టాత్మక జీ20 సదస్సులో పాల్గొనే వ్యక్తులకు భారత రాష్ట్రపతి నుంచి విందు ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లేసులో ప్రెసిడెంట్ భారత్ అని రాసి ఉండటమే కారణం. దీంతో భారత్, ఇండియా పేర్లపై చర్చ నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాహుల్.. అక్కడి ఓ యూనివర్సిటీలోని కార్యక్రమానికి గెస్ట్​గా హాజరయ్యారు.

ఫ్రాన్స్​లోని ఓ యూనివర్సిటీలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఓపిగ్గా బదులిచ్చారు. అక్కడి కొందరు స్టూడెంట్స్ ఇండియా పేరును భారత్​గా మార్చడంపై మీ స్పందన ఏంటని రాహుల్​ను అడిగారు. దీనికి కాంగ్రెస్ నేత సానుకూలంగా స్పందించారు. ఆ రెండు పేర్లలో ఏదైనా తనకు ఆమోదయోగ్యమేనని అన్నారు. ఇండియాగా పిలిచే భారత్​ రాష్ట్రాల సమూహమని రాహుల్ చెప్పారు. కాబట్టి ఇండియా, భారత్.. ఈ రెండు పేర్లలో ఏది పెట్టినా తనకు అంగీకారమేనని తెలిపారు.

దేశానికి ఏ పేరు ఉన్నా తనకు ఓకేనన్న రాహుల్ గాంధీ.. ఈ సందర్భంగా బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం బహుశా వారికి విసుగు తెప్పించి ఉండొచ్చన్నారు. అందుకే వాళ్లు ఇండియా పేరునే మార్చేందుకు సిద్ధమయ్యారని రాహుల్ చెప్పుకొచ్చారు. తమ కూటమికి వేరే పేరు పెట్టేవాళ్లమని.. కానీ దాని వల్ల ప్రయోజనమేమీ ఉండదన్నారు. కానీ అదేంటో మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారని రాహుల్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: చంద్రబాబు లాయర్లపై న్యాయమూర్తి సీరియస్!