Venkateswarlu
Venkateswarlu
నేడు దేశ వ్యాప్తంగా మెట్రో రైలు సర్వీసులు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జనం రైళ్లు, బస్సులను పక్కన పెట్టి ప్రయాణం కోసం మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్ జామ్ బాధలు లేకుండా తక్కువ సయమంలో గమ్యస్థానాన్ని చేరుకునే అవకాశం ఉండటంతో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. మెట్రో రైళ్లు వింతలకు విశేషాలకు నెలవుగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా, నాగ్‌పూర్ మెట్రో ఓ అరుదైన కార్యక్రమానికి వేదికగా మారింది. ‘ది ఎరిటేజ్ కల్చర్ ఇండియా’ నాగ్‌పూర్ మెట్రోలో ఫ్యాషన్ షోను నిర్వహించింది. ఈవెంట్ కోసం ఏకంగా కొన్ని గంటల పాటు ఆ రైలు మొత్తాన్ని బుక్ చేసింది. భారతీయ సంప్రదాయ వస్త్రాలతో పాటు మోడ్రన్ డ్రస్సుల్లో యువతులు ఎంతో అందంగా మెట్రో రైల్లో నడిచి సందడి చేశారు. రైల్లోని ప్రయాణికులు వారిని చూస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఆ ఫ్యాషన్ షో వీడియోలు, ఫొటోలను తమ ఫోన్లలో బంధించారు.
ఇక, ఇందుకు సంబంధించిన వీడియోను నాగ్‌పూర్ ఎక్స్‌ఫ్యాక్టర్ తమ అఫిషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియో స్పందిస్తున్న నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ ఢిల్లీ వైరస్ మొత్తానికి నాగ్‌పూర్‌కు కూడా సోకింది’’.. ‘‘యథారాజా తథా ప్రజ’’.. ‘‘ ఎందుకు నా నగరం ఎప్పుడూ ఇలాంటి వార్తలతో న్యూస్‌లో నిలుస్తూ ఉంటుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, నాగ్‌పూర్ మెట్రో రైల్లో ఫ్యాషన్ షో నిర్వహించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.