iDreamPost

కాలినడకన తిరుమల వెళ్లే భక్తులకు గమనిక.. ఆ నిబంధనలు కొనసాగింపు!

కాలినడకన తిరుమల వెళ్లే భక్తులకు గమనిక.. ఆ నిబంధనలు కొనసాగింపు!

కాలినడకన తిరుమల కొండకు చేరుకునే వారికి క్రూర మృగాల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసింది. ముఖ్యంగా చిరుతలు భక్తులపై దాడులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత కోసం టీటీడీ కొత్త ఏర్పాట్లు చేసింది. పాత నిబంధనలను కొనసాగిస్తూనే వాటిపై దృష్టి సారించనుంది. నడక మార్గంలో అలిపిరికి వెళ్లే భక్తుల కోసం 45 వేల రూపాలతో కర్రలు ఆర్డర్‌ ఇచ్చామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ కర్రల ద్వారా భక్తులు క్రూర మృగాలనుంచి రక్షణ పొందవచ్చని అన్నారు.

భక్తులకు అలిపిరి వద్ద కర్రలు ఇవ్వనున్నామని తెలిపారు. ఆ తర్వాత వాటిని నరసింహస్వామి ఆలయం వద్ద తిరిగి తీసుకుంటామన్నారు. రెండు నడక మార్గాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 ఏళ్ల లోపు పిల్లలను అనుమతిస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు. పెద్దలను కూడా రాత్రి 10 గంటల వరకే అనుమతిస్తామన్నారు. బైకుల రాకపోకలపై కూడా నిబంధనలు ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బైకులను అనుమతించనున్నారు.

అయితే, ఇప్పుడున్న నిబంధనలు భక్తుల విజ్ఞప్తి మేరకు అటవీ శాఖ అనుమతితో సడలించనున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. ఇక, శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్నదాన విభాగాన్ని ఆధునికీకరిస్తున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి నెయ్యి, పాలను ఎస్వీ గోశాల డైయిరీ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి చేసి వాడతామన్నారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద క్రేందంలో అన్న ప్రసాద తయారీని మరింత పటిష్టం చేస్తామన్నారు. కాలినడకన తిరుమల వెళ్లే భక్తుల భద్రత కోసం టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి