Dharani
Dharani
ఇప్పుడంటే హాస్టల్స్ రూపు రేఖలు మారాయి కానీ.. ఓ పదేళ్ల క్రితం వరకు హాస్టల్స్ అంటే అరకొర వసుతులు, సౌకర్యాల కొరతతో.. నరకానికి నకళ్లుగా ఉండేవి. నేటికి కూడా కొన్ని కార్పొరేట్ కాలేజీలకు చెందిన హాస్టల్స్‌ను చూస్తే.. జైల్లో ఖైదీలకు కూడా ఇంత కంటే మంచి వసతులు కల్పిస్తారేమో అనిపించకమానదు. కొన్ని యూనివర్శటీ హాస్టల్స్ కూడా అలానే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ.. విద్యార్థులకు శుభవార్త చెప్పారు. కోట్ల రూపాయల ఖర్చుతో.. అంతర్జాతీయ వసతులతో.. అత్యధునిక హంగులతో విద్యార్థుల కోసం సరికొత్త హస్టల్‌ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు..
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వారణాసిలో పర్యటించారు. వాజిద్‌పూర్‌లోని బహిరంగ సభా స్థలికి చేరుకున్న తర్వాత అక్కడికి హాజరైన జనాలను ఉద్దేశించి.. ప్రసంగించారు మోదీ. వారణాసి పర్యటనలో సందర్భంగా మోదీ ఆధ్యాత్మిక నగరంపై వరాల జల్లు కురిపించారు. వారణాసి అభివృద్ధి కోసం సుమారు 12,100 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తంలో కొంత భాగం నిధులను.. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలను కలిగి ఉన్న అంతర్జాతీయ హాస్టల్ నిర్మాణానికి కేటాయించనున్నారు.
ఇక ఉత్తరప్రదేశ్‌లో ఈ తరహా హాస్టల్ ఇదే మొదటిది అంటున్నారు. దీనిలో దేశీయ, విదేశీ విద్యార్థులకు వసతి కల్పించనున్నారు. విద్యార్థులు లగ్జరీ సౌకర్యాలు పొందే విధంగా హస్టల్‌ను నిర్మించనున్నారు. రూ.50 కోట్లతో నిర్మించనున్న ఈ అంతర్జాతీయ హాస్టల్‌లో మినీ సూపర్ మార్కెట్, జిమ్, కేఫ్, కామన్ రూం, ఇండోర్ గేమ్స్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. అంతేకాక హస్టల్‌లో ఇంటిని తలపించే విధంగా వసతులు కల్పించనున్నారు. ఈ హస్టల్ నిర్మాణం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంతర్జాతీయ హాస్టల్‌లో G+10 అంతస్తు భవనంలో 200 గదులు ఉన్నాయని బీహెచ్‌యూ ఇంటర్నేషనల్ హాస్టల్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ఘెస్‌వీఎస్ రాజు తెలిపారు. ప్రతి గదికి అటాచ్డ్ బాత్‌రూమ్‌తో కూడిన కిచెన్ ఉంటుందని.. అంతే కాక కిచెన్‌లో ఇండక్షన్ స్టవ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. హస్టల్‌కు చెందిన ప్రతి గదిలో కూడా అంతర్జాతీయ హంగులతో కూడిన వసతులు ఏర్పాటు చేయనున్నారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులు తమకు నచ్చిన ఆహారాన్ని వండుకోవచ్చని తెలిపారు. అంతే కాకుండా విద్యార్థుల కోసం హాస్టల్‌లో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయనున్నారు.