iDreamPost
android-app
ios-app

మత సామరస్యానికి ఆ ఊరు కేరాఫ్‌ అడ్రస్‌.. హిందూ, ముస్లిం భాయీ, భాయీ..

మత సామరస్యానికి ఆ ఊరు కేరాఫ్‌ అడ్రస్‌.. హిందూ, ముస్లిం భాయీ, భాయీ..

ఆ ఊరు చాలా ప్రత్యేకమైనది. ఆ ఊర్లో హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు. ఎంతలా అంటే.. ఒకరి పండగలకు మరొకరు సాయం చేసుకుంటారు. విందులు ఇచ్చుకుంటారు. ఇంతేనా.. ఈ ఊర్లో గుడికి, మసీదుకు ఒకటే ద్వారం ఉంది. హిందువులు గుడికి వెళ్లాలన్నా.. ముస్లింలు మసీదుకు వెళ్లాలన్నా ఆ ద్వారంలోంచే వెళ్లాలి. ఆ ఊరు ఏది? ఎక్కడుంది అనుకుంటున్నారా? మతసామరస్యంలో దేశానికే స్పూర్తిగా నిలుస్తున్న ఆ ఊరు పేరు ఈరూర్‌. ఈ ఊరు కేరళలోని కొల్లామ్‌ జిల్లాలో ఉంది.

ఈ ఊర్లో తాజాగా నబి దినమ్‌ను సందర్భంగా ముస్లింలు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి శివపురం శ్రీ మహదేవర్‌ గుడి సిబ్బంది స్వీట్లు పంచి పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, మలప్పురం లోనూ ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. నబి దినమ్‌ రోజున ర్యాలీలో పాల్గొన్న ఓ పిల్లాడి మెడలో షీనా అనే మహిళ కరెన్సీ నోట్ల దండ వేసింది. అనంతరం అతడి బుగ్గలపై ముద్దు పెట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ మతాల కోసం కొట్టుకునే ఈ రోజుల్లో కేరళలో ఇలాంటి సంఘటనలు చూడ్డం చాలా సంతోషంగా ఉంది’’.. ‘‘ అందరూ అన్ని మతాలను గౌరవించుకుంటే ఎలాంటి గొడవలు జరగవు’’.. ‘‘మనుషులు మతం కోసం కొట్టుకోకుండా ఉండాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.