సాధారణంగా మొబైల్ ఫోన్లలో లైవ్ టీవీ చూడాలంటే ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ ఫోన్లలో అదేపనిగా టీవీ ఛానళ్లు చూస్తూ కూర్చుంటే దెబ్బకు మొబైల్ డేటా త్వరగా అయిపోతుంది. మన దేశంలో ఒక వ్యక్తి సగటున రోజుకు 1.5 జీబీ డేటా వాడేస్తున్నాడని నిపుణులు చెబుతున్నారు. ఆ లెక్కన లైవ్ టీవీకే మొత్తం డేటా అయిపోతుంది. అప్పుడు సోషల్ మీడియాతో పాటు క్రికెట్ మ్యాచ్‌లు, ఇతరత్రా వినియోగానికి మిగిలిన డేటా అస్సలు సరిపోదు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచన చేస్తోంది. మామూలుగా టీవీ ఛానళ్ల కోసం ఎవరైనా కేబుల్ టీవీ ఆపరేటర్ లేదా డైరెక్ట్ టు హోం కనెక్షన్లను ఏర్పాటు చేయించుకుంటారు.
కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ పోతోంది. ఇప్పుడు ఓటీటీ యాప్స్‌లో కూడా లైవ్ టీవీ వచ్చేస్తోంది. ఇందుకోసం ఇంట్లో వైఫై ఉంటే సరిపోతుంది. అయితే వైఫై కనెక్షన్ లేనివారు మొబైల్ డేటా వాడితే ఇక అంతే సంగతులు. అందుకే వీటికి పరిష్కారం చూపిస్తూ నేరుగా ఫోన్లలో టీవీ చూసేలా కేంద్రం ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. లైవ్ ఛానెల్స్‌ను నేరుగా ఫోన్లలోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర సర్కారు పలు మార్గాల్ని అన్వేషిస్తోంది. డైరెక్ట్ టు హోం సర్వీస్ (డీటీహెచ్) తరహాలో డైరెక్ట్ టు మొబైల్ (డీ2ఎం) సేవలు అందించేందుకు అడుగులు వేస్తోంది.
డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీతో ఫోన్లో డేటా కనెక్షన్ అవసరం లేకుండానే వినియోగదారులు టీవీ చానెల్స్‌ను చూడొచ్చు. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఈ సేవల్ని అందించడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేసేందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖతో పాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలు, ఐఐటీ కాన్పూర్ ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇది సాధ్యమయ్యే ఛాన్స్ ఉన్నా.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ టెక్నాలజీతో ఆదాయ వనరుగా ఉన్న డేటా ప్లాన్ల ద్వారా తమ ఇన్కమ్ తగ్గిపోతుందని.. నష్టం జరుగుతుందనే భయాన్ని టెలికం ఆపరేటర్లు, డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ ఆపరేటర్లు వ్యక్తం చేస్తారని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.