Kalvakuntla Kavitha: కవితకు బెయిల్‌ ఇప్పించిన లాయర్‌ ముకుల్‌ రోహత్గీ ఎవరు? దేశంలో టాప్ లాయర్ స్టోరీ

Kavitha Bail-Mukul Rohatgi Fee Details: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు బెయిల్‌ మంజూరు అయ్యింది. ఈ క్రమంలో ఆమె తరఫున వాదనలు వినిపించిన లాయర్‌ ముకుల్‌ రోహత్గీకి సంబంధించిన ఆసక్తికర అంశాలు మీ కోసం.

Kavitha Bail-Mukul Rohatgi Fee Details: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు బెయిల్‌ మంజూరు అయ్యింది. ఈ క్రమంలో ఆమె తరఫున వాదనలు వినిపించిన లాయర్‌ ముకుల్‌ రోహత్గీకి సంబంధించిన ఆసక్తికర అంశాలు మీ కోసం.

దేశ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఐదున్నర నెలల పాటు తీహార్‌ జైలులో ఉన్న కవితకు.. తాజాగా మంగళవారం నాడు అనగా.. ఆగస్టు 27న సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆమె బెయిల్‌ పిటిషన్‌పై సుమారు గంటన్నర పాటు సుదీర్ఘంగా విచారించారు. ఇరు వర్గాల తమ తమ వాదనలు వినిపించారు. చివరకు ఎట్టకేలకు ఐదున్నర నెలల తర్వాత ఈ కేసులో కవితకు బెయిల్‌ వచ్చింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కవితకు బెయిల్‌ వచ్చిన నేపథ్యంలో.. ఆమె తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన లాయర్‌ ముకుల్‌ రోహత్గీపై అందరి దృష్టి పడింది. ఇంతకు ఆయన ఎవరు.. బ్యాగ్రౌండ్‌ ఏంటి.. ఎంత ఫీజు వసూలు చేస్తారనే విషయాలపై జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ వివరాలు..

ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితకు బెయిల్‌ ఇప్పించడంలో.. ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి.. ఆమె తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ. ఆయన కృషి వల్లే ఢిల్లీ లిక్కర్‌ కేసులో సుప్రీంకోర్టు.. కవితకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కవిత బెయిల్ మంజూరుకు సంబంధించి మంగళవారం గంటన్నరకు పైగా ఇరుపక్షాల మధ్య వాదనలు జరిగాయి.. కేంద్ర దర్యాప్తు సంస్థల తరఫున లాయర్ ఎస్వీ రాజు, కవిత తరఫున ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. కవిత బెయిల్ పొందేందుకు అర్హురాలని ముకుల్ రోహత్గీ వినిపించిన వాదనలతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. చివరికి కవితకు బెయిల్ మంజూరు చేసింది.

ఈ ఏడాది మార్చి 15న లిక్కర్ కుంభకోణంలో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె అనేకసార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అయితే ఈసారి మాత్రం కవిత తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించి ఆమెకు బెయిల్‌ వచ్చేలా చేశారు. దాంతో ఇప్పుడందరి దృష్టి ఆయన మీదే ఉంది. ఎవరీ ముకుల్‌ రోహత్గీ.. ఆయన ప్రస్థానం ఏంటి.. కేసు వాదించడం కోసం ఎంత ఫీజు వసూలు చేస్తారనే విషయాల గురించి తెలుసుకునేందుకు గూగుల్‌లో సర్చ్‌ చేస్తున్నారు.

ఎవరీ ముకుల్‌ రోహత్గీ..

దేశంలోనే అగ్రశ్రేణి న్యాయవాదుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు ముకుల్‌ రోహత్గీ. వివిధ క్లిష్టమైన కేసులను కూడా ఒంటి చేత్తో గెలిచిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఆయన గంటకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తారని సమాచారం. ఇక ముకుల్‌ రోహత్గీ విషయానికి వస్తే.. ఆయన 1955, ఆగస్టు 17న ముంబైలో జన్మించాడు. గతంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఈయన తండ్రి పేరు జస్టిస్ అవధ్ బిహారీ రోహత్గీ. ఈయన కూడా న్యాయవాదే.

ప్రస్తుతం ఇండియాలో అగ్రశ్రేణి న్యాయవాదులలో ఒకరైన రోహత్గీ ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టులో యోగేష్ కుమార్ సబర్వాల్ వద్ద ప్రాక్టిస్ ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా ఎదిగి.. ఇప్పుడు దేశంలో హైప్రొఫైల్‌ కేసులకు ఆయనే కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలిచారు.

వ‍్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన వసుధ రోహత్గీ అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఈమె కూడా లాయరే. వీరికి నిఖిల్ రోహత్గి, సమీర్ రోహత్గీ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భారత ప్రభుత్వం ముకుల్ రోహత్గీ 1999 నవంబర్ లో ఐదేళ్లపాటు భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమించింది.

గంటకు 10-15 లక్షల ఫీజు…

తర్వాత 19 జూన్ 2014 నుండి 18 జూన్ 2017 వరకు ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఇండియన్‌ అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. తన పదవీకాలంలో ట్రిపుల్ తలాక్, మణిపూర్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు, జాతీయ న్యాయ నియామకాల కమిషన్, ఆధార్ కేసు వంటి ఎన్నో విజయవంతమైన కేసులను ముకుల్‌ వాదించారు. అటల్ బిహారీ బాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో లా ఆఫీసర్‌గా కూడా పనిచేసిన రోహత్గీ 2002 అల్లర్లు, బూటకపు ఎన్‌కౌంటర్ కేసులలో గుజరాత్ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.

ఆయన ఎక్కువగా హై ప్రోఫైల్ కేసులే వాదిస్తారన్న పేరుంది. ఒక్క కేసు కోసం గంటకు రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఫీజు వసూలు చేస్తారని తెలుస్తోంది. అంటే కేసు పూర్తయ్యేలోగా… కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అలానే ఏదైనా కేసు నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్తే.. ఆయనకు, ఆయనతో పాటు వచ్చే టీమ్‌కు స్టార్‌ హోటల్లో బస కల్పించాలి. వారికి రానుపోను విమాన ఛార్జీలు చెల్లించాలి. పైగా వేరే ప్రాంతానికి వస్తే.. ఫీజు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అన్ని కలుపుకుంటే ఒక కేసు అయిపోయేసరికి ముకుల్‌ రోహత్గీకి కోట్ల రూపాయలు సమర్పించుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఆయన కేసు టేకప్‌ చేస్తే విజయం పక్కా అంటారు. అందుకే చాలా మంది ఖర్చు గురించి ఆలోచించకుండా ఆయనను సెలక్ట్‌ చేసుకుంటారు.

Show comments