Dharani
కేజీఎఫ్.. సినిమా మాత్రమే కాదు.. ఒకప్పుడు బంగారాన్ని తవ్వి వెలికి తీసిన ప్రాంతం కూడా. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కేజీఎఫ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
కేజీఎఫ్.. సినిమా మాత్రమే కాదు.. ఒకప్పుడు బంగారాన్ని తవ్వి వెలికి తీసిన ప్రాంతం కూడా. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కేజీఎఫ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
Dharani
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటే జనాలు గుర్తు పట్టడం చాలా కష్టం. అదే కేజీఎఫ్ అనండి వెంటనే గుర్తు పడతారు.. సలాం రాఖీ భాయ్ అంటూ చిన్నారులు సైతం పాటలు పాడి మరి గుర్తు తెచ్చుకుంటారు. ఈ సినిమా విడుదలయ్యే వరకు కూడా మన దేశంలో ఇలాంటి బంగారు గని ఉందని చాలా మందికి తెలియదు. మూవీ వచ్చాక కూడా చాలా మంది కేజీఎఫ్ అనేది నిజంగా ఉందనే వాస్తవాన్ని నమ్మలేదు. ఇది ఊహాజనిత ప్రాంతం అనుకున్నారు. కానీ కాదు. కేజీఎఫ్ అదే కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ నిజంగా మన దేశంలోనే ఉన్న ప్రాంతం. ఒకప్పుడు ఇక్కడ తవ్వకాలు చేపట్టి బంగారాన్ని వెలికి తీసేవారు. ఆ తర్వాత కాలంలో దాన్ని మూసేశారు. ఈ గోల్డ్ ఫీల్డ్స్‌ను బేస్ చేసుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ పేరుతో పార్ట్ 1, 2లుగా రెండు సినిమాలు తీస్తే.. అవి ఆయన పాలిట నిజంగానే బంగారంలా మారాయి. కోట్ల రూపాయలు వసూలు చేసి.. కాసుల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో కేజీఎఫ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
పదుల సంవత్సరాలుగా మూతపడిన కోలారు బంగారు గనులను తిరిగి మళ్లీ ప్రారంభించాలని కర్ణాటక సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు గురువారం నిర్వహించిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. కేజీఎఫ్‌లో మళ్లీ తవ్వకాలను ప్రారంభించాలని కేంద్రం చేసిన ప్రతిపాదనలకు.. సిద్ధ రామయ్య సర్కారు తాజాగా ఆమోదం తెలిపింది. కోలార్ జిల్లాలోని భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్(బీజీఎంఎల్)కు అనుబంధంగా ఉన్న 13 టెయిలింగ్ డంప్‌లలో కార్యకలాపాల కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సిద్ధరామయ్య సర్కార్ ఆమోదం తెలిపింది. అదే సమయంలో బీజీఎంఎల్‌కు చెందిన 2,330 ఎకరాలను ప్రతిపాదిత పారిశ్రామిక టౌన్‌షిప్‌కు బదిలీ చేయాలని కోరింది.
ఇక కేబినెట్ భేటీ అనంతరం కర్ణాటక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్ తిరిగి ప్రారంభించేందుకు.. ఎంఎండీఆర్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతి అవసరం కాబట్టి దీనికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ‘‘కేజీఎఫ్‌లోని భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (బీజీఎంఎల్) మైనింగ్ ఏరియాలో 1,003.4 ఎకరాల విస్తీర్ణంలో 13 టైలింగ్ డంప్స్ ఏరియాలో గనుల, ఖనిజాల నియంత్రణ అభివృద్ధి (ఎంఎంఆర్డీ) చట్టం సెక్షన్ 17 కింద కింద గనుల తవ్వకాలు కొనసాగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు మా మంత్రివర్గం ఆమోదం తెలిపింది’’ అని చెప్పుకొచ్చారు.
కేజీఎఫ్ గనులను మళ్లీ తెరిస్తే.. ప్రభుత్వానికి ఆదాయంతో పాటు.. స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని మంత్రి పాటిల్ చెప్పుకొచ్చారు. బీజీఎంఎల్‌కు చెందిన 2,330 ఎకరాల భూమిని ప్రతిపాదిత టౌన్‌షిప్ కోసం బదిలీ చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పుకొచ్చారు. అయితే, 2022-23 వరకు బీజీఎంఎల్.. కర్ణాటకకు రూ. 75,24,88,025 బకాయిలను చెల్లించాల్సి ఉందని.. ఇప్పుడు వీటిని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని పాటిల్ చెప్పుకొచ్చారు.
ఇక ప్రపంచంలోనే బంగారు ఖనిజాలు పుష్కలంగా ఉన్న గనుల్లో కేజీఎఫ్ ఒకటి. అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ తవ్వకాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కేజీఎఫ్‌ను మళ్లీ తెరిచి.. తవ్వకాలు చేపడితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఎత్తున ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మైనింగ్ పునరుద్ధరించేందుకు సిద్ధు సర్కారు నిర్ణయించింది. కోలారు, బంగారుపేటె, బంగారదిన్ని పరిసరాల్లో కనీసం 5,213 హెక్టార్ల గనుల్లో తవ్వకాలు చేపట్టనున్నారు. ఈ సారి కూడా ఈ బాధ్యతను బీజీఎంఎల్‌కే అప్పగించనున్నారు.