భారతదేశంలో నిరుద్యోగిత రోజురోజుకు పెరిగిపోతోంది. వందల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. లక్షల్లో నిరుద్యోగులు పరీక్షలు రాయడానికి సిద్దంగా ఉన్నారు. దీంతో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. అలా చిన్న చిన్న లొసుగులను ఉపయోగించుకుని ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నట్లు అనేక వార్తలు మనం చదువుతూనే ఉన్నాం. పోటీ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్ కొడుతూ ఎందరో పట్టుబడ్డ సంఘటనలు కూడా మనం చూశాం. ఈ క్రమంలో పోటీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడితే రూ. 10 కోట్ల జరిమానాతో పాటుగా జీవిత కాలం జైలు శిక్ష విధించేలా చట్టాన్ని రూపొందించి అమలు చేయనుంది జార్ఖండ్ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
జార్ఖండ్ ప్రభుత్వం సంచలనాత్మక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇప్పటి నుంచి పోటీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడితే.. వారికి రూ. 10 కోట్ల జరిమానాతో పాటుగా జీవిత ఖైదు చేసే విధంగా చట్టాన్ని రూపొందించారు. ఈ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టగా.. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ఈ బిల్లును ఆమోదించినట్లుగా తెలుస్తోంది. పరీక్షల్లో కాపీ కొట్టడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తూ.. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. పోటీ పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ బిల్లును బీజేపీ పార్టీ కృరమైన చట్టంగా వర్ణించింది.
కాగా.. ఈ సంచలనాత్మకమైన చట్టంపై జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ స్వయంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ..” బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టాలు ఎలా చేస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇలాంటి సంచలన చట్టం చేయడం దేశంలోనే ఇదే మెుదటిసారి కాదని, ఇప్పటికే ఇలాంటి చట్టాలని కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి” అంటూ సీఎం చెప్పుకొచ్చారు. మరి జార్ఖండ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట! ఆ కేసులో..