iDreamPost
android-app
ios-app

టెర్రరిస్టులతో పోరాడుతూ.. జవాన్లు వీరమరణం!

  • Published Jul 16, 2024 | 10:44 AM Updated Updated Jul 16, 2024 | 10:44 AM

జమ్ముకశ్మీర్ లో ఘోరం చోటుచేసుకుంది. టెర్రరిస్టులతో జరిగిన పోరులో జవాన్లు అమరులయ్యారు. ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ లో జవాన్లు వీరమరణం పొందారు.

జమ్ముకశ్మీర్ లో ఘోరం చోటుచేసుకుంది. టెర్రరిస్టులతో జరిగిన పోరులో జవాన్లు అమరులయ్యారు. ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ లో జవాన్లు వీరమరణం పొందారు.

టెర్రరిస్టులతో పోరాడుతూ.. జవాన్లు వీరమరణం!

ప్రపంచ దేశాలు టెర్రరిజాన్ని రూపుమాపేందుకు చర్యలు చేపడుతున్నప్పటికీ దారుణాలకు అడ్డుకట్ట పడడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట టెర్రరిస్టులు దాడులకు తెగబడుతూ రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. ఉగ్రదాడుల్లో జవాన్లు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. సామాన్య ప్రజలు సైతం టెర్రరిస్టుల కాల్పుల్లో మృతిచెందుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం జమ్మూలో ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్ పై దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. తాజాగా జమ్మూలో టెర్రిస్టలు మరోసారి ఎటాక్ చేశారు. ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో జవాన్లు వీరమరణం పొందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జమ్ముకశ్మీర్‌లోని దోడాలో టెర్రరిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. దోడా జిల్లాలోని దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి 7.45 గంటలకు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు, భద్రతాసిబ్బందికి మధ్య భీకర పోరు జరిగింది. టెర్రరిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఆర్మీ సిబ్బందితోపాటు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా ఆర్మీ అధికారితోపాటు మరో ముగ్గురు జవాన్లు మరణించారని అధికారులు వెల్లడించారు.

టెర్రరిస్టులను ఏరివేసేందుకు రాత్రి 9 గంటల సమయంలో ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైందని భారత ఆర్మీ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఉగ్రవాదులకు, భద్రతా సిబ్బందికి మధ్య భారీ కాల్పులు జరిగాయని ప్రకటించింది. ఈ ఎన్ కౌంటర్ లో గాయపడిన ఆర్మీ సిబ్బందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. టెర్రరిస్టులను అంతమొందించేందుకు ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్‌ ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన కశ్మీర్‌ టైగర్‌ ప్రకటించింది. ఉగ్రవాదుల వరుస దాడుల నేపథ్యంలో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. టెర్రరిస్టులను ఏరివేసేందుకు అణువణువున జల్లెడపడుతున్నారు. ఇక అమరులైన జవాన్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. జవాన్ల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.