Dharani
Dharani
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయం తర్వాత.. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ మరో అడుగు ముందుకు వేసింది. ఈ ప్రయోగం సక్సెస్‌తో అంతరిక్ష పథంలో భారత ప్రతిష్ట విశ్వవ్యాప్తం అయ్యింది. చంద్రయాన్ 3 ద్వారా ఏ దేశం చేయని సాహసం ఇండియా చేసింది. చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువం మీద కాలు మోపిన తొలి దేశంగా ఇండియా రికార్డు సృష్టించింది. అగ్ర దేశాలకు సైతం సాధ్యం కాని రీతిలో అతి తక్కువ ఖర్చుతో.. ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేసింది ఇస్రో. చంద్రయాన్ 3 విజయం సాధించిన నేపథ్యంలో.. భారత టెక్నాలజీపై అగ్రదేశాలకు ఆసక్తి ఏర్పడింది. చంద్రయాన్ 3 విజయం కావడంతో.. ఆ సాంకేతికత ఏంటో తెలుసుకోవడానికి అమెరికా సైతం ఆసక్తి కనబరుస్తోంది. చంద్రయాన్ 3 విజయం తర్వాత నాసా భారత టెక్నాలజీ గురించి అడిగిందని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు.
తాజాగా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా.. రామేశ్వరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇస్రో చీఫ్ సోమనాథ్. ఈ క్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్ 3 విజయం తర్వాత అమెరికా అంతరిక్ష రంగ నిపుణులు, నాసా అధికారులు భారత టెక్నాలజీ గురించి అడిగినట్లు వెల్లడించారు. చంద్రయాన్-3 వ్యోమనౌక అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత.. భారత్ అంతరిక్ష సాంకేతికతను తమతో పంచుకోవాలని నాసా-జెట్ ప్రొపెల్షన్ ల్యాబోరెటరీ నిపుణులు తమను కోరారని సోమనాథ్ వెల్లడించారు.
భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయం తర్వాత.. నాసా నుంచి ఆరుగురు నిపుణులు వచ్చి తమని కలిశారని సోమనాథ్ వెల్లడించారు. వారికి చంద్రయాన్ 3 ప్రయోగం గురించి పూర్తిగా వివరించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. దీనిలో భాగంగా ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఎలా అభివృద్ధి చేసింది.. దాని కోసం ఇస్రో ఇంజినీర్లు ఏ విధంగా కష్టపడ్డారు.. సేఫ్ ల్యాండింగ్ కోసం ఏం చేశారు వంటి వివిధ విషయాలను వారికి వివరించినట్లు తెలిపారు. అనంతరం ఇస్రో తయారు చేసిన సాంకేతిక పరికరాలను పరిశీలించిన నాసా నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారని, అవి చాలా తక్కువ ఖర్చుతో, నిర్మాణానికి సులభంగా, అత్యాధునిక సాంకేతికతతో ఉన్నాయని ప్రశంసించారని సోమనాథ్ చెప్పుకొచ్చారు.
అంతేకాక ఈ సాంకేతికత గురించి తమతో పంచుకోవాలని నాసా అధికారులు కోరినట్లు సోమనాథ్ వెల్లడించారు. అత్యంత చవకగా.. ఎంతో ఉన్నతమైన సాంకేతిక పరికరాలు, రాకెట్‌లను తయారు చేయగల సత్తా భారత్‌కు ఉందని సోమనాథ్ చెప్పారు. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు కూడా అవకాశాలు కల్పించారని అన్నారు. గత కొన్నేళ్లల్లో భారత్ సాంకేతికత సత్తా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుందన్నారు. చెన్నైలో అగ్నికుల్, హైదరాబాద్‌లో స్కైరూట్ సంస్థలు రాకెట్‌లను తయారు చేస్తున్నాయని.. ఇలా దేశంలో 5 కంపెనీలు రాకెట్లు, శాటిలైట్లను తయారు చేస్తున్నట్లు సోమనాథ్ చెప్పుకొచ్చారు.