భారత్‌లో అతిపెద్ద ప్రజా ప్రయాణ వ్యవస్థగా రైల్వేలు పేరు గడించాయి. దేశంలోని మారుమూల ప్రాంతాల వరకు ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్ వ్యాపించి ఉంది. ప్రతి రోజూ కొన్ని కోట్లాది మంది ప్రజలు రైల్వేలను వినియోగిస్తున్నారు. అందుకే ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించడంపై రైల్వే శాఖ ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి రైల్వే స్టేషన్లో మందులను అందుబాటులో ఉంచనుంది. దూర ప్రయాణాలు చేసే సమయంలో కొన్నిసార్లు ప్యాసింజర్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కొందరు ముందు జాగ్రత్తగా మెడిసిన్స్ తమ వెంట తెచ్చుకుంటారు.
ఆరోగ్య సమస్యల దృష్ట్యా కొందరు ప్రయాణికులు తమ వెంట మందులు తెచ్చుకున్నా.. చాలా మంది మెడిసిన్స్ దొరక్క, ఒకవేళ దొరికినా అధిక ధరల కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి ఇబ్బందుల పరిష్కారానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ప్రయాణికుల ఆరోగ్య సమస్యల దృష్ట్యా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకే మందులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాల పేరుతో ఈ మేరకు మెడికల్ స్టాల్స్‌ను ప్రారంభించనుంది. ఈ స్టాల్స్‌లో ప్రయాణికులకు వివిధ రకాల మందులను తక్కువ ధరకే విక్రయిస్తారు.
ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలు రైల్వే స్టేషన్లలోని రద్దీ ప్రదేశాల్లో, కాన్సోర్క్లలో ఏర్పాటు చేయనున్నారు. స్టేషన్‌కు వచ్చీపోయే ప్రయాణికులకు దీని వల్ల ప్రయోజనం కలుగుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసిన 50 రైల్వే స్టేషన్లలో ఈ మెడికల్ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ లిస్టులో దర్భంగా, ఆనంద్ విహార్, శ్రీనగర్, మైసూరు, లక్నో తదితర స్టేషన్లతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఈ స్టాల్స్‌కు సంబంధించిన ఈ-వేలం, నిర్వహణ లాంటివన్నీ రైల్వే డివిజన్ల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ మందుల కేంద్రాలను ఎన్ఐడీ అహ్మదాబాద్ డిజైన్ చేస్తోంది.