ఆసియాలోనే అరుదైన ఘటన.. కుక్కకు హార్ట్ సర్జరీ.. భారత్‌లోనే తొలిసారి..

Dog Heart Surgery: ఆసియాలోనే అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒక శునకానికి వైద్యులు హార్ట్ సర్జరీ చేశారు. ఇలా చేయడం భారతదేశంలోనే తొలిసారి కావడం విశేషం.

Dog Heart Surgery: ఆసియాలోనే అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒక శునకానికి వైద్యులు హార్ట్ సర్జరీ చేశారు. ఇలా చేయడం భారతదేశంలోనే తొలిసారి కావడం విశేషం.

ప్రాణం మనుషులది మాత్రమేనా.. మూగజీవాలది కూడా ప్రాణమే కదా. వాటికి కూడా ప్రాణం మీద తీపి ఉంటుంది. మనలానే బతకాలని కోరుకుంటాయి. ప్రయోగాల కోసం శాస్త్రవేత్తలు ఎలుకలను, కుక్కలను, పిల్లులను వాడుకోవడం చూశాం గానీ అవే జంతువులకు ఆపద వస్తే సర్జరీ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. వెటర్నరీ వైద్యులు ఓ కుక్కకు హార్ట్ సర్జరీ చేశారు. గుండె వ్యాధితో బాధపడుతున్న శునకానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.

బీగల్ జాతికి చెందిన జూలియట్ అనే ఏడేళ్ల కుక్క గత రెండేళ్లుగా మిట్రల్ వాల్వ్ వ్యాధితో బాధపడుతున్నట్లు వెటర్నరీ డాక్టర్లు గుర్తించారు. మిట్రల్ వాల్వ్ లో కలిగే మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుందని.. వ్యాధి తీవ్రత ఎక్కువైతే గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని వైద్యులు భావించారు. అందుకే హార్ట్ సర్జరీ చేయాలని అనుకున్నారు. ట్రాన్స్ కాథెటర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్ అనే హైబ్రిడ్ గుండె సర్జరీ చేశారు సర్జన్లు. మైక్రో సర్జరీని, సంప్రదాయ సర్జరీని కలిపితే ఈ ట్రాన్స్ కాథెటర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్ హైబ్రిడ్ సర్జరీ. దీని వల్ల తక్కువ ప్రమాదం కలిగి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఢిల్లీలోని మ్యాక్స్ పెట్జ్ హాస్పిటల్ వైద్యులు.. ట్రాన్స్ కాథెటర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్ ప్రక్రియ ద్వారా కుక్కకు సర్జరీ నిర్వహించారు.

ఈ ప్రక్రియలో శరీరానికి కోత పెట్టే పని లేకుండా రక్తనాళం ద్వారా ఒక సాధనాన్ని పంపుతారు. అలా పంపిన సాధనంతో సర్జరీ చేశారు. గుండె కొట్టుకుంటుండగానే ఈ ప్రక్రియను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. సర్జరీ జరిగిన రెండు రోజుల తర్వాత కుక్కను డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆ కుక్క ఆరోగ్యం బానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఇలాంటి సర్జరీ ఆసియాలోనే తొలిసారి అని.. ప్రపంచంలో రెండో సర్జరీ అని అన్నారు. మన దేశంతో పాటు ఇతర దేశాలకు చెందిన కుక్కల్లో మిట్రల్ వాల్వ్ వ్యాధి అనేది అత్యంత సాధారణ గుండె జబ్బు అని.. ఈ వ్యాధితో బాధపడుతున్న కుక్కలు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలిపారు.    

Show comments