సిక్కీంలో ఆకస్మిక వరదలు.. ఆర్మీ సైనికులు గల్లంతు!

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈశాన్య రాష్ట్రం సిక్కింలో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. మంగళవారం రాత్రి భారీగా కురిసిన వర్షాలకు ఇక్కడ లాచెన్ లోయలో గల తీస్తా నది ఒక్కసారిగా ఉప్పొంగి వరదలు చోటు చేసుకున్నాయి. ఈ వరదల్లో ఆర్మీ సైనికులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే..

ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో నిన్న రాత్రి భారీగా వర్షం కురిసింది. దీంతో తీస్తా నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగిపోయింది. అదే సమయంలో చుంగ్ థాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి దారుణంగా మారిపోయింది. దిగువ ప్రాంతంలో నీటి మట్టం 15 నుంచి 20 అడుగుల మేర పెరిగిపోవడంతో అర్థరాత్రి నుంచి వరదలు సంభవించాయి. వరదల కారణంగా లాచెన్ లోయలోని ఆర్మీ పోస్టులు నీట మునిగిపోయాయి. అంతేకాదు సింగ్తమ్ ప్రాంతంలో ఓ ఆర్మీ వాహనం సైతం కొట్టుకుపోయింది.

ప్రస్తుతం తీస్తా నది ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో లోతట్లు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉడాలని అధికారులు సూచించారు. వరద ప్రభావం వల్ల సింగ్తమ్ ఫూట్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. వరదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తూ.. వరదల కారణంగా పరిస్థితి తీవ్రంగా మారిందని.. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని.. ఇప్పటికే సహాయక చర్యలు తమ పనులు మొదలు పెట్టారని తెలిపారు. నదీపరివాహ ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలలని హెచ్చిరికలు జారీ చేశారు.

Show comments