iDreamPost
android-app
ios-app

ఐదు నిమిషాల్లో అంతా ముగిసింది.. ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటన వీడియో వైరల్‌

  • Published Jul 29, 2024 | 10:24 AM Updated Updated Jul 29, 2024 | 10:24 AM

Delhi Coaching Center Flooded Video Viral: ఢిల్లీలో కోచింగ్‌ సెంటర్లో పోటెత్తిన వరదల కారణంగా ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

Delhi Coaching Center Flooded Video Viral: ఢిల్లీలో కోచింగ్‌ సెంటర్లో పోటెత్తిన వరదల కారణంగా ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

  • Published Jul 29, 2024 | 10:24 AMUpdated Jul 29, 2024 | 10:24 AM
ఐదు నిమిషాల్లో అంతా ముగిసింది.. ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటన వీడియో వైరల్‌

కలెక్టర్‌ కావాలనే లక్ష్యంతో ఢిల్లీకి వెళ్లి.. కోచింగ్‌ సెంటర్‌లో జాయిన్‌ అయిన వారి కలలను వరదలు చిధిమేశాయి. తాజాగా అనగా శనివారం సాయంత్రం.. ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లోకి వరదనీరు పోటెత్తి.. సివిల్స్‌కు శిక్షణ పొందుతున్న విద్యార్థులు జీవితాలను మింగేసిన సంగతి తెలిసిందే. ఈ వరదల వల్ల.. ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. శనివారం సాయంత్రం కురిసిన భారీవర్షానికి భవనం సెల్లార్‌లోని కోచింగ్‌ సెంటర్‌ లైబ్రరీలోకి భారీగా వరద నీరు చేరింది. ఈ ఘటనలో తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తాన్యా సోని (25), ఉత్తర్ ప్రదేశ్‌కు చెంది శ్రేయా యాదవ్‌ (25), కేరళకు చెందిన నవీన్‌ డాల్విన్‌ (24) మృతిచెందారు. సివిల్ సర్వీసుకు ఎంపికై దేశానికి సేవ చేయాలనే వారి కలలను.. కోచింగ్‌ సెంటర్‌ యజమాని నిర్లక్ష్యం కల్లలు చేసింది.

కాగా, ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వర్షం కురుస్తుండటంతో కోచింగ్‌ సెంటర్‌ భవనం ముందు భారీగా వరద నీరు చేరింది. ఆ సమయంలో ఓ ఫోర్‌ వీలర్‌ వాహనం సెల్లార్‌లోకి దూసుకురాగా.. నీటి అలల ధాటికి గేటు విరిగి వరదనీరు సెల్లార్‌లోకి ప్రవహించినట్లు వీడియోలో రికార్డ్‌ అయ్యింది. ఇక వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులు.. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగెత్తారు. సోని, శ్రేయా, నవీన్ మాత్రం తప్పించుకోలేక నీటి మునిగి మృతి చెందారు. వరద పోటేత్తడం గమనించిన ఓ వ్యక్తి.. లోపల ఉన్న విద్యార్థులను బయటకు వచ్చేయమని అరిచి హెచ్చరించాడు.. ‘పిల్లలూ త్వరగా వచ్చేయండి.. కింద ఇంకా ఎవరైనా ఉన్నారా?’ అని అతడు అడగడం వీడియోల్లో చెప్పవచ్చు.

ఇక ఈ ఘటన జరిగిన మూడంతస్తుల భవనం సెల్లార్‌ను స్టోర్‌ రూమ్, పార్కింగ్‌ కోసం కేటాయిస్తామని ప్లాన్‌లో చూపించారు. కానీ, దీనికి విరుద్దంగా లైబ్రరీ నిర్వహిస్తున్నట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ప్రమాద సమయానికి అక్కడ 18 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. సెల్లార్‌ నుంచి రాకపోకల కోసం ఉన్న సింగిల్‌ బయోమెట్రిక్‌ ద్వారం పని చేయలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

అయితే, సెల్లార్‌లో మురుగునీరు బయటకు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ఢిల్లీ పోలీసులు.. స్టడీ సర్కిల్‌ యజమాని అభిషేక్‌ గుప్తా, కోఆర్డినేటర్‌ దేశ్‌పాల్‌ సింగ్‌లను అరెస్టు చేశారు. వీరిపై హత్యానేరం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పుకొచ్చారు.

ఈ దుర్ఘటన నేపథ్యంలో.. ఆదివారం వందల సంఖ్యలో విద్యార్థులు, స్థానికులు కోచింగ్‌ సెంటర్‌ ముందు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కరోల్‌బాగ్‌ మెట్రోస్టేషన్‌కు వెళ్లే రహదారిని దిగ్బంధించారు. పోలీసులు కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని తరలించారు. దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.