iDreamPost
android-app
ios-app

ఉదయనిధి వ్యాఖ్యల్ని సమర్థించిన స్టాలిన్.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!

  • Author singhj Published - 07:11 PM, Mon - 4 September 23
  • Author singhj Published - 07:11 PM, Mon - 4 September 23
ఉదయనిధి వ్యాఖ్యల్ని సమర్థించిన స్టాలిన్.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!

తమిళనాడు మంత్రి, కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోల్చడమే గాక దాన్ని సమూలంగా నిర్మూలించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సోషల్ మీడియాలోనూ ఆయన్ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో చర్చి, స్వామిజీ వద్దకు ఉదయనిధి వెళ్లిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

చర్చికి, స్వామిజీ దగ్గరకు వెళ్లడంపై ఉదయనిధి స్టాలిన్ సమాధానం చెప్పాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో తమిళనాడు గవర్నర్​ను బీజేపీ నేతలు కలిశారు. మంత్రి ఉదయనిధి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని గవర్నర్​ను కోరారు. ఉదయనిధి వ్యాఖ్యలతో కూడిన వీడియోతో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఈ కాంట్రవర్సీపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యల్ని సీఎం స్టాలిన్ సమర్థించారు. తన తనయుడు చెప్పిన దాంట్లో అక్షరం ముక్క కూడా తప్పులేదన్నారు.

కుమారుడు ఉదయనిధి వ్యాఖ్యల్ని సమర్థించిన ఎంకే స్టాలిన్ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం మీద ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ మతాన్ని ఆయుధంగా వాడుతోందని మండిపడ్డారు స్టాలిన్. మతపరమైన భావాల్ని రెచ్చగొట్టి.. ఆ మంట వెచ్చదనంలో చలికాచుకోవాలని చూస్తోందన్నారు. దేశ నిర్మాణాన్ని, ఐక్యతను నాశనం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు స్టాలిన్. ఇక, ఉదయనిధికి స్టార్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ మద్దతుగా నిలిచారు. సనాతన పార్లమెంట్ ఫ్యూచర్ ఇలా ఉంటుందేమో అంటూ మోడీ, స్వామీజీల ఫోటోను ఆయన షేర్ చేశారు.

ఇదీ చదవండి:సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి.. చరణ్​ ట్వీట్ వైరల్!