iDreamPost
android-app
ios-app

ఆరేళ్ల తర్వాత మళ్లీ వెలుగులోకి.. బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా కారణంగా బాలుడు మృతి!

  • Published Jul 07, 2023 | 6:24 PMUpdated Jul 07, 2023 | 6:24 PM
  • Published Jul 07, 2023 | 6:24 PMUpdated Jul 07, 2023 | 6:24 PM
ఆరేళ్ల తర్వాత మళ్లీ వెలుగులోకి.. బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా కారణంగా బాలుడు మృతి!

కరోనా మహమ్మారి బారి నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదు. దీనికి తోడు కొత్త కొత్త వైరస్‌లు, బ్యాక్టిరీయాలు పుట్టుకొచ్చి.. కొత్త రోగాలు తయారవుతున్నాయి. ఒక దాని నుంచి బయట పడేలోపే.. మరొకటి వెలుగులోకి వచ్చి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయి. తాజాగా మరో కొత్త జబ్బు వెలుగులోకి వచ్చింది. దీని కారణంగా పదో తరగతి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. నేగ్లేరియా ఫౌలెరీ జాతికి చెందిన మెదడు తినే అమీబా కారణంగా బాలుడు మృత్యువాత పడ్డాడు. స్నానం ద్వారా ఈ అమీబా బాలుడి శరీరంలో ప్రవేశించింది. మృతి చెందిన బాలుడిని 15 ఏళ్ల గురునాథ్‌గా గుర్తించారు. ఆదివారం నాడు బాలుడిని ఆస్పత్రిలో చేర్పించగా.. గత శుక్రవారం అతడు మృతి చెందాడు. గురునాథ్‌ స్థానిక వాగులో స్నానం చేస్తుండగా.. ఈ అమీబా అతడి శరీరంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు.

ఇక ఈ నేగ్లేరియా ఫౌలెరీ అనేది ఒక స్వేచ్ఛా జీవన ఏకకణ అమీబా జీవి.ఇది సాధారణంగా వెచ్చని మంచినీరు (సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటివి) ఉండే ప్రాంతాలు, మట్టిలో కనిపిస్తుంది. నేగ్లేరియాకు చెందిన ఒక జాతి మాత్రమే ప్రజలకు సోకుతుంది. దాన్నే ప్రజలు నేగ్లేరియా ఫౌలెరి అంటారు. ఇది మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత.. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పీఏఎం)కి కారణమవుతుంది.. ఫలితంగా బాధితుడు మృతి చెందుతాడు. ఇంతకు ముందు 2017లో అలప్పుజలో ఈ వ్యాధి నమోదైందని మలయాళ మనోరమ ఒక నివేదికలో పేర్కొంది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, అమీబా ఉన్న నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు నేగ్లేరియా ఫౌలెరి బారిన పడతాం. ప్రజలు మురికి నీటిలో ఈత కొట్టడం, డైవింగ్ చేయడం వంటివి చేసినప్పుడు.. ఈ అమీబా ముక్కు నుంచి శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుతుంది. ఆ తర్వాత అది మెదడు కణజాలాన్ని నాశనం చేయడం ద్వారా ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌కు కారణం అవుతుంది. ఫలితంగా మృత్యువాత పడతారు. అయితే, కలుషిత నీరు తాగడం వల్ల ప్రజలు ఈ వ్యాధి బారిన పడరు అని సీడీసీ స్పష్టం చేసింది.

లక్షణాలు ఎలా ఉంటాయంటే..

  • ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ ప్రాథమిక లక్షణాలు 5 రోజుల తర్వాత ప్రారంభమవుతాయి.
  • అమీబా మన శరీరంలోకి చేరిన 1-12 రోజులలోపు ఎప్పుడైనా ప్రాథమిక లక్షణాలు కనిపించవచ్చు.
  • ప్రారంభంలో తలనొప్పి, జ్వరం, వికారం లేదా వాంతులు అవుతుంటాయి.
  • తరువాతి లక్షణాలలో మెడ గట్టిపడటం, గందరగోళం, చుట్టూ ఉండే వ్యక్తులు, పరిసరాల పట్ల శ్రద్ధ లేకపోవడం, మూర్ఛలు, భ్రాంతులు, ఆఖరికి కోమాలోకి వెళ్లడం జరుగుతుంది.
  • లక్షణాలు కనిపించడం ప్రారంభం అయిన తర్వాత వ్యాధి వేగంగా అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా.. 5 రోజులలో బాధితుడు మృత్యువాత పడే అవకాశం ఉంది.
  • అయితే కొంతమంది రోగులు 18 రోజుల వరకు జీవించగలరని సీడీసీ నివేదిక పేర్కొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి