iDreamPost
android-app
ios-app

వైన్ షాప్ మూసేయాలంటూ హైకోర్టులో 5 ఏళ్ల కుర్రాడి పిటిషన్!

  • Published May 09, 2024 | 9:27 PM Updated Updated May 09, 2024 | 9:27 PM

పిల్లలు చదువుకునే స్కూల్ దగ్గరలో వైన్ షాప్ ఉండడమే తప్పు. పైగా స్కూల్ కెళ్లే పిల్లలని ఈ మందు బాబులు ఇబ్బంది పెడుతున్నారు. అయితే దీనిపై ఓ ఐదేళ్ల కుర్రాడు కోర్టులో పిటిషన్ వేశాడు.

పిల్లలు చదువుకునే స్కూల్ దగ్గరలో వైన్ షాప్ ఉండడమే తప్పు. పైగా స్కూల్ కెళ్లే పిల్లలని ఈ మందు బాబులు ఇబ్బంది పెడుతున్నారు. అయితే దీనిపై ఓ ఐదేళ్ల కుర్రాడు కోర్టులో పిటిషన్ వేశాడు.

వైన్ షాప్ మూసేయాలంటూ హైకోర్టులో 5 ఏళ్ల కుర్రాడి పిటిషన్!

మద్యం తాగే ఊరందరి చేత తాగుడు అలవాటు మానిపించి శభాష్ అనిపించుకున్నాడు సూర్యం. ఈ సూర్యం రుద్రవీణ సినిమాలోని చిరంజీవి చేసిన క్యారెక్టర్ పేరు. వినడానికే ఇంత బాగుంటే ఇదే సీన్ నిజ జీవితంలో జరిగితే. మనుషులతో తాగుడు మానిపించలేదు కానీ ఒక వైన్ షాప్ మీద కేసు వేసి గెలిచాడు. అలా అని ఆ వ్యక్తి ఏమీ పెద్ద ఉద్యమకారుడు కాదు, పెద్ద మనిషి అంతకంటే కాదు. ఓ ఐదేళ్ల స్కూల్ విద్యార్థి. అవును ఎల్కేజీ చదువుతున్న ఒక కుర్రాడు వైన్ షాప్ కి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేశాడు. ఐదేళ్ల వయసులో ఏ కుర్రాడైనా ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుంటారు. కానీ ఈ పిల్లోడు మాత్రం ఎవరికీ సాధ్యం కాని పని చేసి అందరి మన్ననలు పొందుతున్నాడు. 

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో సేత్ ఎంఆర్ జైపురియా స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న అథర్వ దీక్షిత్ అనే కుర్రాడు.. అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ కుర్రాడు చదివే స్కూల్ దగ్గర ఒక వైన్ షాప్ ఉంది. 20 మీటర్ల దూరంలో ఉందా వైన్ షాప్. రోజూ వైన్ షాప్ దగ్గర రద్దీ, జనాల కోలాహలంతో స్కూల్ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని అథర్వ భావించాడు. ఉదయం 6, 7 గంటలకే వైన్ షాప్ తెరవడం వల్ల.. అటుగా వచ్చే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మద్యం తాగే వాళ్ళ వల్ల పిల్లలకు ముప్పు వాటిల్లుతుందని స్కూల్ కి వెళ్లేందుకు భయపడుతున్నారు. అథర్వ కూడా వాళ్లకి భయపడి స్కూల్ కి వెళ్లడం మానేసేవాడట. ఆ స్కూల్లో మొత్తం 475 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే వీళ్ళలో ఎవరూ చేయని పని అథర్వ చేశాడు.

వైన్ షాప్ కి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసి విజయం సాధించాడు. ముందుగా తన తండ్రి సహాయంతో కాన్పూర్ జిల్లా కలెక్టర్ కి, ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కి, యూపీ సీఎంఓ పోర్టల్ లో ఫిర్యాదులు చేశాడు. అయితే అథర్వ చదువుతున్న స్కూల్ 2019లో ప్రారంభించారని.. దాని కంటే ముందు నుంచి అంటే 30 ఏళ్ల నుంచి ఈ వైన్ షాప్ ఉందని.. ఇంకా కాంట్రాక్ట్ పూర్తి కాలేదని ఎక్సైజ్ శాఖ తెలిపింది. వైన్ షాప్ ని తరలించడానికి ఎక్సైజ్ శాఖ నిరాకరించండతో అథర్వ.. దీనిపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. తండ్రితో కలిసి లాయర్ అశుతోష్ శర్మ ద్వారా హైకోర్టులో 4 నెలల క్రితం పిటిషన్ వేశాడు. మద్యం షాపు వల్ల స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..  తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఆ వైన్ షాప్ ని అక్కడ నుంచి వేరే చోటకు తరలించాలని పిటిషన్ లో కోరాడు.

అయితే ఈ పిటిషన్ ను విచారించిన అలహాబాద్ హైకోర్టు.. దీనిపై వివరణ ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు సూచించింది. ఎక్సైజ్ శాఖ ఇంకా కాంట్రాక్ట్ ఉందని తెలిపింది. తాజాగా ఈ పిటిషన్ కి సంబంధించి హైకోర్టు తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకూ మాత్రమే ఆ వైన్ షాప్ ని అక్కడ ఉంచాలని.. తర్వాత కాంట్రాక్ట్ ని రద్దు చేయాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్ట్ ని ఎట్టి పరిస్థితుల్లో రెన్యువల్ చేయడం గానీ, కాంట్రాక్ట్ పీరియడ్ ని పొడిగించడం గానీ చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. 2025 మార్చి 31 వరకూ మాత్రమే ఆ వైన్ షాప్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి అప్పటి వరకూ ఉంచాలని.. ఆ తర్వాత అక్కడ నుంచి తరలించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో అథర్వ విజయం సాధించినట్లయ్యింది. లేదంటే లోకల్ పాలిటిక్స్ తో ప్రభావితం చేసి ఇంకా అక్కడే కొనసాగేవారు. మరి ఐదేళ్ల కుర్రాడు వైన్ షాప్ కి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేసి విజయం సాధించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.