iDreamPost
android-app
ios-app

అభిషేక్ పిక్చర్స్​పై విజయ దేవరకొండ తండ్రి సీరియస్!

  • Author singhj Published - 04:43 PM, Sat - 9 September 23
  • Author singhj Published - 04:43 PM, Sat - 9 September 23
అభిషేక్ పిక్చర్స్​పై విజయ దేవరకొండ తండ్రి సీరియస్!

‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా వసూళ్ల విషయంలో రౌడీస్టార్ విజయ్ దేవరకొండపై నిర్మాణ సంస్థ, పంపిణీదారు అయిన అభిషేక్ పిక్చర్స్​ రీసెంట్​గా ఆరోపణలు చేసిన సంగతి తెలిసందే. దీంతో అభిషేక్ పిక్చర్స్ కామెంట్స్​పై విజయ్ దేవరకొండ తండ్రి గోవర్దన్ రావు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన కొడుకు మీద ఇలాంటి ఆరోపణలు చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. ఒక సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే పరిహారం చెల్లించాల్సిన అవసరం తమకేం ఉందని ఆయన ప్రశ్నించారు. ఇక, విజయ్ దేవరకొండ కెరీర్​లో సరిగ్గా ఆడని చిత్రాల్లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఒకటి. ఈ మూవీ ఫెయిల్ అవడంతో విజయ్ తన రెమ్యూనరేషన్​లో 50 శాతాన్ని ఆ చిత్ర నిర్మాత కేఎస్ రామారావుకు తిరిగి ఇచ్చేశాడని గోవర్దన్ రావు అన్నారు.

‘వరల్డ్ ఫేమస్ లవర్ పరాజయంతో విజయ్ తన రెమ్యూనరేషన్​లో 50 శాతాన్ని నిర్మాత కేఎస్ రామారావుకు తిరిగి ఇచ్చేశాడు. ఆయన ఇస్తానన్న ఫ్లాట్​ను కూడా విజయ్ వద్దన్నాడు. ఆ మూవీ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామాతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు. చిత్రం వసూళ్ల విషయంలో నిర్మాతతో ఆయనకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అప్పటి నుంచి ఆయన విజయ్​ను టార్గెట్ చేసుకున్నాడు’ అని విజయ్ దేవరకొండ తండ్రి గోవర్దన్ రావు చెప్పుకొచ్చారు. అభిషేక్ నామా చాన్నాళ్ల నుంచి తమను ఇబ్బంది పెడుతున్నారని గోవర్దన్ రావు తెలిపారు. ఒకవేళ మేం డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆయన కోర్టును సంప్రదించాల్సిందని.. అంతేగానీ, ఇలా పబ్లిక్​గా ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదన్నారు. బ్లాక్​మెయిల్ చేసినంత మాత్రాన ఏమీ జరగదని స్పష్టం చేశారు.

విజయ్​తో మూవీ చేయాలనే ఉద్దేశంతో ఒకసారి అభిషేక్ తమను సంప్రదించారని.. అయితే ఆయన ప్రవర్తన చూసిన తర్వాత మేం కలసి పనిచేయాలని అనుకోవడం లేదన్నారు గోవర్దన్ రావు. కాగా, విజయ్ నటించిన రీసెంట్ మూవీ ‘ఖుషి’ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తన రెమ్యూనరేషన్​లో నుంచి రూ.కోటిని ఫ్యాన్స్​కు ఇస్తానని ఓ ఈవెంట్​లో రౌడీస్టార్ ప్రకటించారు. ఇది చూసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామాకు చెందిన అభిషేక్ పిక్చర్స్ ఒక ట్వీట్ చేసింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా డిస్ట్రిబ్యూషన్​తో రూ.8 కోట్లు నష్టపోయాం. దీని మీద ఎవరూ స్పందించలేదు. మీరు రూ.కోటిని పలు కుటుంబాలు ఇస్తున్నారు. మా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలకు కూడా సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నాం’ అని పేర్కొంది.

ఇదీ చదవండి: మరో హాలీడే సీజన్​ను మిస్సవుతున్న టాలీవుడ్!