iDreamPost
android-app
ios-app

విజయ్ దేవరకొండ రూ.కోటి విరాళం.. అవసరం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోండిలా..!

  • Author singhj Updated - 07:08 PM, Tue - 5 September 23
  • Author singhj Updated - 07:08 PM, Tue - 5 September 23
విజయ్ దేవరకొండ రూ.కోటి విరాళం.. అవసరం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోండిలా..!

టాలీవుడ్​లో తక్కువ టైమ్​లో స్టార్ స్టేటస్ సంపాదించిన వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. హీరోగా నటించిన మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’తోనే మంచి హిట్ కొట్టారు విజయ్. ఆ తర్వాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి’తో సంచలన విజయాన్ని అందుకున్నారు. అనంతరం ‘గీత గోవిందం’తో సూపర్​హిట్​ కొట్టి స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయారు. ‘మహానటి’లో చేసిన పాత్ర కూడా ఆయన్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. అయితే ‘గీత గోవిందం’ తర్వాత చేసిన సినిమాల్లో ‘ట్యాక్సీవాలా’ తప్ప మిగతావేవీ పెద్దగా అలరించలేదు. విజయ్ గత చిత్రం ‘లైగర్’ అయితే భారీ డిజాస్టర్​గా నిలిచింది.

‘లైగర్’ ఫ్లాప్​గా నిలవడంతో విజయ్ దేవరకొండకు అర్జెంటుగా ఒక హిట్ అవసరం పడింది. ఈ తరుణంలో ఇటీవల విడుదలైన ‘ఖుషి’ చిత్రం ఆయనకు మంచి ఊరటను ఇచ్చింది. రౌడీస్టార్ సరసన సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా మూడ్రోజుల్లోనే రూ.75 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శివ నిర్వాణ డైరెక్ట్‌ చేసిన ‘ఖుషి’కి మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చేసింది. వసూళ్ల పరంగా దూసుకెళ్తుండటంతో మూవీ టీమ్ సక్సెస్​ను ఎంజాయ్ చేస్తోంది. సినిమా ప్రమోషన్​లో భాగంగా విశాఖపట్నం చేరుకున్న విజయ్.. తన ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్ చెప్పారు. ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉన్నానని విజయ్ దేవరకొండ అన్నారు.

ఈ సక్సెస్​లో ఫ్యాన్స్​ను కూడా భాగం చేయడానికి తన రెమ్యూనరేషన్​లో నుంచి కుటుంబానికి రూ.లక్ష చొప్పున 100 కుటుంబాలకు మొత్తంగా రూ.కోటి ఇవ్వనున్నట్లు విజయ్ దేవరకొండ ప్రకటించారు. దీంతో రౌడీస్టార్ ఫ్యాన్స్ సర్​ప్రైజ్ అయ్యారు. రాబోయే పది రోజుల్లో 100 కుటుంబాలను ఎంపిక చేసి, ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష చొప్పున తానే స్వయంగా అందిస్తానని విజయ్ తెలిపారు. అవసరం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వాటిలో నుంచి 100 ఫ్యామిలీలను ఎంపిక చేస్తామన్నారు విజయ్. స్ప్రెడింగ్ ఖుషి అని సోషల్ మీడియాలో ఒక అప్లికేషన్ ఫార్మ్ పెడతానన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేస్తానన్నారు రౌడీస్టార్. అభిమానులనే కాదు.. ఆర్థిక సాయం కావాల్సిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 800 మూవీ: మురళీధరన్ లైఫ్​లో ఇన్ని కష్టాలా?