వైద్యానికి డబ్బుల్లేక.. దీన స్థితిలో కన్ను మూసిన నటి

సినిమా ఇండస్ట్రీ అనగానే పేరు, ప్రతిష్టలతో పాటు విపరతీమైన సంపాదన ఉంటుంది అనుకుంటారు చాలా మంది. అయితే సినీ ఇండస్ట్రీలోకి వెళ్లిన ప్రతి ఒక్కరు గుర్తింపు తెచ్చుకుని.. కోటీశ్వరులు కావడం అనేది కల్ల. చాలా మంది.. తినడానికి ఒక్క పూట తిండి కూడా లేక.. ఎంతో దయనీయ స్థితిలో జీవితాలను వెళ్లదీస్తుంటారు. ఇక మరి కొందరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. సినిమాల్లో సక్సెస్‌ సాధించినా.. అవకాశాలు రాక.. ఆర్థిక పరిస్థితి దిగజారి.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాజాగా ఓ నటి ఇలా ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తూ.. కనీసం వైద్యానికి కూడా చేతిలో చిల్లి గవ్వ లేక.. అత్యంత దీన స్థితిలో కన్ను మూసింది. ఆ వివరాలు..

హీరోయిన్‌ అంజలి నటించిన షాపింగ్‌ మాల్‌ సినిమా గుర్తుందా.. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సింధు(44) అనారోగ్యంతో బాధపడుతు సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. షాపింగ్‌ మాల్‌ చిత్రం తర్వాత సింధు.. అనేక సినిమాల్లో యాక్ట్‌ చేసింది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం అనగా 2020లో ఆమెకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ సోకింది. దాంతో పరిస్థితులు తారుమారయ్యాయి. అన్నాళ్లు దాచుకున్న కొంత డబ్బు.. వైద్యం కోసం ఖర్చవ్వగా.. అనారోగ్యం వల్ల అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ఆస్పత్రికి వెళ్లకుండ ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకోసాగింది.

కానీ కొన్ని రోజుల క్రితం సింధు ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. ఇక తప్పని పరిస్థితుల్లో.. డబ్బులు లేకపోయినా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరింది. అయితే చికిత్స చేయించుకునేందుకు ఆమె వద్ద ఉన్న డబ్బులు చాలక.. అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆఖరికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రాణాలు విడిచింది. సింధు మృతి గురించి తెలిసి ఆమె తోటి నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక సింధు పుట్టినప్పటి నుంచే కష్టాలతో పోరాడుతూ ఉంది. 14వ ఏటనే పెళ్లి చేశారు. అవదే ఏడాది బిడ్డకు జన్మనిచ్చింది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. ఆర్థిక సమస్యలు మాత్రం తీరలేదు. చివరకు క్యాన్సర్‌ బారిన పడి.. చికిత్సకు డబ్బులు లేక మృత్యువాత పడింది.  ఆమె మృతి పట్ల తోటి నటీనటులు సంతాపం తెలుపుతున్నారు.

Show comments